Home తాజా వార్తలు కూనలే కానీ..

కూనలే కానీ..

భారీ అంచనాలతో అఫ్గాన్, బంగ్లాదేశ్
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచకప్‌లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న జట్లు ఏమైనా ఉన్నాయంటే అవి బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు మాత్రమే. హేమాహేమీ జట్ల మధ్య జరిగే సంగ్రామంలో ఈ జట్లు ట్రోఫీని సాధించడం అనుకున్నంత తేలికకాదు. అయితే 1983లో భారత్, 1987లో ఆస్ట్రేలియాలు కూడా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 1983 ప్రపంచకప్‌లో భారత్ కనీసం ఒక్క విజయం సాధించినా అద్భుతమేనని అప్పట్టో అందరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో పసికూనగా బరిలోకి భారత్ పెద్ద పెద్ద జట్లను చిత్తుచిత్తుగా ఓడిస్తూ ఏకంగా ట్రోఫీని ఎగురేసుకు పోయింది. ఆ ప్రపంచకప్‌తో భారత్ దశనే మారిపోయింది. ఆస్ట్రేలియా కూడా 1987లో ఇలాంటి విజయాన్నే అందుకుంది. ఉపఖండంలో జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, తాజాగా ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఇలాంటి గెలుపుపై కన్నేశాయి. అయితే ఈ జట్ల ఆశ నెరవేరడం క్లిష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదని చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇటు బంగ్లాదేశ్, అటు అఫ్గాన్‌లు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంచలన జట్లుగా పేరు తెచ్చుకున్నాయి.

 

ఎలాంటి జట్టునైనా చిత్తు చేసే సత్తా ఇరు జట్లకు ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సాకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్ఫికుర్ రహీం, మశ్రఫె ముర్తుజా, సౌమ్యసర్కార్, ముస్తఫిజుర్ రహ్మన్ వంటి మ్యాచ్ విన్నర్లు బంగ్లాదేశ్‌కు అందుబాటులో ఉన్నారు. సాకిబ్, రహీం, తమీమ్, ముస్తఫిజుర్ ఈ ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక, అఫ్గానిస్థాన్‌లో కూడా ప్రతిభావంతులకు కొదవలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్‌ఖాన్ అఫ్గాన్ జట్టులో ఉన్నాడు. మహ్మద్ నబి వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌లో అఫ్గాన్ స్ఫూర్తిదాయక విజయాలు సాధిస్తూ పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. పెద్దపెద్ద జట్లను సయితం అలవోకగా ఓడిస్తూ బలమైన జట్టుగా రూపుదిద్దు కొంటోంది. ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్ కొన్ని సంచలన విజయాలు సాధించడం ఖాయమని చాలా మంది జోస్యం చెబుతున్నారు. సంచలనాలు సృష్టించే సత్తా పుష్కలంగా ఉన్న అఫ్గాన్ పెద్ద పెద్ద జట్లకు కూడా సవాలుగా మారింది. ఇప్పటికే బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక వంటి జట్లను ఓడించిన ఘనత అఫ్గాన్‌కు ఉంది. దీంతో ప్రపంచకప్‌కు అఫ్గాన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఆ సత్తా ఉంది..


ఇక, ఈ ప్రపంచకప్‌లో సంచలన విజయాలు సాధించే సత్తా ఇటు బంగ్లాదేశ్‌కు, అటు అఫ్గానిస్థాన్‌కు ఉందని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. ఇటీవల ఐర్లాండ్ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ వంటి బలమైన జట్టును ఓడించి బంగ్లాదేశ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచకప్‌లో కూడా బంగ్లాదేశ్‌పై అంచనాలు పెరిగాయి. ఒకటి రెండు సంచలన విజయాలు సాధించడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. తమదైన రోజు ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా బంగ్లాదేశ్‌కు ఉంది. గతంలో జరిగిన పలు ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్ ఇటువంటి విజయాలే సాధించింది. ఈసారి కూడా పెద్ద జట్లకు షాక్ ఇచ్చే ఆలోచనలో బంగ్లా జట్టు ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉండడంతో బంగ్లా దీనిలో సఫలం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక, తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అఫ్గాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ జట్టు కూడా ఒకటి రెండు సంచలన విజయాలు సాధించినా ఆశ్చర్యం లేదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండిన అఫ్గాన్ భారీ ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. బరిలో ఉన్నా ఏ జట్టును ఓడించినా అఫ్గాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. కప్పు సాధించక పోయినా కొన్ని విజయాలు సాధించాలనే పట్టుదలతో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు సిద్ధమయ్యాయి. ఇందులో ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాల్సిందే.

bangladesh, Afghan also strong teams in World Cup 2019