Friday, April 19, 2024

సాంస్కృతిక వైభవానికి ప్రతీక..‘బతుకమ్మ’

- Advertisement -
- Advertisement -

bathukamma festival celebration 2020

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వేనోళ్ళ చాటి చెప్పే పండుగ ‘బతుకమ్మ’. బతుకు + అమ్మ= బతుకమ్మ అని దీవించే పండుగ. దీన్ని పూల పండుగ అని, స్త్రీల పండుగ అని రకరకాలుగా వ్యవహరిస్తారు. అసలు బతుకమ్మ అంటేనే… ప్రకృతికి సంబంధించిన పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే పూజించే సంస్కృతి ఒక తెలంగాణలోనే కనబడుతుంది. ముఖ్యం గా స్త్రీలకు అత్యంత ఇష్టమైన పండుగగా ప్రసిద్ధికెక్కింది. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పే పండుగ మాత్రమే కాదు, స్త్రీల ఔన్నత్యాన్ని ప్రపంచానికి జోరుగా చాటి చెప్పే పండుగ. ఆడపడుచులందరికీ అత్యంత విశిష్టమైన పండుగ ఇది.
బతుకమ్మ పండుగ (ఫ్లవర్స్ ఫెస్టివల్) పూల జాతర ను తలపిస్తుంది. ఈ పండుగ ప్రతి ఏటా సెప్టెంబర్ /అక్టోబర్ నెలల్లో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలవుతుంది.

దీని 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మను గౌరీ పండుగ అని కూడా అంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మ వరకు రోజుకో తీరుగా ఆడి పాడే పండుగ. ఆ అనంతరమే దసరా పండుగ వైభవంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్యతో ప్రారంభమై, దుర్గాష్టమితో ముగింపు అవుతుంది. బతుకమ్మ పండుగ వస్తుంది అంటే… ఆడబిడ్డల హృదయాలు ఉప్పొంగుతాయి. అన్నా చెల్లెల అనుబంధాలు, తల్లి బిడ్డల ప్రేమానుబంధాలు వెల్లివిరుస్తాయి. ఈ పూల పండుగ కోసం ఎదురు చూస్తూ.. అత్తగారింట్లో ఉన్న ఆడపిల్లలు మెట్టినిల్లు నుండి పుట్టినిల్లుకు అంటే సొంత ఊర్లకి రావడం అనవాయితీగా, సాంప్రదాయబద్ధంగా మనం చూస్తూ ఉంటాము. అసలు ఈ పండుగ ఎలా వచ్చింది? జరుపుకునే విధానం ఏమిటి? అని ఒకసారి మనం పరిశీలిస్తే.. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన కథలు మనకు దొరుకుతాయి. తెలంగాణ నేల పై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు.

ఈ పండుగ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు నవాబులు, భూస్వాములు, పెత్తందార్లతనంతో, బూర్జువా విధానాలతో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు పూజించేవారు. అట్లా వారి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ… బతుకమ్మ…. అంటూ జీవిస్తూ ఉండాలని పాడేవారు. ఇట్లా మొదలైందని కొందరంటారు. అయితే చారిత్రక కథనం పరిశీలిస్తే, చోళ రాజుల కాలంలో వేములవాడ (తెలంగాణ) నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తంజావూరు (తమిళనాడు)కు తరలించడం జరిగిందని, దానితో తెలంగాణ ప్రజల మనసు కలచివేసిందని, బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకుగాను తమ దుఃఖాన్ని ఆనాటి చోళ రాజులకు తెలియజేస్తూ మేరు పర్వతములా పూలను పేర్చి బతుకమ్మను ఆడటం జరిగిందని, అట్లా ఆడపడుచులు అందరూ తమ భావనలను పాటల రూపంలో ఆడిపాడుతూ బతుకమ్మను కొలుస్తూ ఉండేవారని, ‘బృహదమ్మ’ పేరే చివరకు బతుకమ్మగా ఆవిర్భవించిందని, సుమారు వెయ్యి సంవత్సరముల నుండి ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడం సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉందని అనేక చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా గౌరమ్మను పసుపుతో తయారు చేసి, పూలతో బతుకమ్మను పేర్చి, చివరకు., మధ్యలో గౌరమ్మను పెట్టడం జరుగుతుంది. శివుడులేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారని ప్రతీతి.

ఇంకొక పౌరాణిక కథ కూడా ప్రచారంలో కలదు. ఆనాటి చోళరాజు ధర్మాంగదునికి సంతానం ఉండదు. అనేక నోములు, వ్రతాలు చేసిన తర్వాత ఆయన భార్యకు నూరుగురు పుత్రులు పుడతారు. అయితే, కాలం కలిసి రాక వారంతా యుద్ధాలలో ప్రాణాలు కోల్పోతారు. ఆ రాజదంపతులు తీరని దుఃఖంతో లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. ఆ దేవతనే తమ కడుపున పుట్టమని వేడుకుంటారు. అందుకు కరుణించిన లక్ష్మీదేవి వారికి కుమార్తెగా పుడుతుంది. మునులంతా వచ్చి ఆమెను…. ‘నిండు నూరేళ్లు బతుకమ్మా’ అని దీవిస్తారు. అలా లక్ష్మీదేవే ‘బతుకమ్మ’ గా పిలువబడుతుందని చెబుతారు. ఇలా ఉండగా, మహావిష్ణువు మరో చోట చక్రాంకుడనే రాజుగా జన్మిస్తాడు. అతనే లక్ష్మీ స్వరూపులైన బతుకమ్మను పెళ్లి చేసుకుంటాడు. నాటి నుండి దేశ ప్రజలంతా లక్ష్మీదేవి అవతారంగా బతుకమ్మను పూలతో అలంకరించి పండుగ జరుపుకోవడం వస్తుందని అంటారు.
అలాగే బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి మరొక జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు ఏడో సంతానంగా ఆడపిల్ల పుడుతుంది.

అంతకు ముందు పుట్టిన ఆరుగురు ఆడపిల్లలు ఏవో కారణాలతో చనిపోతారు. దానితో ఈమెను బతికిన అమ్మగా భావిస్తారు. అమ్మ నాన్నలే కాదు, ఊరువాడ జనులందరు అప్పటి నుంచి ‘బతుకమ్మ’ అని పిలుస్తారు. ఆమెతోడ ఒక్కడే అన్న. అతనికి చెల్లెలు అంటే పంచప్రాణాలు. బతుకమ్మకు పెళ్లి కాగానే అత్తగారింటికి పంపుతారు. భర్త ఆమెను బాగా చూసుకుంటాడు. అయితే ఓ పాలి పుట్టింటికి వచ్చిన సమయంలో వదిన, బతుకమ్మపట్ల అన్న చూపించే ప్రేమని భరించలేకపోతది. అసూయ పడతది. చివరకు బతుకమ్మను చంపడానికే ప్రయత్నిస్తుంది. అన్న ఊరు వెళ్లిన సమయం చూసుకొని, బతుకమ్మ తో వదిన కలిసి చెరువు వద్దకు వెళతారు. అవకాశం కోసం ఎదురు చూసే వదిన, బతుకమ్మను గొంతు పిసికి చంపేస్తుంది. అక్కడే గొయ్యి తీసి పాతి పెడుతుంది. కానీ, అదే రోజు రాత్రి బతుకమ్మ తన అన్నకు కలలో వచ్చి విషయమంతా చెబుతుంది. చెరువు కట్టపై తాను తంగేడు చెట్టుగా పుట్టానని, వెంటనే వచ్చి తీసుకెళ్ళమని ప్రాధేయ పడుతుంది. అన్న వెళ్లి చూడగా అక్కడ తంగేడు చెట్టు బతుకమ్మ రూపంలో దర్శనమిస్తుంది. ఇతర పూలతో కలిపి తంగేడు పూలు జోడించి, బతుకమ్మను పేర్చి నీటిలో నిమజ్జనం చేయమని కోరుతుంది. ఇక అప్పటి నుంచి బతుకమ్మను పూజించే ఆచారం ఏర్పడిందని అనేక మంది విశ్వాసం. ఇట్లా ఇంకా బతుకమ్మ పుట్టుక గురించిన అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

బతుకమ్మ పండుగ వచ్చే కొద్ది రోజుల ముందే….. అమ్మానాన్నలు, అన్నా తమ్ముళ్లు వారికి అందుబాటులో ఉన్న గడ్డిపూలు సేకరించడం, కట్టలు కట్టలుగా కట్టి భద్రపరచడం జరుగుతుంది. అమ్మగారి ఇంటికి వచ్చిన ఆడపిల్లలు బతుకమ్మను ఆడుతారు. పెళ్లి కాని ఆడపిల్లలు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మతో ప్రారంభమవుతుంది. పండుగకు ముందు రోజు గానీ, అదే రోజు గానీ తంగేడు పువ్వు, బంతి పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, గులాబీ పువ్వు, గన్నేరు పువ్వు, గోరింక పూలు, బంతిపూలు, మందార పూలు, కనకాంబరాలు ఇట్లా అనేక రకాల పూలు సేకరించి, ఇంట్లో ఉండే పందిట్లో చాప పరిచి పూలను కట్టలుగా ఏర్పాటు చేసి, అంతకుముందే స్వీకరించిన గడ్డిపూలకు రంగులద్ది వారు వారి ఇళ్ళల్లో ముత్తైదువులు పూలతో శంకు ఆకారంలో అంటే తాంబలంలో గుమ్మడి ఆకులు పరిచి వరుసకు ఒక్కొక్క రంగుపూల చొప్పున ప్రారంభంలో వెడల్పు గాను, పోను పోను… తగ్గిస్తూ శంకు మాదిరిగా తీరొక్క పూలను పేరుస్తారు.

బతుకమ్మను పేర్చిన తర్వాత చివరకు మధ్యలో పసుపుతో గౌరమ్మను తయారుచేసి ఆ బతుకమ్మను దేవుని వద్ద పెడతారు. ఆ బతుకమ్మకు(గౌరమ్మ) కు పూజలు చేసి. ధూప దీప నైవేద్యాలు సమర్పించి బయటకు తీసే ముందు ఆ ఇంటి ఆడపడుచు బతుకమ్మను తలమీదగానీ, చేతులతో పట్టుకొని ఇంటి ముందు నిలబడ్డప్పుడు కొబ్బరికాయ కొట్టి, కాళ్లకు నీలారా పోసి డప్పు చప్పుళ్ళతో సమీపంలో ఉన్న దేవాలయం ప్రాంగణంలో గాని, వెడల్పుగా ఉండే చావిడి వద్దకు గాని సమూహంగా వెళ్తారు. అట్లా చేరుకున్న మహిళలు రంగురంగుల బతుకమ్మలను ఒక చోట పెట్టి తిరోక్క పాటలతో బతుకమ్మ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆడుతారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు పెత్తరమాస నుండి మొదలై, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన్న బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేప పువ్వు బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ, చివరకు సద్దుల బతుకమ్మ….ఇలా రోజుకో రకంగా ఆడడం, నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

బతుకమ్మ పండుగ రోజుల్లో పాడే పాటల్లో గ్రామీణ జీవనం ఉట్టి పడుతుంది. ప్రజల జీవ భాష దర్శనమిస్తుంది. ఈ పాటలన్నీ తెలంగాణ సంస్కృతిని, విశిష్టతను చాటిచెబుతాయి. అసలు బతుకమ్మ అంటేనే ఓ రంగుల కల. పూల పండుగ. ఆడపడుచుల జానపద పాటలు, కోలాటం పాటలు, ఉయ్యాల పాటలు ఇలా ప్రతి ఒక్కటి సాంస్కృతిక వైభవాన్ని తరతరాలకు తెలియజేస్తాయి. పట్టు పీతాంబరాలు, పట్టుపరికిణీలు ధరించి, ఆడబిడ్డలు అందరూ అంగరంగ వైభవంగా ఎనిమిది రోజుల పాటు ఘనంగా ఆడుతారు. ఇది ఒక మురిపాల పండుగ. తమ కష్టాలను సుఖాలనూ పాటల రూపంలో వ్యక్తం చేయడం వల్ల తమ తమ హృదయాంతరాలలో దాక్కున్న బరువు తగ్గడమే కాకుండా, అమితానందం కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. అయితే ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ రోజుల్లో కొన్ని పాటలు పరిశీలిద్దాం.

‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో…. బిడ్డా లెందరే వలలో…. ‘అనే పాట కుటుంబ నేపథ్యాన్ని, సంతాన ప్రాధాన్యతను తెలియజేస్తుంది‘. / ఒక్కొక్క పువ్వేసి చందమామ… ఒక్క ఝాము ఆయె సందమామ….. రెండేసి పువ్వేసి చందమామ… రెండు జాములాయే సందమామ….. ఇలా పూల ప్రాముఖ్యతను పాడుతారు. ‘ రామ రామ రామ ఉయ్యాలో…. రామనే శ్రీరామ ఉయ్యాలో… / ఒక్కడే మాయన్న ఉయ్యాలో… వచ్చన్న పో డేమీ ఉయ్యాలో….‘ అంటూ తమ తోడ పుట్టిన వారు తీసుకొని కోవాలని, వారి వారి అన్నలను వేడుకుంటూ పాడిన పాట అందరి హృదయాలను కరిగిస్తుంది. ‘తంగేడు పువ్వుల్ల చందమామ…. మల్లెప్పుడొస్తావు చందమామ….. గును గీ య పువ్వుల్ల చందమామ… బతుకమ్మ పోతుంది చందమామ…. ఏడాదికోసారి చందమామ…. ‘అనే పాట ఎంతో రసవత్తరంగా, బతుకమ్మ మీద ఉన్న ప్రేమను చాటి చెబుతుంది.‘ రావు రావు గౌరమ్మ… రావు మా ఇంటికి దానూక..‘ అనే పాట బతుకమ్మను సాగనంపే పాట. /
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో/ బంగారు బతుకమ్మ ఉయ్యాలో/ తంగేడు గునుగు లో ఉయ్యాలో/ తరలి వచ్చేను ఉయ్యాలో….’
‘వరమున పుట్టింది ఉయ్యాలో/ వరలక్ష్మి దేవి ఉయ్యాలో….‘ ‘ ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో/ ఒక్కూరికిస్తే ఉయ్యాలో/ ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న పొడేమి ఉయ్యాలో….‘
శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ/ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ…. ‘జనకు జనకు నింట్లో కోల్ / పుట్టింది ఆ సీత కోల్…. అనే పాటల తో పాటు….‘ గల్లు గల్లున.. గల్లు గల్లున…. గల్లు గల్లున’ ‘పచ్చ పచ్చని పల్లె పచ్చాని పల్లె/ మబ్బుల్లో లేచింది వాకిళ్లు ఊడ్చి ముగ్గుళ్లు పెట్టింది….‘, ‘ చినుకు కురిసి పుడమి మెరిసే ఓ లాలి ముద్దుల గుమ్మడి…/ మట్టి వాసన మనసును తాకే ఓ లాలి ముద్దుల గుమ్మడి..‘ ఇట్లా అనేక పాటలు తెలంగాణ ప్రాంత విశిష్టతను, సుఖదుఃఖాలను ఆడబిడ్డల ఆర్తిని వల పోస్తాయి. ప్రతి పాటలో ప్రజల సాంప్రదాయాలకు సంబంధించి ఓ నేపథ్యం కనిపిస్తుంది. అన్నాచెల్లెళ్ల ప్రేమను ఒలకబోస్తూ ఉంది. కుటుంబ సభ్యుల ఆనందాన్ని, ప్రేమలను నడిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులంతా బతుకమ్మ మాట ముచ్చట్లతో గడుపుతారు.

ఆతొమ్మిది రోజులు ఊరువాడ లన్నీ పువ్వులతో పులకించి, పాటలతో పలకరించి, ప్రకృతి అంతా ఊర్లకు వచ్చినంత సంబురం కనిపిస్తుంది. ఈ బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరలో, శీతాకాలం తొలిరోజుల్లో ప్రతియేటా దర్శనమిస్తుంది. ఇది ఒక్క తెలంగాణ ప్రాంతానికే చెందిన పండుగ. ప్రపంచంలో మరెక్కడా ఎటువంటి పండుగ కనిపించదు. ప్రకృతిని ముఖ్యంగా పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణ ప్రజలలో తరతరాలుగా కనిపిస్తది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలు ప్రజల్ని మరింత ఏకం చేసి, రాష్ట్ర సాధనకు కార్యోన్ముఖుల చేసింది. బతుకమ్మ పండుగ ముచ్చటైన పండుగ. ఇదొక హృదయ అలంకారమైన జీవన స్రవంతి. తెలంగాణ సంస్కృతిని, విశిష్టతను, గొప్పతనాన్ని తెలియజేసే మహోన్నతమైన పూల పండుగ.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి – 9441561655

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News