ఢాకా : బంగ్లాదేశ్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. ఈనెల 11 అర్థరాత్రి 12 గంటల వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా అమలులో ఉంటుంది. ఈ ఏడు రోజులూ సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఇళ్లు విడిచి బయటకు వెళ్లరాదని ప్రభుత్వం సూచించింది. లాక్డౌన్ విధింపును వ్యతిరేకిస్తూ చిన్న వ్యాపారులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా కరోనా ఉద్ధతి తీవ్రంగా ఉన్నందున జాగ్రత్త కోసం విధించక తప్పడం లేదని ప్రభుత్వం వివరించింది.
కొవిడ్ చికిత్స కోసమే ప్రత్యేక ఆస్పత్రులు, ఐసియు పడకల సంఖ్యను పెంచుతున్నామని వెల్లడించింది. ఆదివారం వరకు బంగ్లాదేశ్లో గడచిన 24 గంటల్లో తాజాగా 7087 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,37,564కు చేరుకుంది. అలాగే కొత్తగా 53 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 9266 కు చేరుకుం ది. అత్యవసర సర్వీసులు తప్ప రోడ్డు, రైల్వే, నదీ, రవాణా సర్వీసులు, డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆపివేశారు. బంగ్లాదేశ్లో లాక్డౌన్ విధించడం రెండోసారి. గత ఏడాది మార్చి 26 నుంచి మే 30 వరకు 66 రోజుల పాటు లాక్డౌన్ విధించారు.