Home రాష్ట్ర వార్తలు కేంద్రంపై కెసిఆర్ నిందలు

కేంద్రంపై కెసిఆర్ నిందలు

Bandaru-Dattatreya

జిఎస్‌టిపై అసత్య ఆరోపణలు : కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల వ్యయంపై 12 శాతం జిఎస్‌టి పన్నును విధించడంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై అనవసర ఆరోపణలను చేస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఇఎస్‌ఐసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం వెచ్చించే మొత్తం లో 12 శాతం పన్నుగా చెల్లించాలంటూ నిర్ణయించింది జిఎస్‌టి కౌన్సిల్ అని పేర్కొన్నారు. ఈ కౌన్సిల్‌లో కేంద్రం తో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నారన్నారు. ఈ నిర్ణయంపై పునఃసమీక్షించేందుకు వీలుందని కేంద్రంతో పాటు జిఎస్‌టి కౌన్సిల్ పలు సందర్భాలలో స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదేదో కేంద్రం చేసిన తప్పిదమన్నట్లు మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు పదే పదే కేంద్రంపై నిందలు వేస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని, ఇప్పటికైనా వారు తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్నారు. ఏయే వస్తువులు జిఎస్‌టి పరిధిలోకి తీసుకు రావాలి, వేటికి ఎంతెంత పన్నును ఖరారు చేయాలి, వేటికి మినహాయింపులు ఇవ్వాలన్న అంశాలపై జిఎస్‌టి కౌన్సిల్ అనేక పర్యాయాలు భేటీ అయిందని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటినీ మరిచిపోయిన సిఎం కేంద్రంపై పోరాటం చేస్తానని, అవసరమైతే కోర్టులకు వెళ్తామని అనడం సరైంది కాదన్నారు. జిఎస్‌టి పన్ను రానున్న కాలంలో తగ్గే అవకాశాలున్నాయని, ప్రాజెక్టుల నిర్మాణం కోసం వినియోగించే సిమెంట్, స్టీల్ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఇవి మరింతగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు రైతాంగానికి, ప్రజలకు ఉపయోగపడేవి కాబట్టి 12 శాతం పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడుతానని దత్తాత్రేయ అన్నారు. ఇదే విషయంపై ఆర్థిక శాఖ అధికారులతోనూ చర్చిస్తానని చెప్పారు. జిఎస్‌టి అమలు పూర్తి పారదర్శకంగా సాగుతోందని, ఇందులో ఎలాంటి అవకతవకలుండవన్నారు.

మనోభావాలకు ప్రతిబింబం వెంకయ్య గెలుపు
ఉప రాష్ట్రపతిగా ఎం. వెంకయ్యనాయుడు భారీ విజయం సాధించడం పట్ల దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గెలుపు ప్రజల మనోభావాలకు ప్రతిబింబించాయన్నారు. మూడేళ్ళ మోడీ పాలనకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు సాక్షమని అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాలతో పాటు టిఆర్‌ఎస్, వైసిపి లాంటి పార్టీలు కూడా మద్దతివ్వడం సరికొత్త పరిణామమని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడుది నైతిక విజయమని చెప్పారు. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య మరింత వన్నె తెస్తారన్న విశ్వాసం తనకుందన్నారు.అసంఘటిత రంగ కార్మికులకు మరింత సామాజిక భద్రత సంఘటిత రంగంలోని కార్మికులకు ధీటుగా అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ఇఎస్‌ఐసితో ఫ్యాక్టరీస్ అఢ్వయిజరీ అండ్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కార్మికుల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా హెల్త్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లను ఆయా ప్రాంతాలలో నెలకొల్పనున్నామన్నారు. ఇప్పటికే ఫరీదాబాద్‌లో ఈ ఇనిస్టిటిట్యూట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే ముంబై, కొల్‌కత్తా, చెన్నై, కాన్పూర్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

బహ్రెయిన్‌లోని మహిళను కాపాడుతా
బహ్రెయిన్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్ మహిళను కాపాడుతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన మంజుల కొన్నాళ్ళ క్రితం బతుకుతెరువు కోసం బహ్రెయిన్ వెళ్ళింది, ప్రస్తుతం ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని బాధితురాలి భర్త రవి కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన దత్తాత్రేయ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి మహిళను హైదరాబాద్‌కు రప్పిస్తానని హామీ ఇచ్చారు.