Friday, April 26, 2024

ఈ బ్యాంకు ఇలా…ఆ బ్యాంకు అలా

- Advertisement -
- Advertisement -

బ్యాంకు సిబ్బంది తీరుతో విస్తుపోతున్న ఖాతాదారులు
ఆన్‌లైన్ సెంటర్‌లను ఆశ్రయిస్తున్న వైనం
ప్రభుత్వ పథకాలకు కోతలు…. లబోదిబోమంటున్న బాధితులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బ్యాంకు అధికారుల పనితీరు అగమ్యగోచరంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంతో ఖాతాదారులు ఒక్కోక్కరుగా బ్యాంకులకు దూరమై ఆన్‌లైన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇది గ్రహించిన బ్యాంకు అధికారులు ఖాతాదారులను బతిమాడుకునే పనిలో నిమగ్నమైయ్యరు. తిరిగి తమ బ్యాంకుల్లోనే లావాదేవీలు జరపాలని వేడుకుంటున్నారు.

మన తెలంగాణ/చర్ల: రోజుకి కోటి రూపాయలకుపైగా లావాదేవీలు జరిగే చర్ల మండల కేంద్రంలో కొందరు బ్యాంకు అధికారుల తీరుపై ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల మంది సందర్శించే ఎస్బిఐ, యూనియన్ బ్యాంకుల్లో..ఆ బ్యాంకు సిబ్బంది వ్యవహారశైలితో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు సందేహాలు నివృత్తి చేసే అధికారులు కరువయ్యారని, అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఖాతాదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మేనేజర్ స్థాయి వ్యక్తులు కూడా ఖాతాదారుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. పనులు మానుకుని బ్యాంకుకి విత్‌డ్రా..డిపాజిట్ నిమిత్తం వస్తే గంటల తరబడి క్యూలైన్లో నిలుచోబెడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. చేసేది ఏమీలేక ఆన్‌లైన్ సెంటర్లపై ఆదారపడుతున్నామని తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మండల కేంద్రంలో గల స్టేట్‌బ్యాంకులో డీడీ చెల్లించే సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సత్యనారాయణపురం బ్యాంకుకు వెళ్లీ డీడీ తియ్యలంటే సమయాభావం కారణంగా అవస్థలు పడుతున్నామని తెలుపుతున్నారు. ఇకనైనా మండల కేంద్రంలో డీడీ చెల్లించే సదుపాయం ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు…

రుణరికవరీ పేరిట.. ప్రభుత్వ అందిస్తున్న పైసలకు కోతలు

 చర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు అధికారుల వ్యవహర తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు, వృద్ధులకు ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు, ఆసరా ఫించన్లను బ్యాంకు అధికారులు అప్పుల పేరిట జమ చేసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. చర్ల మండలానికి చెందిన కొందరు రైతులు రైతుమిత్ర గ్రూప్‌ల పేరుతో యూనియన్ బ్యాంకులో రుణాలు పొందారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొందరు రుణాలు తిరిగి చెల్లించలేకపోయారు. ఇదే అదునుగా భావించిన బ్యాంకు అధికారులు ప్రభుత్వ అందిస్తున్న రైతుబంధుకు పైసలకు కోతపెడుతున్నారు. ఇందులో భాగంగానే గుప్పెనగూడెం గ్రామానికి చెందిన చవన్‌కుమార్ 007510021062561 ఖాతాలో పడుతున్న రైతు బంధు పైసలు నేటికి ఒక్కపైసకూడా అతడికి ఇవ్వలేదు. ఇలాంటి బాధితులు మండలంలో చాలామందే ఉన్నారు. అప్పులుంటే మరోలా రికవరీ చేసుకోవాలని కానీ ప్రభుత్వ అందిస్తున్న పైసలు జమచేసుకోడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలపై అధికారులు దృష్టిసారించాలని ప్రభుత్వ అందిస్తున్న పైసలు లబ్ధిదారులకు చేరేవిధాంగా చూడలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News