Home నల్లగొండ ప్లాస్టిక్ కవర్ల నిషేధం హుళక్కేనా!!

ప్లాస్టిక్ కవర్ల నిషేధం హుళక్కేనా!!

Plastic

మిర్యాలగూడః  పర్యావరణాన్ని కబలిస్తూ, ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే ప్లాస్టిక్ బూతాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అధికారుల ఉదాసీన వైఖరి, ప్రజల్లో చైతన్యం లేని కారణంగా ప్లాస్టిక్ కవర్ల నిషేదం ఎక్కడ జరుగుతుందని మేధావులు  ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ శాఖా మంత్రి కె.రామా రావు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. హోల్‌సేల్ వ్యా పా రుల ప్లాస్టిక్ వస్తువులను యథేచ్ఛగా విక్ర యా లు జరుపుతున్నా అధికారులు  ఉరుము ఉరి మి మంగళం మీద పడ్డ చందంగా చిరు వ్యాపా రులపై అప్పుడప్పుడు కొరడా ఝులిపించి నామమాత్రపు అపరాధ రుసుమును విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నా యి.

మిర్యాలగూడ పట్టణ నడిబొడ్డులో హోల్‌సేల్ వ్యాపారులు బహిరంగంగా ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్నా వారిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 40 మైక్రాన్లు కలిగివున్న కవర్లను మాత్రమే వినియోగించాలని నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా అమలు జరగడం లేదు. 40 మైక్రాన్లు తక్కువ ఉన్న పలుచటి కవర్లను వాడటం వల్ల పర్యావరణానికి హానికలుగడంతో పాటు ప్రజ లు క్యాన్సర్ బారిన  పడే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వ్యాపారులకు ఇవేమి పట్టవు. ధనార్జనే ధ్యేయంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా విరా జిల్లుతుంది. నియమావళికి విరుద్ధంగా పలుచటి కవర్లను అమ్మే వారికి మూడు వేల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష వేయాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారుల చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

వ్యాపారులు అందిస్తున్న ముడుపుల తలొగ్గిన కొందరు అధికారుల చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం మూలంగా కాలుష్యం విషతుల్యమై ఓజోన్ పొర దెబ్బతిని ఎండ తీవ్రత ఎక్కువవుతుంది. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే భానుడు విశ్వరూపం దాల్చడం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు, మటన్, చికెన్‌తో పాటు తినే వస్తువులను ప్లాస్టిక్ కవర్లలో పెట్టుకొని వెళ్తున్న సంఘటనలు కళ్ళ ఎదుటే కనబడుతున్నా నిషేదం ఎవరి బాధ్యతా అని సమాజం ప్రశ్నిస్తుంది. ప్లాస్టిక్‌ను పశువులు మేతగా భావిస్తూ వాటి ఆరోగ్యాన్ని ఇబ్బందులకు గురిచేసుకుంటున్నాయి.   ఇప్పటికైనా అధికారులు, ప్రజలు, మేల్కొని మానవాళికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కంకణబద్ధులైనప్పుడే నిషేదం సాధ్యమవుతుంది.