Home కలం ‘అగ్నివీణ’ మీటిన ఎస్.వి.ఎల్

‘అగ్నివీణ’ మీటిన ఎస్.వి.ఎల్

SVL Narasimha Rao

 

ఎస్‌విఎల్‌కు కవిత్వమెంత ప్రీతిపాత్రమో పాత్రికేయం కూడా అంతే. అప్పటికే ప్రధాన పత్రికల్లో వ్యాసాలు రాసిన ఆయన నిజామాబాద్ కేంద్రంగా ‘అగ్నివీణ’ అనే పత్రికను నడిపారు. సాహితీ విలువతో సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చే రీతిలో అగ్నివీణ కొన్ని ఏళ్ల పాటు కొనసాగింది.

ఈ మధ్య కాలంలో ఖలీల్ జిబ్రాన్ రచనల పట్ల ఆయనకు విపరీతమైన ఆసక్తి పెరిగింది.ఖలీల్ జిబ్రాన్ రచనలు ఇంగ్లీషు ప్రతులను వెతికి వెతికి తెప్పించుకున్నారు. వాటిలో కొన్నింటిని ప్రముఖ తెలుగు రచయితలు, రచయిత్రులతో అనువదింపజేసి సొంత ఖర్చుతో ప్రచురించారు. అలా ప్రచురించిన పుస్తకాలను ఉచితంగానే పరిచయస్థులకు సొంత తపాలా ఖర్చుతో పంపించేవారు.

బాన్సువాడ మాజీ ఎంఎల్‌ఎ ఎస్.వి.ఎల్. నరసింహారావు అస్తమయం అని పత్రికల్లో చిన్న వార్త వచ్చింది. సెప్టెంబర్ 25న వయోభారంతో, అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. అయితే ఎస్‌విఎల్ సుదీర్ఘ జీవన యానంలో 12 ఏళ్లు తెలుగు దేశం పార్టీలో సభ్యునిగా ఉండి 1985లో ఒక పర్యాయం ఎంఎల్‌ఎగా ఉన్నారు. ఆయన బతికిన 87 ఏళ్లలో అధిక భాగం రైతు నాయకుడుగా పాత్రికేయుడుగా, రచయితగా, సాహిత్య అభిమానిగానే గడిపారు. విద్యార్థి దశ నుండే సోషలిస్టు భావాలకు ఆకర్షితుడైన ఆయన చివరి క్షణం ద్వారా అభ్యుదయ వాదిగానే బ్రతికారు. గుంటూరు జిల్లాలకు చెందిన ఎస్‌విఎల్ కుటుంబం 1952లో నిజామాబాద్ జిల్లా వర్ని సమీపంలోని వకీల్ ఫారం అనే గ్రామానికి వలస వచ్చింది.

మచిలీపట్నంలో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే యంగ్ సోషలిస్టు లీగ్ ఆరంభించారు. హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్శిటీ ఈవినింగ్ కాలేజీలో బి.ఎ. పూర్తి చేశారు. అప్పటికే కవిత్వం రాయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. ఆ రోజుల్లో చేకూరి రామారావు ఆయన కవిత్వాన్ని ఇష్టపడేవారని, రాయడం తగ్గించినప్పుడు చేరా పలు సార్లు ఎస్‌విఎల్‌తో కవిత్వ ప్రస్తావన తెచ్చే వారని తన సన్నిహితులతో అనేవారు. పార్టీకి, పదవికి అతీతంగా ఆయన ప్రజల సమస్యలపై స్పందించడంతో పాటు పాత్రికేయున్ని వ్యాపకంగా, జీవన శైలిగా స్వీకరించారు.

నిజామాబాద్ కేంద్రంగా ఆయన సాహిత్యంలో కొత్త మలుపు తెచ్చారు. అప్పటికే విప్లవోద్యమం బీజాలు పడ్డాయి. రచయితల్లో సాహిత్య ప్రయోజనం గురించి ఆలోచనలు రేకెత్తాయి. కళ ప్రజల కోసం అని నమ్మిన జిల్లా రచయితలు ‘ప్రజా సాహితి’ అనే సంస్థను స్థాపించుకున్నారు. ఇది వరకే అస్తిత్వంలో ఉన్న సాహితీ సంస్థల్లోని ప్రగతిశీల సభ్యులు ప్రజాసాహితికి తోడయ్యారు. ప్రజాసాహితి స్థాపనలో ఎస్.వి.ఎల్‌ది ముఖ్యపాత్ర. ఆయన ఆ సంస్థకు అధ్యక్షుడుగా కొనసాగారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాసాహితి, అమరకవి నలందా కవితా సంపుటి ‘వేడిగాలి’ ని ఆవిష్కరించింది. ఆ సభ అభ్యదయ సాహితీ వేత్తలను, అభిమానులను ఏకం చేసింది. కిక్కిరిసిన సభ ఆ రోజుల్లో ఒక సంచలనంగా నిలిచిపోయింది. 70వ దశకంగా నిజామాబాద్ కేంద్రంగా వచ్చిన కవులు, రచయితలపై ప్రజాసాహితి మార్గనిర్దేశన, ఎస్‌విఎల్ ముందడుగు ముద్ర ఉంది.

ఎస్‌విఎల్‌కు కవిత్వమెంత ప్రీతిపాత్రమో పాత్రికేయం కూడా అంతే. అప్పటికే ప్రధాన పత్రికల్లో వ్యాసాలు రాసిన ఆయన నిజామాబాద్ కేంద్రంగా ‘అగ్నివీణ’ అనే పత్రికను నడిపారు.సాహితీ విలువతో సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చే రీతిలో అగ్నివీణ కొన్ని ఏళ్ల పాటు కొనసాగింది. ఆంగ్లంపై మంచి సాధికారిత గల ఎస్‌విఎల్ అగ్నివీణతో పాటు ఇంగ్లీషులో డిస్ట్రిక్ట్ వాయిస్ అనే పత్రికను కూడా నడిపారు. జిల్లా పత్రికలకు ఆద్యుడుగా ఆయనను తర్వాతి తరం గౌరవిస్తుంది. గత పదేళ్లుగా వయో భారంతో ఇంటికే పరిమితమైన ఆయన మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి మూలకారణం సాహిత్యమేనని ఆయన ఆప్తులకు తెలుసు. ఇష్టమైన పుస్తకాలను ఎలాగైనా తెప్పించుకొని చదవడం ఆయన నిత్య వ్యాపకం. ఆయన గది నిండా కవిత్వమే కనిపిస్తుంది. పాత, కొత్త కవితా సంపుటాలు టేబుల్‌పై, బెడ్‌పై దర్శనమిచ్చేవి.

ఈ మధ్య కాలంలో ఖలీల్ జిబ్రాన్ రచనల పట్ల ఆయనకు విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఖలీల్ జిబ్రాన్ రచనలు ఇంగ్లీషు ప్రతులను వెతికి వెతికి తెప్పించుకున్నారు. వాటిలో కొన్నింటిని ప్రముఖ తెలుగు రచయితలు, రచయిత్రులచేత అనువదింపజేసి సొంత ఖర్చుతో ప్రచురించారు. అలా ప్రచురించిన పుస్తకాలను ఉచితంగానే పరిచయస్థులకు సొంత తపాలా ఖర్చుతో పంపించేవారు. ఆయన వద్ద 3 వందలకు పైగా రచయితల, సాహిత్య ప్రేమికుల చిరునామాలున్నాయి. మంచి పుస్తకం తన వారికి చేరవేయాలనే దృష్టితోనే తనకు నచ్చిన పుస్తకాల్ని ముద్రించే వారాయన. ఇతరులు ప్రచురించిన పుస్తకాలను కొని తన దగ్గరి వారికి పంపేవారు. కవి అలిశెట్టి ప్రభాకర్ అంటే ఎస్‌విఎల్‌కు ప్రత్యేక అభిమానం. ప్రభాకర్‌ను కలువకున్నా ఆయన వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని అమితంగా ప్రేమిస్తారాయన. ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ కాపీలను ఎందరో మిత్రులకు పంచి పెట్టారు. ప్రభాకర్ కవితా చిత్రాలను 2018లో జనవరిలో ‘అక్షర క్షిపణులు’ పేరిట ఎస్‌విఎల్ సొంత ఖర్చులతో పుస్తకంగా తెచ్చారు. తను చనిపోయే లోపల ప్రభాకర్‌పై ఒక పుస్తకం వేయాలని ఆయన తపించారు. ఆ కోరిక ‘అక్షర క్షిపణులు’ ముద్రణతో తీరింది.

ఎంతో కాలంగా కవిత్వం, కథలు రాస్తున్న సి.హెచ్.మధు కవితల్ని తొలిసారిగా సంపుటిగా ముందుకు తెచ్చారు ఎస్‌విఎల్. నిజామాబాద్‌కు చెందిన సిహెచ్ మధును, ఆయన కవిత్వాన్ని ఇష్టపడే ఎస్వీయల్ తానే ఎంపిక చేసిన కవితలతో ‘జ్వలిత గీతాలు’ పేరిట ముద్రించారు. పుస్తకాల ముద్రణకు ఆయన లక్షల రూపాయలు వెచ్చించారనడంలో అతిశయోక్తిలేదు. విప్లవోద్యమంలో విద్యార్థిదశ నుండే పాల్గొని అజ్ఞాత జీవితంలో కోనసాగిన రంగవల్లి ఎస్వీయల్ పెద్ద కూతురు 11 నవంబర్ 1999 రోజున నర్సంపేట అడవుల్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఆమె చనిపోయింది. స్వయంగా అభ్యుదయవాదియైన ఎస్వీయల్ కూతురు విప్లవోద్యమ జీవితాన్ని వ్యతిరేకించలేదు. రంగవల్లి మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం రంగవల్లి మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి పలు సాహితీ కార్యక్రమాలు జరిపారు. సుమారు పదిహేనేళ్లపాటు రంగవల్లి జన్మదినమైన డిసెంబర్31న కమిటీ ఎంపిక చేసిన రచయిత/రచయితీకి రంగవల్లి స్మారక రివార్డును అందజేశారు. ఎస్వీయల్ ప్రచురించిన పుస్తకాలన్నీ రంగవల్లి ప్రచురణలు పేరిట ముద్రింపబడ్డాయి.ఎస్వీయల్ పాతతరం పాత్రికేయుడు,సాహితీవేత్త, సోషలిస్టు భావాలను తనలో పాదుకొల్పిన సౌశాల్యం తనకు జీవన మార్గదర్శన చేసిందని ఆయన పలుసార్లు చెప్పుకొన్నారు.

ఎస్వీయల్ ముద్రించిన ఖలీల్ జిబ్రాన్ రచనల సమగ్ర సంపుటికి రచయిత బి.ఎస్. రాములు ముందుమాటరాశారు. వీలుచిక్కినప్పుడల్లా ఎస్వీయల్‌ను కలువడం బి.ఎస్ రాములుకు ఇష్టం. వీరి కలయిక వల్లే ఎస్వీయల్ ఆలోచన ఖలీల్‌జిబ్రాన్ వైపు మళ్లడం, తెలుగులో జిబ్రాన్ సాహిత్యం మరోసారి అందుబాటులోకి రావడం జరిగిందనవచ్చు. రాసేవాళ్లు కాకుండా సాహిత్యాన్ని గౌరవించేవారు, ముద్రణకు ఉపక్రమించేవారు కూడా సాహితీరంగంలో భాగస్తులే. సాహిత్యానికి రెండువైపులా ప్రాతినిధ్యం వహించిన ఎస్వీయల్ పూర్తిపేరు సూర్యదేవర లక్ష్మీవెంకటనరసింహారావు. అయిదేళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజలకు మాజీ ఎంఎల్‌ఎగా మిగిలినా సాహితీలోకానికి ప్రియనేస్తంగా ఆయన గుర్తుంటారు.

Banswada Former MLA SVL Narasimha Rao Biography