Thursday, April 25, 2024

ఇమ్యూనిజం జిందాబాద్

- Advertisement -
- Advertisement -

Basic Health Precautions

 ప్రతి మనిషికి స్వతహ సిద్ధంగానే శరీరంలో అంతర్గత సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇది తల్లి ద్వారా మానవుడికి ప్రసరితమయ్యే గొప్ప వరం. రోగ నిరోధక శక్తి కామన్‌గా ఇమ్యూనిటీగా పిలుచుకునే ఈ శారీరక అంతర్గత శక్తి మనిషికి ఎనలేని బలాన్ని ఇస్తుంది. రోగాలను, వైరస్‌ల సంక్రమణలను తట్టుకుని నిలిచే శక్తిని అందిస్తుంది. మనిషి పుట్టుక దశలోనే ఈ ఇమ్యూనిటీ శిశువుకు సంతరించుకుంటుంది. జీవితకాలం అంతా తోడుగా ఉండేందుకు సిద్ధం అవుతుంది. అయితే అందరు మనుష్యులలో ఈ ఇమ్యూనిటీ ఒకేలా ఉండదు. దీని సామర్థం లేదా ఇన్‌ఫెక్షన్‌లను తట్టుకుని నిలబడే శక్తిని ఇవ్వడం, తద్వారా వ్యాధులు రాకుండా చేయడం అనేది పలు ప్రభావిత అంశాలపై ఆధారపడి ఉంటుంది. సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తిలో తేడాలు అనేవి అయితే జన్యు లేదా తెచ్చిపెట్టుకున్న ఇతరత్రా అంశాలపై ఆధారపడి సంభవిస్తుంటాయి. ఈ తేడాలతోనే ఇమ్యూనిటీ పరిణామం దెబ్బ తింటుంది. ఈ విధంగా మనిషి తరచూ అనేక రకాల వ్యాధులకు వైరస్‌ల కాటుకు గురవుతుంటారు. దీనిని వైద్య పరిభాషలో సెప్సిస్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరికీ నిజంగానే ఇమ్యూనిటీ స్థాయి పెంచుకోవాలనే తపన ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. పలు కారణాలతో ఇది అందినట్లే అంది దూరం అవుతుంది. అందుకే ఇమ్యూనిటీ అనేది ఓ వ్యవస్థ తప్ప ఇది అంతర్గత అవయవం కాదని గుర్తించాల్సి ఉంటుంది. వ్యవస్థను మనం సంతరించుకోవల్సి ఉంటుంది. నిలబెట్టుకోవల్సి ఉంటుంది. ఇది మనిషి చుట్టూ ఉండే వాతావరణానికి అనుసంధానంగా ఉంటుంది. శరీరానికి, వాతావరణానికి సమన్వయం సాధించే దిశలో సాగుతుంది. వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఇమ్యూనిటిని పెంచుకోవడానికి ఏం చేయాలి? మన జీవితంలో ఎటువంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయనే విషయంపై పలు పరిశోధనలు జరిగాయి. అయితే ఇంకా సంపూర్ణ స్థాయిలో జరగాల్సి ఉంది. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మనిషి జీవనశైలి గురించి సరైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనేది నిర్దిష్టమైన అంశం. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. పరిశోధకులు ఈ ఇమ్యూనిటీ అంశంపై ఇప్పుడు పలు రకాల పరిశోధనలు సాగిస్తున్నారు. ఆహారం, వ్యాయామం, వయస్సు, మానసిక ఒత్తిడి, ఇతర కారణాలు మనిషి రోగనిరోధక శక్తిపై ఎటువంటి ఏ స్థాయి ప్రభావం చూపుతాయనే అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. సాధారణ ఆరోగ్యకర జీవన పద్ధతులు లేదా జీవన చక్రంతోనే మనం మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం సాధ్యం అవుతుంది.
ఆరోగ్యకర జీవన విధాన మంత్రం
హెల్తీ లైఫ్‌ను ఎంచుకోవడమే ఇమ్యూనిటీ మంత్రమని తేల్చిచెప్పవచ్చు. మంచి అలవాట్లు అనేవాటి గురించి మనిషికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే వీటిని ఎంచుకుని ఆచరించడమే కీలకం. కేవలం మనిషిలోని రోగనిరోధక శక్తి ఒక్కటే కాకుండా ప్రతి అవయవం కూడా మనం ఆరోగ్యకర పద్ధ్దతులతో ఉన్నప్పుడే సవ్యంగా వ్యవహరిస్తాయి. ఇది శారీరక యంత్ర వ్యవస్థ ప్రధాన లక్షణం. ఈ ఆరోగ్యకర లక్షణాలను మనం నిర్దిష్టంగా ఖచ్చితంగా పాటించి దీనిన ఓ జీవన మార్గంగా ఆచరించాల్సి ఉంటుంది. పొగ తాగరాదు. వ్యాయామ క్రమం తప్పరాదు, ఇక సముచితమైన బరువు ఉండేలా చేసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇందులో విటమిన్‌లు, ఖనిజాలు, పోషకాలు, వీటితో పాటు సరైన నిష్పత్తిలో కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు సరైన నిద్ర ఉండాలి. అన్నింటికీ మించి ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఉరుకుల పరుగులతో వచ్చిపడే మానసిక ఒత్తిడి చివరికి ముప్పు కల్గిస్తుంది. ఈ జీవన విధానం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా కాలం క్రితమే నిర్వచించింది. ఆరోగ్యం అంటే పూర్తి స్థాయి భౌతిక, మానసిక , సామాజిక సాంఘిక సమీకరణలతో కూడిన స్థితి అని తేల్చి చెప్పారు. వ్యాధులు ఇతరత్రా అవలక్షణాలతో సంబంధం లేకుండా సంపూర్ణ మనుష్య స్థితికి సంబంధించిన వ్యాఖ్యానంగా దీనిని భావించవచ్చు. దీనికి అదనంగా సామాజిక ఆర్థిక ఫలవంతమైన జీవితాన్ని కూడా జోడించుకోవల్సి ఉంటుంది. మనిషి ఆరోగ్యకర జీవితం వీటితో మరింత బలీయం అవుతుంది. అయితే ఈ సూత్రీకరణ నేపథ్యంలో పూర్తి స్థాయి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని స్థిరీకరించుకోవడం సవాలే అవుతుంది. జీవితం కొనసాగింపుల ప్రక్రియ. ఇందులో పలు ప్రక్రియలుంటాయి. ఇప్పటి పరిస్థితులలో ఆరోగ్య మార్పులకు దారి తీసే కారణాలు అనేకం వచ్చిపడుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, జీవనశైలిలో మార్పులు చేర్పులు, కొత్త అలవాట్లకు మొగ్గు చూపడం వంటి అనేకం మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇదంతా ఓ విశిష్ట, బలీయ ప్రక్రియ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రామాణిక ఫలితం అవుతుంది. సంపూర్ణ ఆరోగ్యపు మనిషి క్రమంలో ఆధ్యాత్మిక, భావోద్రేకపు అంశాలు కూడా పరిగణనలోకి వస్తున్నాయి. ఈ విధమైన సాంత్వనతో కుదిరే ఆరోగ్య నిర్వహణ చివరికి మనిషి రోగనిరోధక శక్తి బలోపేతానికి దారితీస్తుంది.
అంతర్గత శక్తితోనే సూక్ష్మజీవులు మటాష్
మనిషి శరీరమే ఓ వివిధ రకాల వ్యవస్థల సంచలితంగా ఉంటుంది. ప్రకృతి తమ సంతతి అయిన మనిషిని వివిధ రూపాలలో కాపాడేందుకు యత్నిస్తుంది. ఇందులో ప్రధానమైనదే ఇమ్యూనిటి. మనిషి శరీరంలోని థైమస్, వెన్నెముక, టి లింఫోసైట్, తెల్ల రక్తకణాలు, ఇమ్యూనోగ్లోబులిన్స్ వంటి యాంటీబాడీస్‌ల్లో కూడా రోగ నిరోధక శక్తి ఉంటుంది.
ఇమ్యూనిటీ శాశ్వతానికి మందులేదు
రోగ నిరోధకశక్తి సంపూర్ణం, చిరకాలం ఉండాలనుకోవడం మంచిదే అయితే దీనిని సాధించుకోవడానికి ఇప్పటికైతే ఎటువంటి మందు కానీ థెరఫీ కానీ అందుబాటులోకి రాలేదు. శారీరక ప్రక్రియకు అనుగుణంగా చూస్తే రోగ నిరోధక శక్తి క్రమబద్ధీకరణకు సంబంధించిన కణాలను ఇనుమడింపచేయడం సాధ్యం అయ్యే పనికాదు. ప్రతి మనిషిలోనూ కొన్ని రకాల శారీరక కణాలు సొంతంగానే పుట్టుకొస్తుంటాయి. శారీరక సాధారణ కదలికలతో ఏర్పడే కణాల స్థానంలో ఏర్పడే నూతన కణాలు ఇమ్యూనిటీతోనే ఏర్పడుతూ ఉంటాయి. మనిషికి పుట్టుక మరణం వంటిదే వయస్సు మీరడం. ఇది అనివార్య ప్రక్రియ. అయితే ముదుసలి తనం రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూలతనే చూపుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్ది మనిషి వచ్చిపడే అంటువ్యాధులను తట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే కొన్ని రకాల అంటువ్యాధులలో ఇన్‌ఫెక్షన్‌లలో వృద్ధులే ఎక్కువగా మరణిస్తూ ఉంటారు. వారికి సంక్రమణలు ఎక్కువగా సోకుతాయి. వీటిని తట్టుకునే శక్తి మందగించడం జరుగుతోంది. రోగ నిరోధక శక్తిపై వయస్సు మీదపడటం ప్రతికూల ప్రభావం చూపుతుంది. థైమస్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడం, ఇమ్యూనోగ్లోబులిన్స్‌ను సరైన పరిణామంలో ఉత్పత్తి చేయడంలో కండరాల కణ జాలాలు సరిగ్గా వ్యవహరించకపోవడం వంటివి ఇందుకు కారణం అవుతాయి. ఇదంతా కూడా ఓ సంక్లిష్ట ఇమ్యూనో సెన్సెసెన్స్ అనే ప్రక్రియ అవుతుంది. ఇది క్రమేపీ పూర్తి స్థాయిలో ఇమ్యూన్ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఈ క్రమంలో మనపైకి దాడికి దిగే ఇతరత్రా వైరస్ క్రిముల కణ జాలాలను తిప్పకొట్టడం అసాధ్యం అవుతుంది. వైరస్‌లు మనపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనేది మనలోని రోగనిరోధక శక్తి సంబంధిత వ్యవస్థతోనే ఆధారపడి ఉంటుంది. పెద్దవాళ్లకు టీకాలు ఇతరత్రా చికిత్సలు అందించినా సరైన ఫలితం సాధ్యం కాకపోవచ్చు. ఇదంతా కూడా ఇమ్యూనిటీ పరిణామక్రమ పరిణామమే.అయితే చాలా మంది ఆరోగ్యకరమైన విధంగానే జీవిస్తూ ముదుసలి అవుతారు. దీనిని ఆరోగ్యకరమైన ముసలితనం అనుకోవచ్చు. బాగా ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే ఈ విధమైన రోగనిరోధక శక్తి కూడా ఒక్కోసారి దెబ్బతినవచ్చు. అయితే ఇందుకు కారణాలు ఏమిటనేవి వెల్లడికాలేదు. పెద్దవారిలోని ఆరోగ్యం వారిలో కొందరు హుషారుగా ఉండటం అనేది వాతావరణం, పరిసరాలు, అన్నింటికీ మించి జన్యు అంశాలపై ఆధారపడి ఉంటాయి.
పెద్దవారికి ఉపయోగపడని వ్యాక్సిన్‌లు
ప్రస్తుత తరుణంలో మనం వాడే కొన్ని రకాల వ్యాక్సిన్‌లు పెద్దవారి ఆరోగ్యపరిరక్షణకు సరిగ్గా ఉపయోగపడటం లేదు. వాటితో ఫలితాలు లేకుండా పోతున్నాయి. వృద్ధులకు వచ్చే అనుబంధ జబ్బులు అయిన డయాబెటిస్, మతిమరుపు వంటివాటితో ఇటీవలి కాలపు వైరస్‌లు వారిని తేలిగ్గా పీడించే అవకాశం ఉంది. కొందరికి సరైన ఆహారం దొరకకపోవడం, తిండి పట్ల ఆసక్తి లేకపోవడం వంటివి పెద్దలలో చివరికి బలహీనతకు దారితీస్తాయి. ఈ దశలో వచ్చే వైరస్‌ల దాడితో వారు త్వరితగతిన దీనికి గురవుతున్నారు. అంతేకాకుండా దీని నుంచి విముక్తి పొందలేకపోతున్నట్లు వెల్లడయింది. కేన్సర్ వంటి వ్యాధులు రోగనిరోధక శక్తి లోపాలతో తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మనిషి జీవితంలో తీసుకునే ఆహారం ప్రధాన భూమిక వహిస్తుంది. దీనితోనే ఇమ్యూనిటీకి అవకాశం ఏర్పడుతుంది. దీనిని పెంచుకునే వీలుంటుంది.ఏ వ్యాధి కూడా సరైన ఆహారం లేకుండా చికిత్స చేయడం అసాధ్యం అవుతుంది. ఆహారం లేకుండా చికిత్సా పద్ధతులు అనేవి ఉండవు. పేదరిక వారసత్వపు పౌష్టికాహార లోపంతో ప్రజలు ఎక్కువగా అంటువ్యాధులకు గురవుతుంటారు. రోగాలు వ్యాపిస్తుంటాయి. పలు రకాల విటమిన్‌లు ఏ బి6, సి, ఇ వంటివి ఫోలిక్ యాసిడ్ , మినరల్స్ వంటివి, జింక్, సెలినియం, ఐరన్, కాపర్ వంటి పదార్థాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. పౌష్టికాహారం రోగనిరోధక శక్తిని పెంచుతుందనేది నిరూపిత అంశం. అయితే అత్యధిక మోతాదులో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేవలం సరైన ఆహారం తీసుకోవడం వల్లనే ఇమ్యూనిటి పెరుగుతుందని రుజువైంది. ప్రత్యామ్నాయ బలవర్ధకాలు తీసుకుంటే అంతర్గత శక్తి వచ్చిపడేది కాదని నిర్ధారణ అయింది. భారతీయ ఆహార విధానంలోనే ఇమిడి ఉన్న అంశాలలో , తరాలుగా మన పూర్వీకులు పాటించిన ఆహార పద్ధతులలో వ్యాధి నివారణ చర్యలు ఇమిడి ఉన్నాయి. అంటువ్యాధులు సోకకుండా ఉండే ఆహారం ఉండేది. అయితే దురదృష్టవశాత్తూ మనం ఇటువంటి విధానాలకు దూరం అయ్యాం. పాత ఆచారాల పేరిట వాటిని దూరం చేసుకున్నాం. ఈ క్రమంలో మనం మిశ్రిత లేదా హైబ్రిడ్ ఆహారపు అలవాట్లకు లోనయ్యాం. ప్రత్యేకించి విదేశాల నుంచి అలవర్చుకున్న ఆహారానికి అలవాటుపడ్డాం. ఆహారపు అలవాట్లు అనేవి కేవలం సమాజపు సంస్కృతిని తెలియచేసేవే కాకుండా తరాలుగా మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ విషయాన్ని ఇప్పటి తరం గుర్తుంచుకోవల్సి ఉంటుంది. వారు తమ ప్రాంతీయ పరిస్థితులు, వాతావరణం పర్యావరణం ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని జీవన చక్రం సక్రమంగా ఉండేందుకు తగు విధమైన ఆహారపు నియమాలను పాటించారు. అంతేకాకుండా సామాజిక నేపథ్యం కీలకంగా మారింది. ఈ కోణంలో ఆహార అలవాట్లు అనేవి ఒక దేశానికి మరో దేశానికి వేర్వేరుగా ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ క్రమం తప్పింది. దీనితో ఇతరత్రా అవలక్షణాలు ఏర్పడ్డాయి. మనిషి రోగ నిరోధక శక్తి వ్యవస్థపై ఆహారపు అలవాట్లు తిరుగులేనివిగా ఉంటాయి. సాంప్రదాయక భారతీయ విధానాలు మనిషిలోని అంతర్గత శక్తిని పెంచుతూపోయే విధంగా ఉండేవి. ఈ క్రమం లో మన ప్రాచీన ఆహారపు పద్ధతులను ఇప్పటి తరానికి పరిచయం చేసి ప్రోత్సహించాల్సి ఉంది.
మానసిక ఒత్తిడిని అధిగమించాలి
మనిషి ప్రస్తుత ప్రపంచంలో గురయ్యే ఒత్తిడి ఖచ్చితంగా మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒత్తిడికి గురికావడం అనేది మనుషులను బట్టి ఉంటుంది. అదే విధంగా దీనిని తట్టుకుని ఉండటం కూడా భిన్నంగానే ఉంటుంది. మానసిక ఒత్తిడికి కొందరు ఏ మాత్రమైనా తట్టుకోలేరు. కొందరు అన్ని ఆటుపోట్లను తట్టుకుని నిలుస్తారు. వీరికి సత్ఫలితాలు ఉంటాయి. వారిలో అంతర్గతంగా ఉండే ఇమ్యూనిటీకి డోకా ఉండదు. ఒత్తిడికి గురై తట్టుకోలేని వారు దుష్ఫలితాలను పొందుతారు. వారి ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. ఇది పలు వ్యాధుల సంక్రమణల దశలలో నిరూపితం అయింది. అయితే ప్రయోగశాలలో మానసిక ఒత్తిడి పరిణామం దీని ప్రభావం దీని కొలతల గురించి నిర్ధారించుకోవడం కష్టం. మన రక్తంపై ఏ మేరకు ఈ ఒత్తిడి ప్రభావం ఉంటుందనేది తెలియచేసే పద్ధతులులేవు. అందుకే ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలనే అంశం కూడా నిర్ధారణ కాలేదు. అయితే చిరకాలంగా ఉండే ఒత్తిడితో చివరికి ఆరోగ్య అవలక్షణాలను సంతరించుకుంటాం. ఇదే అంతిమంగా మనిషికి ప్రాణాంతకం అవుతుంది. జబ్బులు వచ్చిపడ్డప్పుడు ఈ పరిణామం మరింత చేటు తెచ్చే ఉత్ప్రేరకం అవుతుంది.
పెద్దలు బుద్ధులు చెపుతారు
పిల్లలను చాలాసార్లు పెద్దలు చలిలో తిరగవద్దని చెపుతుంటారు. చలికి సోకితే ఫ్లూ వంటి జబ్బులు వస్తాయని పరోక్షంగా తెలియచేస్తారు. వారి మంచి మాటల వెనుక పలు సత్యాలు ఉండనే ఉంటాయి. అదే విధంగా మనం పూర్తిగా ఇంట్లోనే ఉండలేం. చలికాలంలో కూడా బయట తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇతరుల ద్వారా వైరస్ సోకుతుంది. గాలిలో ఉండే వైరస్‌లు తేమ చలి వాతావరణంలో జీవిస్తాయి. దీనికి సోకినట్లు అయితే మనకు ఎగువ శ్వాసకోశ వ్యాధులు వస్తాయనే విషయం స్పష్టం అయింది. పలు అధ్యయనాలు దీనిని నిర్ధారించాయి. అయితే పూర్తిగా చలి వాతావరణంలో ఉంటే రోగనిరోధక శక్తి ఏమీ క్షీణించబోదనే విషయాన్ని కూడా అధ్యయనంలో తేల్చారు. కానీ అపరిమిత చలికి గురయితే, అసౌకర్యపు వాతావరణానికి లోనయితే అది కీడు చేస్తుంది. వీటిని గమనించాల్సి ఉంటుంది. రోజువారీ వ్యాయామం నిస్సందేహంగా మన ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. మన శారీరక స్థితిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని ఇనుమడింప చేస్తుందని వెల్లడైంది. అయితే తీవ్ర స్థాయి వ్యాయామాలు మన రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తాయని కూడా క్లినికల్ పరీక్షలలో తేలింది. ఇది అథ్లెట్లు ఇతరుల విషయానికి అన్వయించుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఆహారం అరటి పండ్లు వంటివి, బాదాంలు వంటివి శారీరక వ్యాయామం తరువాత వచ్చే అవలక్షణాలను తొలగిస్తాయి. చాలా మంది వ్యాయామం తరువాత కేవలం మంచినీరు తీసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వ్యాయామాలు మంచివే. అయితే చేసే సమయం, తీసుకునే టైం వంటివి కూడా ఇమ్యూనిజంపై ప్రభావితం చేస్తాయి. గంటకు పైగా వ్యాయామం చేస్తే స్పష్టమైన విధంగా మనిషి రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడైంది. ఈ విధానంతో రక్తంలోని ఇమ్యూనోగ్లోబుల్స్ పెరుగుతాయి. తెల్ల రక్తకణాలు చురుగ్గా పని చేస్తాయి. ఇవి శరీరంలో సైనికుల వంటివి. సరైన పద్ధతి లేకుండా చేసే వ్యాయమాలను మానుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాలు తీసుకోవడం వంటివి సహజ సిద్ధమైన ఇమ్యూనిటీకి శత్రువులే అవుతాయి. ప్రతి మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఏకైక సూత్రం కానీ మంత్రదండం కానీ ఏదీ లేదు. ఇది కేవలం సమీకృత జీవన అలవాట్లతోనే సాధ్యం అవుతుంది. సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం, తగినంత నిద్ర అవసరం. ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి. ఎప్పుడూ ఆశావాహక దృక్పథం అలవర్చుకోవాలి. సంక్షోభంలో కుంగిపోరాదు. ఇవన్నీ కూడా మనలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యవంతులైన పౌరులు దేశానికి ఆయువుపట్టు వంటి వారని సర్ విన్‌స్టన్ చర్చిల్ సెలవిచ్చారు. మన గురజాడ తమదైన శైలిలో దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుష్యులోయ్.. తిండి గలిగితే కండగలదోయి… కండగలిగిన వాడే మనిషోయ్ అన్నారు. మనిషిలోని రోగనిరోధక శక్తిని మించింది లేదు. దీనిని పెంచే సరైన అలవాట్లను మించిన సుసంపన్నత మరోటి లేనేలేదు.

డా. భూషణ్ రాజు
(ప్రొ. నిమ్స్ నెఫ్రాలజీ హెడ్)
9030292929

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News