Home తాజా వార్తలు వంద డిజైన్లతో బతుకమ్మ చీరల తయారీ అభినందనీయం: ఎన్‌ఆర్‌ఐ సునీత

వంద డిజైన్లతో బతుకమ్మ చీరల తయారీ అభినందనీయం: ఎన్‌ఆర్‌ఐ సునీత

Bathukamma Sarees

 

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కోటి బతుకమ్మ చీరెలను వంద డిజైన్లతో తయారు చేయడం అభినందనీయమని న్యూజిలాండ్‌లో బ్రాండ్ తెలంగాణ సంస్థ వ్యవస్థాపకురాలైన ఎన్‌ఆర్‌ఐ సునీత అన్నారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారక రామారావు చేసిన, చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సిరిసిల్లలో ఆమె నేత కళాకారుల ఉత్పత్తులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తయారు చేస్తున్న బతుకమ్మ చీరెలను నాణ్యతతో తయారు చేయడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో తయారయ్యే బతుకమ్మ చీరెలకు బ్రాండ్ ఇమేజిని కల్పిస్తానని ఆమె అన్నారు. సిరిసిల్లలో అగ్గిపెట్టెలో అమిరే చీరెలను నేసిన ఘనత కలిగిన నేత కళాకారులున్నారన్నారు. సిరిసిల్ల చీరెలను పలు విదేశాల్లో ప్రమోట్ చేస్తున్నట్లు వివరించారు. బతుకమ్మ చీరెలను విక్రయించి సాధించిన లాభాలను పేద నేతన్నల కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ చేసిన, చేస్తున్న కృషిని మీడియా ద్వారా తాను తెలుసుకున్నానని, ఆయన చేస్తున్న అభివృధ్ధి నిజంగా అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల నేత కళాకారులు నల్ల విజయ్, వెల్ది హరిప్రసాద్‌లను ఆమె సత్కరించారు. అగ్గిపెట్టెలో అమిరే చీరను, మినీ పవర్‌లూం యంత్రాన్ని, పవర్‌లూంలు, చేనేత మగ్గాలపై వస్త్రోత్పత్తిని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సామల పావని, ఏఎంసి మాజీ చైర్మన్ జిందం చక్రపాణి, తెరాస రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Bathukamma Sarees with Hundred Designs