Home వార్తలు కృష్ణాతీర స్నాన ఘట్టాలు

కృష్ణాతీర స్నాన ఘట్టాలు

bathingపాలమూరు జిల్లాను పావనం చేసే కృష్ణానదికి పుష్కరాలు వచ్చాయి. జిల్లాలో అతి పొడవున ప్రవహించే కృష్ణానది పాలమూరు జిల్లాను సస్యశామలం చేసే జీవనది. కృష్ణానదీ తీరం వెంట అనేక దేవాలయాలు, మఠాలు వెలిశాయి. ఆయా తీరాలలో పుష్కరాల కోసం వచ్చే జనాలకోసం జిల్లా యంత్రాంగం అనేక పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారి కృష్ణానదికి పుష్కరాలు వచ్చాయి. పాలమూరు జిల్లాలో కృష్ణా తీర క్షేత్రాలు అనేకం ఉన్నాయి. పాలమూరు జిల్లాలో కృష్ణానది ప్రవేశించినప్పటి నుంచి కృష్ణానదీ పరివాహక తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ పుణ్యక్షేత్రం వెంబడి అనేక స్నాన ఘట్టాలను ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసింది. పుష్కర సంరంభానికి పాలమూరు జిల్లాలోని ప్రసిద్ధి కృష్ణాతీర క్షేత్రాలు, పుణ్యస్నానఘట్టాలు ముస్తాబయ్యాయి. జిల్లాలో బీచుపల్లి, పాతాళగంగ, సోమశిల, జటప్రోలు ప్రాంతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి పొందిన బీచుపల్లి దేవస్థానం వద్ద పుష్కరస్నానాలు అధికంగా భక్తులు స్నానమాచరిస్తారు. దీని తర్వాత శ్రీశైల పశ్చిమ ద్వారం దగ్గర వున్న పాతాళగంగలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. జిల్లాలో మొత్తం 52 స్నానఘట్టాలను ఏర్పాటుచేయగా అందులో ప్రధానమైనవి 27 స్నానఘట్టాలు. బీచుపల్లి పురాణ ప్రసిద్ధమైన చారిత్రక స్థలం. అందుకే భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో స్నానమాచరిస్తారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో బీచుపల్లి దేవస్థానం అతి ప్రాముఖ్యమైనది. పాలమూరు జిల్లాలో కృష్ణా, తంగిడి, పెద్ద చింతరేవుల, నందిమళ్ళ, బీచుపల్లి, రంగాపురం, మూలమల్ల, జూరాల, నది అగ్రహారం, సోమశిల, జటప్రోలు, అలంపూర్, క్యాతూరు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చెల్లెపాడు, గొందిమళ్ల, పస్పుల, పంచదేవ్‌పాడు, గుడెబళ్ళేరు, రామాపురం, భీరెల్లి, అమరగిరి, గుమ్మడం, పెద్దమరూర్, పారేవుల, రేవులపల్లి, ముంగమాన్ దిన్నె, పాతాళగంగ తదితర ప్రాంతాలలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. ఈ కష్ణానది వెంట ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రాలు, స్నానఘట్టాల వివరాలివి.

తంగిడి
కృష్ణానది తెలంగాణలోకి అడుగిడే ప్రాంతం తంగిడి. ఇది మాగనూరు మండల కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ దేవాలయం, కృష్ణానది, భీమా నదుల సంగమ క్షేత్రంను చూడవచ్చు. మక్తల్ నుంచి రవాణా సౌకర్యం కలదు.
కృష్ణ
మాగనూరు మండల కేంద్రం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో కృష్ణ గ్రామముంటుంది. ఇక్కడ బ్రిటీష్ కాలంనాటి రైల్వే స్టేషన్, నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి, క్షీరలింగేశ్వర దేవాలయాలను దర్శించవచ్చు. మక్తల్ నుంచి రవాణా సౌకర్యం ఉంది.
గుడెబల్లూరు
గుడెబల్లూరు తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఇది మాగనూరు మండల కేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని యాత్రికులు దర్శించుకోవచ్చు. మక్తల్, రాయచూర్, హైదరాబాద్ నుంచి రవాణా సౌకర్యం ఉంది.
బీరెల్లి
బీరెల్లి గద్వాలకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గద్వాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ గుర్రంగడ్డ దీవిని చూడవచ్చు.
రేకులపల్లి
రేకులపల్లి గద్వాల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గద్వాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశం గుండాల జపాతం. ఇది పర్యాటకులకు అమితానందాన్ని కలుగజేస్తుంది.
నెట్టెంపాడు
నెట్టెంపాడు ధరూరు మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధరూర్, గద్వాల నుంచి రవాణా సౌకర్యం కలదు. ఇక్కడ నారదగడ్డ, గుడ్డెందొడ్డి ఎత్తిపోతల పథకాలను చూడవచ్చు.
ఉప్పేరు
ధరూరు మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉప్పేరు ఉంటుంది. ధరూరు, గద్వాల నుంచి రవాణా సౌకర్యం కలదు.
రేవులపల్లి
ధరూరు మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో రేవులపల్లి ఉంటుంది. ధరూరు, గద్వాల నుంచి రవాణా సదుపాయం కలదు. ఇక్కడ జూరాల జల విద్యుత్‌కేంద్రం, జూరాల ప్రాజెక్టు, సీతారామాలయాలను చూడవచ్చు.
పెద్ద చింతరేవుల
ధరూరు మండల కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పెద్ద చింతరేవుల ఉంటుంది. ధరూరు, గద్వాల నుంచి రవాణా సౌకర్యం కలదు. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన చింతరేవుల ఆంజనేయస్వామిని దర్శించవచ్చు.
నది అగ్రహారం
గద్వాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో నది అగ్రహారం కలదు. ఇక్కడికి వెళ్లడానికి గద్వాల నుంచి రవాణా సదుపాయం కూడా కలదు. ఇక్కడ పురాతన ఆలయాలు, గద్వాల కోట, మఠాలు, జములమ్మ దేవస్థానం, జములమ్మ రిజర్వాయర్‌లను చూడవచ్చు.
పారేవుల
ఇది మక్తల్ మండల కేంద్రం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మక్తల్ నుంచి రవాణా సౌకర్యం కలదు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశం నారదగడ్డ.
పస్పుల
మక్తల్ మండలకేంద్రం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పస్పుల మక్తల్ నుంచి రవాణా సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కుర్వపురం (దీవి గ్రామం), దత్తాత్రేయ పీఠాలను దర్శించవచ్చు.
పంచదేవపాడు
పంచదేవపాడు మక్తల్ కేంద్రం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మక్తల్ నుంచి రవాణా సౌకర్యం కలదు. ఇక్కడ పాండురంగస్వామి, భీమాప్రాజెక్టులను చూడవచ్చు.
జూరాల
జూరాల పేరుమీదనే జూరాల ప్రాజెక్టు ఏర్పడింది. ఈ జూరాల ఆత్మకూరు మండల కేంద్రం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి అత్మకూరు, గద్వాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ జూరాల జల విద్యుత్‌కేంద్రం, గుండాల జలపాతాలను చూడవచ్చు.
నందిమల్ల
జూరాల ప్రాజెక్టు వెలిసిన ప్రాంతమే నందిమల్ల. ఇది ఆత్మకూరు మండల కేంద్రం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆత్మకూరు, గద్వాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. ఈ ప్రాంతంలో జూరా ప్రాజెక్టు, పాత శివాలయం, చంద్రఘడ్ కోటలను చూడవచ్చు.
మూలమల్ల
ఆత్మకూరు మండల కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మూలమల్ల ఉంటుంది.ఆత్మకూర్, గద్వాల నుంచి రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయాలను చూడవచ్చు.
బీచుపల్లి
పాలమూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచింది బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం. ఇది జాతీయ రహదారి పక్కన ఉండడంతో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక్కడికి వెళ్ళడానికి హైద్రాబాద్, పెబ్బేరు, గద్వాల నుంచి రవాణా సౌకర్యముంది. ఇక్కడ ఆంజనేయస్వామి దేవాలయంతోపాటు కోదండరామస్వామి దేవాలయం, లక్ష్మీహయగ్రీవా సరస్వతీ ఆలయం, శివాలయంలతో పాటు నిజాంకొండలను చూడవచ్చు.
రంగాపురం
ఇది కూడా జాతీయ రహదారి పక్కనున్నది. పెబ్బేరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నున్నది. పెబ్బేరు, గద్వాల, హైదరాబాద్ నుంచి రవాణాసౌకర్యం కలదు. ఇక్కడ భక్త ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీరంగాపురం పద్మనాభస్వామి క్షేత్రం, శ్రీరంగాపూర్ రిజర్వాయర్‌లను చూడవచ్చు.
గొందిమళ్ల (జోగుళాంబ)
అలంపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో గొందిమళ్ల ఉంది. అక్కడికి వెళ్ళడానికి అలంపూర్ చౌరస్తా నుండి రవాణా సదుపాయం కలదు. గొందిమళ్ల సమీపంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలంపురం నవబ్రహ్మ ఆలయాలు, జోగుళాంబదేవి కృష్ణా, తుంగభద్ర సంగమం, సంగమేశ్వరాలయం, పాపనాశేశ్వర ఆలయం, మ్యూజియం, జుంకారీశ్వరి ఆలయం, దర్గాలను దర్శించవచ్చు.
క్యాతూరు
అలంపురం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నున్నదే క్యాతూరు గ్రామం. క్యాతూరుకు వెళ్ళడానికి అలంపురం చౌరస్తా నుంచి రవాణా సదుపాయం కలదు. క్యాతూరు సమీపంలో చూడదగ్గ ప్రదేశాలలో అలంపురంలోని జోగుళాంబ దేవాలయం, నవబ్రహాలయాలు, సంగమేశ్వరం, పాపనాశేశ్వర్ ఆలయాలను చూడవచ్చు.
సోమశిల
పాలమూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సోమశిల. ఇది కొల్లాపూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో లలితాంబిక ఆలయం, సప్తనదుల సంగమక్షేత్రం, జ్యోతిర్లింగాలు ప్రసిద్ధమైనవి.
అమరగిరి
పాలమూరు పాపికొండలుగా అమరగిరి ప్రసిద్ధి. ఇది కొల్లాపూర్ మండల కేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొల్లాపూర్ నుంచి రవాణా సదుపాయం కలదు. ఇక్కడ అంకాలమ్మ కోట, మల్లయసెల, పాపికొండలు లను ప్రకృతి పరవశంతో చూడవచ్చు.
జటప్రోలు
శిల్పసంపదకు ప్రతీక జటప్రోలు ఆలయాలు. ఇది వీపనగండ్ల మండల కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొల్లాపూర్, వీపనగండ్ల నుంచి రవాణా సదుపాయం కలదు. ఇక్కడ మదనగోపాలస్వామి ఆలయం, అగస్తేశ్వర ఆలయాలు, సురభి రాజులకోటలను దర్శించుకోవచ్చు.
బెక్కెం
చారిత్రక ప్రదేశంగా బెక్కెం వినుతికెక్కింది ఇది వీపనగండ్ల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీపనగండ్ల నుండి రవాణా సదుపా యముంది. బెక్కెం చెరువు, భోగేశ్వర ఆలయంలను ఇక్కడ చూడవచ్చు.
పాతాళగంగ
శ్రీశైలం డ్యాం సమీపంలో పాతాళగంగ ఉంది. ఇది అమ్రాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో నున్నది. మహబూబ్‌నగర్, అచ్చంపేట, హైదరాబాద్‌ల నుంచి రవాణా సౌకర్యముంది. ఇక్కడ శ్రీశైల ప్రాజెక్టు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలను చూడవచ్చు.

నల్లగొండజిల్లాలో

జిల్లా పరిధిలోని 250 కిలో మీటర్ల మేరకు ప్రవహిస్తున్న కృష్ణా పరీవాహక ప్రాంతంలో లక్షలాదిమంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తారు. పుష్కర స్నానాలను ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రప్రభుత్వం నల్లగొండ జిల్లాలో సుమారు రూ.600 కోట్ల ఖర్చుతో అన్ని ఏర్పాట్లను చేయటంలో నిమగ్నమైంది. భక్తులు పుణ్యస్నానాలను ఆచరించేందుకు జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో మొత్తం 28 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. దేవరకొండ, నాగార్జున సాగర్, దామరచర్ల, వాడపల్లి, మంహకాళిగూడెం, మటంపల్లి, మేళ్లచెరువు, నల్లగొండ, కనగల్‌లలో ఏర్పాటైన పుష్కరఘాట్లు దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

అజ్మాపురం ఘాట్:
పెద్దఅడిశెర్లపల్లి మండలం అజ్మాపురంలో పుష్కరఘాట్ ఏర్పాటైంది. ఈ ఘాట్ వద్ద గంగదేవరతల్లి దేవస్థానం ఉంది. కృష్ణా నదిలో పుస్కర స్నానలు ఆచరించిన భక్తులు ఈ గంగదేవరతల్లిని దర్శించుకోవచ్చు. ఈ ఘాట్‌కు చేరుకోవాలంటే కొండమల్లేపల్లి ద్వారా అజ్మాపురం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి కృష్ణా పుష్కర స్నానాలను ఆచరించాలంటే 120 కిలోమీటర్లు ప్రయాణిచాల్సి ఉంటుంది.
పెద్దమునిగల్ పుష్కర ఘాట్ వద్ద తుల్జాభవాని అమ్మవారి దేవస్థానం
పెద్దమునిగల్ ఘాట్:
చందంపేట మండలం పెద్దమునిగల్ వద్ద పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అశోక చక్రవర్తి పూజింపబడిన తుల్జాభవాని అమ్మవారి దేవస్థానం ఉంది. కొండమల్లేపల్లి, అజ్మాపురం ద్వారా పెద్దమునిగల్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఈ పుష్కరఘాట్ ఉంది.
కాసరాజు పల్లిఘాట్:
ఈ ఘాట్ కూడా చందంపేట మండలంలోని కాసరాజుపల్లిలో ఏర్పాటైంది. ఈ ఘాట్‌లో పుష్కర స్నానాన్ని ఆచరించిన భక్తులు భరమస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఘాట్‌కు చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 147 కిలోమీటర్లు భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఉట్లపల్లి ఘాట్:
పెదవూర మండలం ఉట్లపల్లిలో ఈ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణాపుష్కర స్నానాన్ని ఆచరించిన భక్తులు కృష్ణానది పక్కనే ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఉట్లపల్లి ఘాట్ హైదరాబాద్‌కు 145 కిలొమీటర్ల దూరంలో ఉంది.
పొట్టిచెల్మఘాట్:
పొట్టిచెల్మఘాట్ కూడా పెదవూర మండంలోనే ఏర్పాటైంది. దయ్యాలగండి వద్ద ఈ పుష్కరఘాట్‌ను నిర్మించారు. ఇక్కడ పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించిన భక్తులు సమీపంలోని సమ్మక్క, సారలక్క అమ్మవార్ల దర్శనం చేసుకోవచ్చు. నాగార్జునసాగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పుష్కరఘాట్ ఉంది. కూతవేటు దూరంలోనే సమ్మక్క,సారలక్కలు వెలిసి ఉన్నారు. హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణించి భక్తులు ఇక్కడికి చేరుకోవచ్చు.
శివాలయంఘాట్:
నాగార్జునసాగర్ డ్యాం దిగువన మొత్తం రెండు ఘాట్లు ఏర్పాటయ్యాయి. అందులో ఒకటి శివాలయంఘాట్ కాగా మరొకటి సురికి వీరాంజనేయస్వామిఘాట్. ఈ ఘాట్లలో పుష్కర స్నానాన్ని ఆచరించినవారు శృంగేరి మఠాధిపతులు ఏర్పాటు చేసిన శివాలయం, సురికి వీరాంజనేయస్వామి దేవాలయం, ఏలేశ్వరాలయం, రామాలయం, రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయం, మార్కండేయ మల్లికార్జునస్వామి ఆలయాలను సందర్శించుకోవచ్చు. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరం ఉంది.
వాడపల్లిఘాట్స్:
రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాని దామరచర్ల మండలం వాడపల్లిలో అత్యధికంగా అంటే 8 పుష్కరఘాట్లు ఏర్పాటయ్యాయి. అలాగే మండల పరిధిలోని అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, ఇర్కిగూడెంలలో కూడా పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. వాడపల్లిలోని పుష్కరఘాట్లు అన్నీ 1.5 కిలో మీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అయ్యప్పదేవాయంఘాట్, సిమెంట్‌రోడ్‌ఘాట్, ముదిరాజ్ రేవుఘాట్, పాత పోలీస్ స్టేషన్‌ఘాట్, మెట్ల రేవుఘాట్, లక్ష్మీపురంఘాట్, శివాలయంఘాట్, లక్ష్మినర్సింహ్మస్వామిఘాట్ ఇక్కడ ఉన్నాయి. కృష్ణామూసీ సంగమం ఇక్కడే జరుగుతుంది. ఈ సంగమం వద్ద శ్రీ మీనాక్షీ అగస్తేశ్వర స్వామి దేవాలయం ఉంది. పూర్వం అగస్త మహాముని శివ కేశవుల విగ్రహాలను ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు. దీంతో పురాణ ప్రాశస్తం కల్గింది. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ఆయా దేవాలయాల్లో దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. నియోజక కేంద్రమైన మిర్యాలగూడెం నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్లు ప్రయాణించి వాడపల్లికి చేరుకోవచ్చు.
ఇర్కిగూడెంఘాట్:
ఇర్కిగూడెంఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించిన భక్తులు ఇక్కడున్న పార్వతమ్మ దేవాయంలో దేవి దర్శనం చేసుకోవచ్చు. మిర్యాలగూడకు ఇర్కిగూడెంఘాట్ 30 కిలోమీటర్లు దూరంలో ఉంది. మిర్యాలగూడ నుంచి ఇక్కడికి చేరుకునేందుకు విష్ణుపురం రెల్వేస్టేషన్‌లో దిగి బస్సుల్లో ఇర్కిగూడెంఘాట్‌కు చేరుకోవచ్చు.
అడవిదేవులపల్లిఘాట్:
దామరచర ్లమండలం అడవిదేవులపల్లిలో ఏర్పాటైన ఘాట్లో పున్యస్నానాలు భక్తులు ఇక్కడ ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం, సూర్యదేవాలయం, సోమేశ్వరాలయాల్లో దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. మిర్యాలగూడెం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘాట్ ఉంది.
ముదిమాణిక్యంఘాట్:
దామరచర్ల మండంలోని ముదిమాణిక్యంఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఇక్కడ ఉన్న సీతారామస్వామి ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. ఈ ఘాట్‌ను చేరుకోవాలంటే మిర్యాలగూడ నుంచి అడవిదే వులపల్లి, వీర్లపాలెం మీదుగా బస్సుల్లో చేరుకోవచ్చు.
మహంకాళిగూడెం ఘాట్:
నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం వద్ద రావి పహాడ్ పంచాయతీ పరిధిలో ఈ పుష్కరఘాట్ ఏర్పాటు చేశారు. ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి సమీపంలోనే మత సామరస్యానికి ప్రతీకైన జాన్‌పాడ్ దర్గా ఉంది. ఈ దర్గాను హిందూ, ముస్లింలు దర్శించుకుంటూ ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది.
బాలాజీ, ప్రహల్లాద, మార్కండేయ ఘాట్లు:
మటంపల్లి మండలంలోని మట్టపల్లిలో బాలాజీఘాట్, ప్రహల్లాదఘాట్, మార్కండేయఘాట్‌లు ఏర్పాటైనాయి. ఇక్కడ క్రీ.శ. 400 సంవత్సరాల కాలంలో నిర్మించిన చారిత్రక లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయం ఉంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు సూర్యాపేట, కోదాడ, చిలుకూరు, హుజూర్‌నగర్ బైపాస్ ద్వారా మట్టపల్లి చేరుకోవచ్చు. నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో మట్టపల్లి ఉంది.
మేళ్లచెరువు మండంలోని ఘాట్లు:
మేళ్ల చెరువు మండలంలో కిష్టాపురం, వజినేపల్లి, బుగ్గమాదారం ఘాట్లు ఏర్పాటయినాయి. హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు సూర్యాపేట, కోదాడ ద్వారా మండల కేంద్రమైన మేళ్లచెరువు చేరుకకుని అక్కడి నుంచి కిష్టాపురంఘాట్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామిని పుష్కరస్నానాలు చేసిన భక్తులు దర్శించుకోవచ్చు. వజినేపల్లిలో ఏర్పాటైన పుష్కర వద్ద బద్రీనారాయణస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ పుష్కరస్నానాలను ఆచరించినవారు బద్రీనారాయణస్వామిని దర్శించుకోవచ్చు. మేళ్లచెరువు నుంచి వజినేపల్లి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బుగ్గమాదారం పుష్కరఘాట్‌ను సూర్యాపేట, కోదాడ, మేళ్లచెరువు మీదుగా బుగ్గమాదారంఘాట్ చేరుకోవచ్చు. మేళ్లచెరువు నుంచి 20 కిలోఈటర్ల దూరంలో బుగ్గమాదారం ఉంది.
పానగల్‌ఘాట్:
నల్లగొండ మున్సిపల్ పట్టణ పరిధిలోని పానగల్‌లో ఉదయ సముద్రం వద్ద పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి సమీపంలో కాకతీయులు, చోళుల కాలంలో నిర్మించిన శివాలయం, ఛాయాసోమేశ్వరాలయం ఉన్నాయి. జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో పానగల్ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నల్లగొండ బైపాస్ మీదుగా పానగల్ చేరుకోవచ్చు.
దర్వేశిపురం ఘాట్:
కనగల్ మండలంలో కనగల్ వాగులో పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఆ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు ప్రసిద్ధిచెందిన రేణుకాఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. నల్లగొండకు ఈ పుష్కరఘాట్ 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నల్లగొండ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోసంగమేశ్వరం ఘాట్ :
కర్నూలు నుంచి 120 కి.మీ దూరంలో ఈ ఘాట్ ఏర్పాటయింది. ఇక్కడ సంగమేశ్వరస్వామి ఆలయం, కొలనుభారతిలను దర్శించుకోవచ్చు. లింగాల పట్టు ఘాట్ కర్నూలు నుంచి 200 కి. మీ దూరంలో ఉంది.
గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఘాట్లు
సత్రశాల ఘాట్, దైద ఘాట్, పొందుగల ఘాట్, తాళ్లయ్యపాలెం ఘాట్, సీతానగరం ఘాట్, చిలుమూరు ఘాట్,ధరణికోట ఘాట్.
విజయవాడలోని ఘాట్లు:
పెదకళ్లేపల్లి ఘాట్: మోపీదేవి మండలంలో ఉన్న ఈ ఘాట్‌కు ప్రత్యేకమైంది. ఈ ప్రాంతం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కొత్తపేట ఘాట్, శ్రీపాద క్షేత్రం ఘాట్,సంగమ ప్రదేశం ఘాట్, మహాఘాట్..
దుర్గా ఘాట్:ప్రకాశం బ్యారేజ్ నుంచి కనకదుర్గ ఆమ్మవారి గాలిగోపురం వరకు 325 మీటర్ల పొడవున విస్తరించి ఉందీ ఘాట్.
కృష్ణవేణి ఘాట్: ఇక్కడ షవర్ బాత్‌లను ఏర్పాటుచేశారు. ఇది కూడా విజయవాడ నగరంలో ఉంది.
పద్మావతి ఘాట్: విజయవాడలో ఉంది. ఇష్టకామ్యార్ధ నాగేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధం. బస్ స్టాండ్ నుంచి నడక మార్గంలో భక్తులు ఈ ఘాట్ వద్దకు చేరుకోవచ్చు.
ఫెర్రీ ఘాట్: పవిత్ర సంగమానికి ఆనుకుని హారతి పెవిలియన్ దాటిన తర్వాత 750 మీటర్ల పొడవైన ఈ ఘాట్‌ను నిర్మించారు.విజయవాడ, హైదరాబాదు నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఘాట్ వద్దకు వెళ్లాలి.
మహాఘాట్: పున్నమి, భవానీ ఘాట్‌లను కలిపి మహాఘాట్‌లుగా చేశారు. విజయవాడ నగరంలో ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక సిటీ బస్సులను వేశారు.