Friday, March 29, 2024

బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి

- Advertisement -
- Advertisement -

Banks and ATM

 

కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం
లాక్‌డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు

ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో బ్యాంకులు, ఎటిఎం సేవలను సజావుగా అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన కింద ప్రకటించిన ప్యాకేజీలో రూ.27,500 కోట్లు వచ్చే రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భళ్లా సూచనలు చేశారు. బ్యాంకుల పని గంటలను తగ్గించడం, తక్కువ బ్రాంచ్‌లు సేవలందించడం, ఎటిఎంలలో డబ్బును నింపే సిబ్బందిపై ఆంక్షలు వంటివి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నేపథ్యంలో కేంద్రం వారికి ఈ ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, సంబంధిత కార్యకలాపాలు అత్యవసరమని అజయ్ భళ్లా అన్నారు.

ఈ వారంలోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద రూ.27,500 కోట్లు ప్యాకేజీని ఈ వారంలో పంపిణీ చేయనున్నామని, అందువల్ల వచ్చే రోజుల్లో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎటిఎంల ద్వారా ప్రజలు ఈ నిధులను పొందనున్నారని అన్నారు. బ్యాంకు సేవలను సజావుగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఎటిఎంల నగదు నిర్వహణ ఏజెన్సీలకు అనుమతి ఇవ్వాలని, బ్యాంకులు తెరిచే ఉంచాలని, ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అవసరమైతే పని గంటలను పెంచాలని భళ్లా అన్నారు. కేంద్ర ప్యాకేజీ నిధులను ప్రజలకు అందేలా నిర్వహించే కార్యకలాపాలకు స్థానిక జిల్లా, రాష్ట్ర, పోలీసులు యంత్రాంగం బ్యాంకులకు సహకరించాలని సోమవారం పంపిన లేఖలో ఆయన తెలిపారు.

కాగా బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉంటున్నాయని, ఎటిఎంలను కూడా నగదుతో నింపుతున్నాయని, బ్యాంకింగ్ సేవలు అందుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తం గా లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు బ్యాంకింగ్ సేవ లు అందుతాయా? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీతారామన్ దీనిపై సమాచారమిస్తూ ఓ ట్వీట్ చేశారు. అన్ని బ్యాంకుల శాఖలు తెరిచి ఉండేలా కృషి చేస్తున్నాయని, ఎటిఎంలు పనిచేస్తాయని అన్నారు. దీంతోపాటు బ్యాంకు సిబ్బంది కృషిని కూడా ఆమె ప్రశంసించారు.

అంతేకాకుండా బ్యాంకుల్లో సామాజిక దూరా న్ని పాటించాలని, శానిటైజర్‌లను అందిస్తున్నామని ఆర్థి క మంత్రి చెప్పారు. బ్యాంకులను అత్యవసర సేవల్లో భాగంగా చేర్చారు. చాలావరకు బ్యాంక్‌లు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఎస్‌బిఐ సహా పలు బ్యాంక్‌లు అత్యవసర సేవలు మినహా ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాయి. అంతకు ముందు శనివారం ఆర్థిక మంత్రి బ్యాంకుల అధిపతులతో సమగ్ర చర్చలు జరిపారు. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్యాంకింగ్ సేవలను కొనసాగిస్తామని, బ్యాంకుల అన్ని శాఖలు తెరిచే ఉంచుతాయని బ్యాంకుల అధిపతులు హామీ ఇచ్చారు.

 

Banks and ATM services should be provided smoothly
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News