Home ఎడిటోరియల్ సొంత సామాజిక స్పృహలేని బిసి రచయిత్రులు

సొంత సామాజిక స్పృహలేని బిసి రచయిత్రులు

-జ్వలిత
9989198943

Poetsఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడమే కళ” అంటాడు టాల్‌స్టాయ్. కాని అసలు ఆనందమే తెలియని సమూహం బి.సిలు. కొన్ని శతాబ్దా లుగా భూస్వాముల, నవాబుల ఇనుప బూట్ల కింద నలిగిపోయిన సమూ హం. అత్యంత దీనస్థితిలో తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడు కుంటున్న సమూహం కూడా బిసిలే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఎటువంటి ఉన్నతిని పొందని వారు బిసిలే. దేశ జనాభాలో ఏబది శాతం ఉన్న బిసిల్లో మహిళల శాతం కూడా సింహ భాగమే. దాదాపు వంద కులాలుగా వస్తూవు త్పత్తులను, సేవలను వృత్తులుగా చేస్తూ ఎటువంటి గుర్తింపు లేని బిసి కులాల మహిళల పరిస్థితి మరీ దయనీయం. జనాభాలో నాలుగవ భాగంగా వున్న బిసి మహిళలకు విద్యావకాశాలు తక్కువే. అగ్రవర్ణ, ఆధిపత్యకుల, ధనిక వర్గ, పితృస్వామ్య, పురుషాధిక్య సమాజంలో విస్మరించబడిన సమూహం వెనుకబడిన తరగతుల మహిళలు. అటువంటి బిసి మహిళలకు సాహిత్య రంగ ప్రవేశం ఆలస్యంగానే దొరికింది. పక్క రాష్ట్రంలో సావిత్రిబాయి పూలే మొదలుపెట్టిన స్త్రీ విద్య రచనా వ్యాసంగం ప్రభావం, ఆంగ్లేయుల విద్యా విధానం మొత్తానికి బిసి మహిళలకు కొంత వెసలుబాటు కలిగించింది.
ఉద్యమించి పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడ బిసి రచయిత్రులకు గుర్తింపు, ప్రోత్సాహం మృగ్యమనే చెప్పాలి.తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన రచయిత్రి బొమ్మహేమాదేవి మొదటి బిసి రచయిత్రి అని చెప్పవచ్చు. రాజా నర్సాగౌడ్ పెద్ద మనుమరాలు ఈమె. 1931లలో జన్మించిన బొమ్మ హేమాదేవి “దేవి రమ” పేరుతో రచనలు చేశారు. 1973 లో “కుంకుమ పూలు కథ” అనే కథకు మొదటి బహుమతి లభించింది. దాదాపు వంద కథలు రాశారు. సుమారు ముప్పైకి పైగా నవలలు రాశారు. తెలుగులో తొలి బిసి స్త్రీ వాద రచయిత్రి. వీరు 1996లో మరణించారు.
అనిశెట్టి రజిత వరంగల్ నుండి రచనలు చేస్తున్న బిసి రచయిత్రి. 1997లో “నేనొక నల్లమబ్బునవుతా”, 1999లో “చెమట చెట్టు”, 2002లో ఉసురు, దస్తకత్, 2003లో గోరంత దీపాలు, 2004లో “అనగనగా కాలం”, 2005లో “ఓ లచ్చవ్వ”, కవితా సంపుటాలు తెచ్చారు. 2006లో “మట్టి బంధం”కథా సంపుటి వెలువరించారు. 2010లో “ మార్కెట్ స్మార్ట్ శ్రీమతి” దీర్ఘకవిత, 2016లో “నిర్భయాకాశం కింద” ప్రచురించారు. “ప్రజాస్వామ్య రచయితల సంఘం” పేరుతో ఆంధ్ర రచయిత్రులతో కలిసి పని చేస్తున్నారు. రుద్రమ ప్రచురణలు పేరుతో 2012 నుండి మరోయిద్దరు స్త్రీలతో కలిసి పని చేస్తున్నారు.
జ్వలిత ఖమ్మం నుండి 2000కు ముందు నుండి రచనలు చేసినా 2006 తరువాత వివిధ పత్రికల్లో వీరి రచనలు వచ్చాయి. 2007లో “పరివ్యాప్త” స్త్రీ వాద కవిత్వానికి సంపాదకత్వం వహించారు. 2007లో “కాలాన్ని జయిస్తూ నేను” కవిత్వం, 2008లో ‘మర్డర్ ప్రొలాంగేర్’ ఆంగ్లానువాదం, 2009లో “సుదీర్ఘ హత్య” కవిత్వం, 2010లో ‘గాయాలే గేయాలై’ తెలంగాణ కవయిత్రుల సంకలనానికి సహ సంపాదకత్వం, 2011లో ‘ఆత్మాన్వేషణ’ కథా సంపుటి, 2013లో ‘రుంజ’ విశ్వకర్మకవుల కవిత్వం, 2014లో ‘అగ్నిలిపి’ తెలంగాణ ఉద్యమ కవిత్వం వెలువరించారు. 2016లో ‘ఖమ్మం కథలు’ పేరుతో వంద సంవత్సరాల నూట నాలుగు కథల సంపుటిని ప్రచురించారు. విలక్షణ స్వరంతో ధిక్కారాన్ని తన రచనల ద్వారా వ్యక్త పరుస్తున్నది. ‘జ్వలితార్ణవాలు’ పేరుతో వివిధ పత్రికలలో వెలువడిన వ్యాసాల సంపుటిరాబోతున్నది.
నల్లగొండ జిల్లాకు చెందిన పద్మ ‘కరుణ’ అనే కలం పేరుతో కథలు రాస్తున్నారు. ‘తాయమ్మ మరికొన్ని కథలు’ 2009లో ప్రచురించారు. 1994 నుండి రాస్తున్నారు. వీరి రచనలు అరుణతార, మహిళా బంధం వంటి పత్రికల్లో వచ్చాయి. 1992 నుండి 2007 వరకు మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ప్రస్తుతం పత్రికా రంగంలో స్థిరపడ్డారు. దాదాపు ముప్పయి కథలు రాశారు. కవిత్వం తక్కువ రాశారు.
నల్లగొండ నుండి “మిడ్కో” పేరుతో జి.రేణుక అనే బిసి రచయిత్రి “మెట్ల మీద” కథా సంపుటి తెచ్చారు. దుర్గాభవాని అనే టీచర్ కూడా ఈ జిల్లా నుండి రచనలు చేస్తున్నారు.
దాసోజు లలిత నల్లగొండకు చెందిన రచయిత్రి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ మధ్య వ్యాసాలు, కవితలు రాస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఎన్.అరుణ 2004 నుండి ఎనిమిది కవితా సంపుటాలు వెలువరించారు. కథలు, వ్యాసాలు రాయలేదు. 2004లో “మౌనం మాట్లాడుతున్నది” 2005లో పాటల చెట్టు, 2006లో ‘గుప్పెడు గింజలు’ నానీలు, 2007లో ‘అమ్మ ఒక మనిషి’, “నిరీక్షణ ఒక గాయం”, 2015లో ‘కొన్ని తీగలు కొన్ని రాగాలు” వీరి కవిత్వ పుస్తకాలు. వీరి రచనల్లో స్త్రీ వాదం అంతర్లీనంగా ఉన్నా బిసి స్పృహ తక్కువ.
కరీంనగర్‌కు చెందిన (హుజూరాబాద్) తిరునగరి దేవకీ దేవి “తెలం గాణ విమోచన ఉద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం” అనే అంశంపై 2005లో పరిశోధన చేశారు. “బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు” అనే వ్యాస సంపుటి వెలువరించారు. రెండు కథలు, పది వ్యాసాలు, 25 కవితలు రాశారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయిన ఈమె తొలి తరం మలి తరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బిసి స్పృహతో రాసిన కథ “మోడల్ ఆంటీ.”
కరీంనగర్ చెందిన మరో రచయిత్రి డా॥ అడువాల సుజాత వీరు స్వయంకృషితో ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగారు. 2003లో “తెలంగాణ పోరాట నవలల్లో స్త్రీ” అనే అంశంపై ఎమ్.ఫిల్ చేశారు. 2007లో “యశోదా రెడ్డి కథలు”పై పి.హెచ్.డి. చేశారు. “మట్టి మల్లెలు, నానీలు 2008లో, “కాలమా కాస్త వినమ్మా” కవిత్వం 2013లో, “బతుకమ్మ పాటలు” 2014లో ప్రచురించారు. బిసి మహిళా సమస్యల గురించి “అమ్మ కష్టం” అనే కథ రాశారు. దాదాపు ఎనభై వరకు వ్యాసాలు పరిశోధనా వ్యాసాలు రాశారు.
ముడుపు రత్నాదేవి, పొద్దుటూరి మాధవీలత, సరోజ, చిందం సునీత, రామానుజ సుజాత, సరసిజ వీరంతా కరీంనగర్ నుండి రాస్తున్న బిసి రచయిత్రులు.
కరీంనగర్‌కు చెందిన మరోరచయిత్రి “నాంపల్లి సుజాత”, 2005లో “నెమలీకలు”, నానీలు, 2009 లో “మట్టి నా ఆలాపన” కవిత్వం, 2015లో మట్టి నానీలు వెలువరించారు. 2000 సం॥ నుండి రచనా వ్యాసంగం మొదలు పెట్టిన ఈమే కథలు ఈ మధ్య మొదలు పెట్టారు.
అన్నవరం రాజేశ్వరి అనే రచయిత్రి ఈ మధ్య నాలుగైదు కథలు కరీంనగర్ నుండి రాశారు. కొలిపాక శోభ అనే బిసి రచయిత్రి 2004లో “చలనం” అనే పుస్తకం వేశారు.
నిజామాబాద్ నుండి అనుమాండ్ల శారద “మనోదర్పణం” కవితా సంపుటిని, “పోతన విజయం” అనే రూపకాన్ని రచించారు. ఉద్యమ కాలంలో వీరి ‘ఎర్ర గాజులు’ రచన ఎక్కువ స్పందన కలిగించింది. “సాంస్కృతిక పునరుజ్జీవనం” అనే అంశంపై పరిశోధన చేస్తున్న వీరు వృత్తి పరంగా ఉపాధ్యాయిని.
వరంగల్ జిల్లా నుండి ‘అనామిక’ పేరుతో కృష్ణవేణి రచనలు చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో వీరి కవిత్వం ఎక్కువ కనబడుతుంది. వరంగల్ నుండి డా॥ కందాళ శోభ కూడా రాస్తున్నారు.
డా॥ త్రివేణి నిజామాబాద్ నుండి మూడు పుస్తకాలను అచ్చువేశారు. అంతర్జాతీయ సదస్సులో ముప్పయికి పైగా పత్రాలను సమర్పించారు.
వలభోజు జ్యోతి హైదరాబాద్ నుండి రచనలు ప్రచురణలు ఏకకాలంలో చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో పత్రికను నడుపుతున్నారు. తెలంగాణ వంటకాలపై పుస్తకాలు రాశారు. బ్లాగ్ నిర్వహణపై ఎక్కువగా రాశారు. స్త్రీ వాద స్పృహ కలిగిన బిసి రచయిత్రి ఈమె.
జి. విజయలక్ష్మి హైదరాబాద్‌లో స్థిరపడిన బిసి రచయిత్రి. కవిత్వం నటన రెండూ నిర్వహిస్తున్నారు.
హిమజ “ఆకాశంలో మల్లెలు” వీరి కవితా సంపుటి. సుశీల నారాయణరెడ్డి పురస్కారం పొందారు. మన భూమి పత్రికలో ‘హిమ శకలం’ శీర్షిక నిర్వహించారు.
ఖమ్మం జిల్లా నుండి పురిమళ్ళ సునంద ఒక కవితా సంపుటి వెలువరించారు. ఈ మధ్య కథలు కూడా రాస్తున్నారు.
ఖమ్మానికి చెందిన మరో రచయిత్రి యడవల్లి శైలజ కథ కవిత్వం రెండూ రాస్తున్న బిసి రచయిత్రి.
ఇల్లందు నుండి భైరి ఇందిర ‘తెలంగాణ గజల్ కావ్యం’ 2016లో, 2005లో ‘అలవోకలు’ నానీల సంపుటి వెలువరించారు. కథలు తక్కువ రాశారు.
ఇల్లందు నుండి ‘సస్య’ ఉద్యమ కవిత్వం పాటలు సిడి విడుదల చేసిన స్త్రీ వాద రచయిత్రి. ఇల్లందు పట్టణం నుండి సూర్యకుమారి పత్రిక రంగంలో పని చేస్తూ రచనలు చేస్తున్నారు. కొత్తగూడెం నుండి ‘రాగ’ పేరుతో రాజేశ్వరి కథలు, కవిత్వం రాస్తున్నారు.
సమ్మెట ఉమాదేవి ఖమ్మం జిల్లా ముత్యాలంపాడులో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ 1989 నుండి రాస్తున్నారు. ఎనభైకిపైగా కథలు రాశారు. ‘రేల పూలు’ కొత్తగా వచ్చిన సంపుటి. అంతకు ముందు “నాల్నాలుగు పదహారు” పేరుతో 2014లో కథా సంపుటి వెలువరించారు. కమ్లి, మనస్విని, నేను సైతం, అమ్మతల్లి, గిరికొనదీపం మొదలైన కథలకు బహుమతులు వచ్చాయి.
బిసి మైనార్టీలు ‘షాజహానా’ బాగా రాస్తున్నారు. షహనాజ్, ఫాతిమా మొదలయిన వాళ్ళు కూడా బాగా రాస్తున్నారు.
తెలంగాణలో కవయిత్రులు, రచయిత్రులు లేరన్న ఆంధ్రుల వ్యాఖ్యానం తెచ్చిన పౌరుషంతో వెలువడిన ‘గాయాలే గేయాలై’ కవితా సంపుటి ‘వెతలే కతలై’ కథా సంపుటితో పాటు తెలంగాణ ఉద్యమం అనేక రచయిత్రులను వెలికి తెచ్చింది. అందులో బిసి రచయిత్రుల రచనలు వెలుగు చూశాయి. భూమిక, అరుణతార వంటి పత్రికలు అందరికీ అవకాశమివ్వడంతో మరి కొందరి రచనలు ప్రచురణకు నోచుకున్నాయి.
ఈ రచయిత్రులంతా బిసి బిడ్డలే కానీ అందరి రచనల్లో బిసి స్పృహ వెతికితే అసంతృప్తే మిగులుతుంది. మహిళావాదం, తెలంగాణ వాదం మాత్రం పుష్కలంగా కనిపిస్తాయి.
ఇంటర్నెట్ కల్పించిన అవకాశం పత్రికలు ప్రచురించకపోయినా బాధ కలిగించడం లేదు. తెలంగాణ రాష్ట్రమేర్పడిన తరువాత కూడ బిసి రచయిత్రులకు రావలసినంత గుర్తింపు రావట్లేదు. మిగిలిన వారికి అందే ప్రోత్సాహం వీరికి అందక పోవడమే కారణం.
ఇప్పటికయినా బిసి రచయితలు తమ సమూహంలోని రచయిత్రులకు సహకరించి, ప్రోత్సహించాలి. రచయితల సంఘాలు ఏర్పడాలె. రచయిత్రులు కూడా నిరంతర అధ్యయనం సాగించాలె. మంచి రచనా వ్యాసాంగం కొనసాగించాలె. వేటగాడు రాసిన కథలను కాకుండా వేటాడబడిన వారి కథలు రాయాలి. వేటను, అణిచివేతను ఏ కోణం నుండైనా ఎదిరించాలి.బిసి రచయిత్రులు సంఘటితంగా ముందుకు నడవాలి. అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.