Home తాజా వార్తలు వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర

వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర


గ్రామాలకు వెళ్లి చూస్తే సాయంకాలం కాగానే ఫ్యాక్టరీల నుంచి, పొలాల నుంచి, అడవుల నుంచి జనం గుంపులు గుంపులుగా ఇళ్లకు తిరిగి రావడం చూస్తుంటాం. అదే సమయంలో గబ్బిలాలుగా అందరూ పిలిచే రెక్కలున్న క్షీరదాల సమూహాలు (భారత్‌లో దాదాపు 128 గబిలాల తెగలు ఉంటే, ప్రపంచం మొత్తం మీద 1200 కు పైగా తెగలు ఉన్నాయి) చెట్లపైన , గుహల్లోన, రాళ్ల చూరు నుంచి ఆలయాల నుంచి తమ ఎత్తయిన గూళ్లను విడిచిపెట్టి బయలు దేరుతుంటాయి. మానవులతో గబ్బిలాలకు సహజీవనం అనాది నుంచి వస్తున్నదే. రాత్రంతా ఇవి పొలాల్లోను, అడవుల్లోను, గడ్డిపెరిగే మైదానాల్లోను, మన ఇళ్ల చుట్టూ ఉన్న పురుగులు, వ్యవసాయ తెగుళ్లను, వ్యాధికారక దోమలను కూడా తినేస్తుంటాయి.

కొన్ని గబ్బిలాలు పూలల్లో తేనెను గ్రహిస్తాయి. కొన్ని పూల పరపరాగ సంపర్కానికి వీలుగా పుప్పొడిని వివిధ ప్రాంతాల్లో వెదజల్లుతాయి. అలాగే అరటి, జామి, జీడి, మామిడి,మర్రి, ఉసిరి తదితర పండ్ల చెట్ల విత్తనాలను వెదజల్లుతుంటాయి. ఒక తెగ గబ్బిలాల వల్ల చీడపురుగుల జీవ నియంత్రణ జరుగుతుందని, ఫలితంగా ఏటా 2900 టన్నుల వరి ధ్యాన్యం నష్టపోకుండా నివారించడమౌతుందని తాయ్‌లాండ్ లోని ఒక అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల 1.2 మిలియన్ డాలర్లు పొదుపు కావడం లేదా ఏటా 26,200 మందికి భోజనం కొరత లేకుండా నివారించడం జరుగుతుందని అధ్యయనం వివరించింది. గుహల్లోంచి తవ్వి తీసిన గబ్బిలాల రెట్టలు వ్యవసాయంలో పంటల సాగుకు బాగా ఉపయోగమవుతాయి. ఎందుకంటే ఆ రెట్టల్లో నత్రజని, భాస్వరం సాంద్రత ఎక్కువగా ఉంటుంది.

వ్యాధుల వ్యాప్తిలో పాత్ర

ఇంతటి కీలక పాత్ర వహిస్తున్న గబ్బిలాలు దురదృష్టవశాత్తు వ్యాధిని వ్యాపింపచేస్తాయన్న తప్పుడు అపోహలకు గురవుతున్నాయి. గబ్బిలాల వల్ల పర్యావరణ వ్యవస్థ సేవలు జరుగుతున్నాయనడానికి భారత్‌లో ఇప్పటివరకు సరైన అధ్యయనాలు లేవు . అయితే శాస్త్రీయ సాక్షాలు మాత్రం గబ్బిలాల నుంచే సార్స్‌కొవిడ్ 2 (కరోనా ) వైరస్ పుట్టడమే కాదు. వ్యాపిస్తోందన్న నమ్మకాన్ని చాలా ఎక్కువ చేశాయి. అంతేకాదు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా, నిఫా, హెండ్రా, మార్బర్గ్, ఎబోలా తదితర వైరస్ వ్యాధులకు గబ్బిలాలు జన్మస్థానంగా ముఖ్యమైన ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలుసు. వైరస్‌లకు ఇవి నిధి అయినప్పటికీ గబ్బిలాలు మాత్రం ఎప్పుడూ అస్వస్థత పొందక పోవడం విశేషం. ఎగరడం అనేది ఒత్తిడితో కూడిన వ్యవహారం.

దీనివల్ల విషపూరిత ఉప ఉత్పతులు వెలువడుతుంటాయి. అవి కణ పదార్ధాలను దెబ్బతీస్తాయి. అయితే వాటి ఇమ్యూన్‌వ్యవస్థను అణగదొక్కి ఎలాంటి నష్టం లేకుండా చేయగల వ్యవస్థ గబ్బిలాలకుంది. అలాంటి అణచివేత ఫలితంగా నిరంతర స్వయం వ్యాధి నిరోధక ప్రతిస్పందన గబ్బిలాల్లో ఉంటోందని, అదే వైరస్‌ను ఎదుర్కొనేందుకు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుక సహకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆసక్తిదాయకమైన ఈ నైపుణ్యం అత్యధిక తాపజనక ప్రతిస్పందనను అదుపు చేయగలుగుతుంది. (వైరస్ సోకిన మనుషుల్లో విపరీత ప్రభావం తాపజనక ప్రతిస్పందన వల్లే కలుగుతుంది).ఇలాంటి నైపుణ్యం కారణంగా గబ్బిలాలు వైరస్‌కు అతిగా స్పందించవు. అనేక వయసుసంబంధిత మొండి వ్యాదుల నుంచి రక్షణ పొందుతాయి. సుదూరం ఎగరగలిగే సామర్ధం వల్ల గబ్బిలాలకు వారసత్వంగా వ్యాధినిరోధక వ్యవస్థ సంక్రమిస్తోంది. అదే వైరస్‌ల నుంచి వాటికి రక్షణ కలిగిస్తోంది. అదే ఇమ్యూన్ వ్యవస్థ వాటి వయస్సు మాంద్యం కాడానికి ఉపయోగపడుతోంది. సుదీర్ఘకాలం బతికిస్తోంది. గబ్బిలాలు వాటి శరీర పరిమాణం బట్టి సుదీర్ఘకాలం జీవించే క్షీరదాల్లో ఒకటిగా ఉంటున్నాయి.

కరోనా వైరస్ వల్లనే అకస్మాత్తుగా మనం అనేక వైరస్‌లు గురించి తెలుస్తోంది. పైగా గబ్బిలాల వల్ల వ్యాపించే ఈ వైరస్‌లన్నీ మనల్ని చంపేవే. కానీ అలాంటి ప్రాణాంతకాలు వ్యాధికారకాల వ్యాప్తి సహజమైన వాటి స్థావరం లేదా ఆశ్రయాలు నుంచి మనుషుల వంటి కొత్త స్థావరాలకు చేరడం అసాధారణం లేదా అరుదుగా జరుగుతుంది. మనుషులకు ఇలాంటి బలమైన స్థావరాలకు సన్నిహితం బాగా ఉంటేనే అది జరుగుతుంది. స్థానిక ప్రజలకు వన్యప్రాణులకు ఎంతవరకు మచ్చిక చేసుకోవాలో వాటికి ఎలా చోటు ఇవ్వాలో తెలుసు. గబ్బిలాలను కూడా చాలా మంది స్థానికంగా చూస్తుంటారు. వాటి ఉనికిని పాడు చేయడానికి సిద్ధపడరు. అయితే కొందరు మాత్రం ఒంటరిగా ఉంటూ జంతువులను వేటాడడం, వాటి మాంసాన్ని ఆరగించడం చేస్తుంటారు. అలాంటివారు జంతువుల పైన, ప్రకృతి పైనే ఆధారపడి బతుకుతుంటారు.

మరికొందరు ఇరువైపులా ఎలాంటి హాని చేయకుండా సమతూకం పాటిస్తారు. నాగాలాండ్ లోని బొమర్ వంశీయులు ఏటా అక్టోబర్ నెల మధ్యలో మిమి గ్రామంలో గబ్బిలాలు దండిగా ఉండే గుహల దగ్గరకు వెళ్లి కట్టెలను కాలుస్తూ గబ్బిలాల పండగకు సిద్ధమౌతుంటారు. 7000 నుంచి 25000 వరకు గబ్బిలాలు ఊపిరాడక చనిపోతుంటాయి. ఈ గబ్బిలాలను ఔషధ ప్రయోజనకారులుగా వారు భావిస్తుంటారు. డయేరియా, ఒళ్లనొప్పులు తగ్గుతాయని, బలం పెరుగుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటి అధ్యయనం మాత్రం వ్యాధులను ఇవి నయం చేయడం మాట ఎలా ఉన్నా ఫిలోవైరస్‌లను మనుషులకు వ్యాపింప చేస్తాయని తేలింది. ప్రూట్ తెగకు చెందిన గబ్బిలాల నుంచి స్రవించే ద్రవాలు ఈ ఫిలోవైరస్‌లను మనుషులకు, వానరాలకు సంక్రమింప చేస్తాయని తేలింది. ఈ వైరస్ మనుషుల్లో హెమరేజిక్ జ్వరాన్ని రక్తం చిమ్మడం తోపాటు ఎబోలా వైరస్ వంటి ఇతర హానికర అనారోగ్య లక్షణాలను కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

బొమర్ వంశీయులు ఈ గబ్బిలాల పండగను చేసేటప్పుడు గబ్బిలాలు వారిపై దాడి చేస్తుంటాయి. కుట్టడమే కాకుండా గోళ్లతో ఒంటిపై గాయాలు చేస్తుంటాయి. అయినా బొమర్ తెగవారిలో ప్రమాదకరమైన వ్యాధులేమీ సోకిన దాఖలాలు కనిపించక పోవడం గమనార్హం. మరి గబ్బిలాల నుంచి వచ్చే వైరస్ ముప్పును ఎదుర్కొనే ఇమ్యూన్ వ్యవస్థను బొమర్ తెగవారు ఎలా పొందగలుగుతున్నారో ఆలోచించవలసి ఉంది. డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డిఎఇ) ఆర్థిక సహాయంతో నడుస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ మానవ గబ్బిలాల సంబంధాలపై సీరోఎకలాజికల్ సర్వే నిర్వహిస్తోంది. గబ్బిలాల్లో సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని ఈ సర్వేద్వారా వెలుగు లోకి తెచ్చారు. గబ్బిలాల్లో వైరస్ కుటుంబాలను ప్రతిఘటించే యాంటీబాడీల ప్రతిస్పందనను కూడా తెలుసుకుంటున్నారు. ఈ వైవిధ్యం లోని ఏ భాగం సంభావ్య వ్యాధికారకమో అధ్యయనం చేస్తున్నారు. ఇంతవరకు జన్యువ్యాప్తి/అనేక బ్యాక్టీరియా, వైరల్ సమూహాలను గబ్బిలాల్లో 3 శాతం నుంచి 10 శాతం వరకు ఉండడాన్ని గమనించారు. గబ్బిలాలు, మనుషులు కొన్ని వైరల్ సమూహాల నియంత్రణలో యాంటీబాడీల స్పందనను పంచుకుంటున్నట్టు తెలుసుకున్నారు.

అది చంపివేయడానికి సంకేతంగా భావిస్తున్నారు. గబ్బిలాల మొత్తం వైరస్ జన్యుసరళిని విశ్లేషించే ప్రక్రియలో ఎన్‌సిబిఎస్ ఉంటోంది. భవిష్యత్తులో సంక్రమించే ఎలాంటి వైరస్‌లనైనా తట్టుకోడానికి సిద్ధం అయ్యేందుకు ప్రాథమిక ఆధారాలుగా వైరస్‌ల జన్యువుల బ్యాంకును ఏర్పాటు చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో గబ్బిలాల నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్ల ముప్పును కనీస స్థాయికి ఎలా తగ్గించుకోవచ్చునో అవగాహన చేసుకోడానికి స్థానిక విధానాలు, సంప్రదాయాలు గైడ్‌లా పనిచేస్తాయని భావిస్తున్నారు. దేశంలో విశేషమైన జీవవైవిధ్యం, సాంస్కృతిక వైవిధ్యం ఇలాంటి అధ్యయనాలకు అద్బుతంగా ఉపయోగపడతాయి.

కొన్ని జాగ్రత్తలు

గబ్బిలాలు అనేక వైరస్‌లను మోసుకొస్తుంటాయన్నది వాస్తవం. అయితే వాటితో కలసి మనం ఎలా జీవించగలం ? అందువల్ల కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గబ్బిలాలను వేటాడడం, వాటి మాంసాన్ని ఆరగించడం చేయకూడదు. గబ్బిలాలు ఎంగిలి చేసి పారేసిన పండ్లను కానీ విత్తనాలను కానీ మనం తీసుకోకూడదు. దేశంలో చాలామంది పర్యావరణంపై ఆధారపడి జీవిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, నేల ఇవన్నీ పర్యావరణ సమతుల్యతను కాపాడేవే. ఈ పర్యావరణ వ్యవస్థ ఏమాత్రం దెబ్బతిన్నా మనుషులే కాదు వన్యప్రాణులు కూడా తమ మనుగడను కోల్పోతుంటాయి. పంటలు చీడపీడలతో నాశనమౌతుంటాయి. మనచుట్టూ ఉండే గబ్బిలాలు మనకు తెలియకుండానే పర్యావరణ పరిరక్షణకు వీలుగా అవి ప్రవర్తిస్తుంటాయి. చీడపీడలను తొలగించడమే కాకుండా దోమలు, ఇతర వ్యాధికారిక సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గబ్బిలాల మనుగడ ఎంత అవసరమో అన్నది ఆలోచించవలసి ఉంది.