Thursday, March 28, 2024

బంగ్లా ముందు భారీ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

సెంచరీలతో కదంతొక్కిన శుభ్‌మన్, పుజారా
పటిష్టస్థితిలో టీమిండియా

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్లకు 258 పరుగులు సాధించి డిక్లేర్డ్ చేసింది. ఇదే క్రమంలో ఆతిథ్య బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇక రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఇక మిగిలిన రెండు రోజుల ఆటలో మరో 471 పరుగులు సాధిస్తే బంగ్లాదేశ్‌కు విజయం దక్కుతోంది. అయితే పటిష్టమైన భారత బౌలింగ్ లైనప్‌ను తట్టుకుని ఈ స్కోరును సాధించడం షకిబ్ సేనకు శక్తికి మించిన పనిగానే చెప్పాలి. ఏదైన అనూహ్యం జరిగితే తప్ప టీమిండియాకే తొలి టెస్టులో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక శుక్రవారం 133/8తో మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. మరో 17 పరుగులు జోడించి బంగ్లాదేశ్ ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌యాదవ్ ఐదు, సిరాజ్ మూడు వికెట్లు తీశారు. ఉమేశ్, అక్షర్ పటేల్‌లకు తలో వికెట్ లభించింది. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపింది.
గిల్, పుజారా జోరు
ఇక రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. రాహుల్ రక్షణాత్మక బ్యాటింగ్‌ను కనబరచగా గిల్ దూకుడును ప్రదర్శించాడు. అయితే 23 పరుగులు చేసిన రాహుల్‌న ఖలేద్ అహ్మద్ వెనక్కి పంపాడు. దీంతో 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన చటేశ్వర్ పుజారాతో కలిసి గిల్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. ఇటు గిల్ అటు పుజారా అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ధాటిగా ఆడిన గిల్ 152 బంతుల్లో 3 సిక్సర్లు, మరో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాడు. ఆ తర్వాత స్కోరును ముందుకు నడిపించే బాధ్యతను పుజారా తనపై వేసుకున్నాడు. అతనికి విరాట్ కోహ్లి 19 (నాటౌట్) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 130 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ఇదే సమయంలో నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. కాగా, స్కోరు 61.4 ఓవర్లలో 2 వికెట్లకు 258 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు నజ్ముల్ (25), జాకిర్ హసన్ (17) క్రీజులో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News