Home కలం తలలెత్తిన బిసి కులాల కలాలు

తలలెత్తిన బిసి కులాల కలాలు

BC-Writers

అస్తిత్వవాద సాహిత్యంలోని ఒక భాగంగా బి.సి.సాహిత్యం వెలువడుతోంది. జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో స్పృహ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో వెంటాడే కలాలు (వెనుకబడిన కులా లు) ఇరవై ముగ్గురు బిసి కవులతో 2001 సంవ త్సరంలో వెలువరించారు. బిసిల్లో ముఖ్యంగా వెనుకబడ్డ కులాలకు చెందిన కులవృత్తులవారు ఉన్నారు. ఆ కులాలకు చెందిన కొందరు, తమ గళాన్ని, తమ గోడును వెంటాడే కలాల్లో ఎలా వినిపించారో ఈ కింది కవిత్వాంశాల్లో చూద్దాం. గంగపుత్రుల గురించి అంబటి వెంకన్న ఏమంటారంటే – ‘మా పుట్టుకలు మేఘాలై, బతుకులు శోకసముద్రమౌతుంటే మా వెన్నుకట్టు మీద లారీలు పెట్టి, మాకు కడుపులే లేనట్టు, మా పొట్ట పేగుల్ని కూడా లేపుకుపోతున్నారు దొరలు, దళారులు’ ఎంత చిక్కని కవిత్వం! తాము కష్టపడి చేపలు పట్టుకొస్తే, దళారీలు, వర్తకులు కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇచ్చి, తమ రెక్కల కష్టాన్ని దోచుకునే వ్యవస్థను చక్కగా వివరించారు వెంకన్న. అధికారం చేపట్టి, తమ బతుకుల్ని తామే దిద్దుకోవడానికి ఉత్పత్తి కులాలు నినదించి విజయం సాధిస్తాయనే ఆశావహ దృక్పథంతో ఉన్నారు.
అనిశెట్టి రజిత ఏమంటారంటే – ‘వినండి, వినితీరాలిక, రాబోయే కాలంలో ఆ మూడతుకులచీరామె, ఈ దేశపు పరిపాలనాపగ్గాలు చేపట్టి, జనస్వామ్యాన్ని డప్పుకొట్టే బహుజని, భూమి బిడ్డల్ని కన్న ఉత్పత్తుల తల్లి ఏలి కగా మాతృరాజ పతాకాన్ని తన మొరటు చేతులతో ఎగిరేయబోయే భారత స్త్రీ’. ఇక ఎ. దుర్గాప్రసాద్ గళం వినండి- ‘మహా దేవుళ్లు, మహాశ్లోకాల, మహా మతాల మాయాజాలంలో బ్యాలెట్ల బందిపోటు పథకాల దాడిలో, ఎండ మావును మిగిల్చిన ఎదను మోస్తున్న వాణ్ణి. నేనీ మట్టికీ మేఘానికీ అంతరా త్మని’. ఈ కొన్ని పంక్తుల్లో బ్రాహ్మణులపై, రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు ఎంత బాగా సంధించా రో దుర్గాప్రసాద్! ఇక బాణాల శ్రీనివాసరావు గర్వం చూద్దాం- ‘కుంపటి మా ఇంటి తోటలో పూసే సూర్యపుష్పం. అందులో మేము మెరుపుల్ని చూస్తాం. మేఘాల్ని చూస్తాం. ఉరుముల్ని వింటాం. రకరకాల రంగుల్ని చూస్తాం. ఆఖరి పాలపుంతల్ని చూస్తాం. ఈ సమస్త విశ్వం తిరిగేది మా కంసాలోల్ల కుంపటి చుట్టే. అది నిరంతరం మండే అగ్నిగోళం’. తమ కంసాలి కులంపట్ల ఎంత గౌరవమో బాణాలకు! ఇక గొల్ల బతుకుల గురించి బెల్లి యాదయ్య ఈ విధంగా స్పందిస్తారు. ‘మంద నా గురుకులం. తాత, తండ్రులు నా ఉపాధ్యాయులు. కొండ కోన నా ‘తరగతి’ గది. తడి దుక్కి నా ముద్దు పలక. దుడ్డుకొన నా సుద్దముక్క. అనుదినం ఒక అధ్యాయం. బోడు, బీడు నా ఆట స్థలం’. ఇదే గొల్లవారి గురించి శ్రీ బి.ఎస్. రాములు తన బతుకు నేర్పిన పాఠం కథలో చాలా బాగా వివరించారు. దొరలు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కై బీద గొల్లలను దోపిడీ చేయడం కళ్లకు కట్టినట్టు చిత్రించారు. మంగళి వారి పాట్లు జి. విజయలక్ష్మిఈ కింది పంక్తుల్లో చాలా బాగా రాశారు. ‘మంగలోన్ని చూసి దున్నపోతుకుంటుద్ది. నన్నుజూత్తే దొరగాడి కన్ను కుట్టుద్ది. గొరుక్కునే నీకు గొడ్డు తోలుతాడు. లోకువ తలమాసిన కుక్కల కొడుకులందరు కులం తక్కువని ఎద్దేవా చేసెటోల్లే. ఆల్ల తలలను నునుపుగా గొరుగకుంటే రొచ్చుగుంతల్లో సందుల్లో ఈదులాడుతరు. ఆల్ల పరువుత్తికన్న మన వృత్తి చెడ్డది కాదు’. విశ్వబ్రాహ్మణుల వెతలు జుగాష్ విలి ఈ విధంగా వర్ణిస్తారు. ‘ప్రొద్దున్నే కుంపటిని ఊరతో నింపి పట్టెడదుంగమీద పచ్చరాయివేసి, సుత్తుల్నినూరి, ప్రక్కనే నీటి తొట్టినీ, పింగాణీ గిన్నెలో సల్ఫర్‌ని మా నాన్న దుకాణంలోకి వచ్చేటప్పటికి అన్నీ సిద్ధం చేసే మా అమ్మ, మూడు తరాల వైట్ కాలర్ నీ జన్మస్థలం. తరతరాల చేతివృత్తి మా పుట్టిల్లు’. కుల వృత్తుల అదృశ్యంపై మందరపు హైమవతి గారి ఆక్రోషం విందాం – ‘మార్కెట్లో ప్రవేశించిన కొత్త కొత్త యంత్రాలు పనివాళ్ల చేతివేళ్ల కత్తెరలు. కప్పను మింగే సర్పంలో కాలం పరిణమించగా, ప్రపంచీ కరణ నేపథ్యంలో కులవృత్తుల కోటగోడలు కుప్పకూలుతున్న విషాద దృశ్యం’. యాచకుల కుటుంబంలో పుట్టి, గౌరవప్రద ఉద్యోగందాకా సాగిన తన ప్రయాణాన్ని ఇలా వివరిస్తున్నారు
డా. నాళేశ్వరం శంకరం. ‘చీకిపోయి పురి సడిలిన తాడును పెనవేసుకొని బతుకుబావిలోకి ఏ బొక్కెననైనా అడుగు. దాని కంటిలోంచి తెచ్చిన చెంచెడు నీళ్లు నీకు అందించి నిత్యగాయాల నులక మంచంమీద నిన్ను కూచోబెట్టుకుని నా గానుగెద్దు బతుకును నీకు భగవద్గీతగా బోధించగలదు’. మంగళి కులంలో (దేవకి) పుట్టి , చాకలి (యశోద) రాజవ్వ ద్వారా పెంచబడిన డా.ననుమాస స్వామి కథనం చూద్దాం.- ‘మురికి బట్టల్ని, ముట్టు బట్టల్ని బండకేసి బాదుతూ, బాదుతూ వేసే ఈల, నా పాటకు దరువయ్యేది. సౌడాలో ఉడికించి ఉతికిన బట్టలు ఆరేస్తున్నప్పుడా పరిసరాలన్నీ పరిమళభరితమయ్యేవి’. ప్రతి గడపకాడ ‘చాకలోన్నయ్యా’ అంటూ పల్లవి అందుకుంటుంటే ‘మురిసి మెరిసిన రాజవ్వ కళ్లు ఇప్పటికీ నా మది, స్విచ్ ఒత్తగానే తళుక్కున మెరుస్తై’.
నేతవృత్తి గోడు వినిపిస్తున్నారు డా. పులిపాటి గురుస్వామి- ‘బతుకంతా పట్టు చీరల మధ్య గడుస్తున్నా, కట్టింది లేదు, పెట్టింది లేదు. ఉద్దెరకు కాటన్ చీర, మళ్లీ దసరకు మంచిగుంటే కడితిమి, లేకుంటే పాతచీరలమీద పండుగ పోతనే ఉంది’. భోగం వాడ వాస్తవ్యుల గురించ్ ప్రసేన్ ఏమంటారంటే.. ‘ఐ లవ్ మై కాస్ట్. అందుకే నాకు భోగం వేషాలంటే ఇష్టం. చాలా ఇష్టం. మానసిక వ్యభిచారాల ఊరికి, దూరమైన దేవాలయం. నా వాడలో గజ్జె కట్టిన దేవతలందరూ నా తల్లులే. నేనొక కర్ణుడిని’. తెలుగు విశ్వవిద్యాలయ ప్రస్తుత వి.సి. డా. ఎస్‌వి సత్యనారాయణ కటిక బతుకు గురించి ఇలా వివరిస్తున్నారు – ‘నా ఎదకింద నా జాతి మొద్దుపై కత్తితో, కులం నామాలతో నడపబడుతుంటే ఆగని కన్నీటి ధారల గోళాలు మనిషి ముద్రకోసం తపిస్తున్న నాకు, మనువు ఆనవాలులేని ఊళ్లు కావాలి. మనిషి ఆనవాళ్లున్న సముద్రాలు కావాలి. కులాన్ని కాలికింద నలిపేసే పదాలు కావాలి’. డా. చింతం ప్రవీణ్ కుమార్ సారథ్యంలో 38 మంది యువ కవులతో ‘సమూహం’ పేరుతో బీసీ అస్తిత్వవాద యువకవిత్వం డిసెంబర్ 2016లో వెలువడింది. ఆ సమూహం కవితా సంకలనం నుండి కొన్ని కలాలు తమ మారని బతుకుల గురించి సోనాయిల క్రిష్ణవేణి ఇలా వాపోతున్నారు. ‘పాత కాలపు కత్తులు, గోర్ గాల్ మరి, బ్లేడ్లు, ట్రిమ్మర్లు అచ్చినంక కొత్త కొత్త క్రీములు, లోషన్లు అచ్చినయ్. అన్ని మారినైగని మా బతుకులే మారలేదు. ఎప్పటి శిప్ప ఎనుగల్నే అన్నట్టున్నై. సూస్కుంటుంటే మారై. మార్చే ప్రయత్నం చేయమని నా కొడుక్కన్నా చెప్పాలె’.
బెస్తవారి జీవితాల్లో వెలుగులకై తమ బతుకులపై తామే ఆధిపత్యం చలాయించాలంటారు కొలిపాక శ్రీనివాస్ – ‘చేప, చేప నువ్వెందుకు దూపకేడ్చినవంటే సముద్రం తలాపుకుంటే సరిపోదు. సముద్రం మనదవ్వాలి బోట్లూ పడవలు కాదని అరుస్తున్నది మన చేప’. మడత భాస్కర్ గీత కార్మికుల గురించి ఇలా అంటున్నారు – ‘కల్లును అమృతంలా ఆదరించిన రోజులుబోయి, ఇప్పుడెందుకు మా బతుకులు, చీపు లిక్కరుకన్నా చీపై పొయినై?’ గీత కార్మికుల వృత్తిపై నిషేధం విధించిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు భాస్కర్ . స్వర్ణకారుల వృత్తిని మింగిన రెడీమేడ్ జువెలరీ షాపులపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు.
కటుకోజ్వల రమేశ్ – ‘ఇప్పుడు అంగట్లో ఆత్మీయతల్లేవు. మమకారం పెనవేసుకున్న ఆభరణాలు లేవు. అన్నీ రెడీమేడులై షోకేసుల్లో వేళ్లాడడం చూస్తుంటే, సువాసనల్లేని కాగిదప్పూలు గుర్తొస్తాయి’. డా.కందాల శోభా రాణి, అన్ని కులవృత్తులవారి పట్ల తన సానుభూతిని ప్రకటిస్తున్నారు. ‘కుమ్మరి వాములు, గానుగ మరలు, మేదరి బుట్టలు, శాలల మగ్గాలు, కర్రున నాగలి చేసిన కమ్మరి, బండి చక్రం తిప్పిన వడ్రంగి, చిర్రచిప్పనుండి గాబులను చేసి, తట్టబుట్టలల్లి, తడకలల్లి, ఆవాసాలకు సొగసులద్దిన మేదరి, మానవ నాగరికత వికాసానికి చేవనిచ్చిన చేతివృత్తులన్నీ మంటకలిసి, కులాలు ఒంటరయ్యాయి’. బండి శ్రీనివాస్ యాదవ్ తన కులం పట్ల గర్వం చెందుతూ ఇలా అంటారు. – ‘మమ్మల్ని ‘వెనుకబడ్డోల్లు’ అని మీరంటారు కానీ ‘మీ వెనుక నిలబడ్డోల్లం అని మేమంటాం. బిసి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిసి అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తుంచుకోండి. భగవద్గీతను చెప్పిందే మన గొల్లోడయ్యా’ అనంతపురంకు చెందిన డా. రాధేయ, మగ్గం బతుకు అనే దీర్ఘ కార్యంలో చేనేత కార్మికుల బతుకులను గురించి కూలంకషంగా విశ్లేషించారు. అందులో ఆయనంటారు – ‘ఆరుగజాల నేతచీరను అగ్గిపెట్టెలో అందంగా మడతపెట్టి అంతర్జాతీయ కీర్తిని తలదాల్చిన ఈ కళాకారుడు నేడు జానెడు పొట్టను, పిడికెడు మెతుకులతో నింపుకోలేని దౌర్భాగ్యుడైనాడు. ప్యాకేజీ స్కీములతో పవర్లూమ్స్ లాభపడితే టెక్స్ టైల్ పార్కులతో బహుళజాతి కంపెనీలు బలపడతాయి. మా శ్రమజీవన సౌందర్యం, షోరూముల్లోనూ ఆర్ట్ గ్యాలెరీల్లోనూ మీ కనులకు విందు చేస్తుంది’. మేడిమర్తి ఓబులేసు, వెల్దండి శ్రీధర్, డా. సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో 58 రచయితల చేనేత కథలు పడుగు పేకలు సంకలనం నవంబర్ 2016లో వెలువడింది. ఈ సంకలనంలో కేవలం, చేనేత కుటుంబాలకు చెందిన రచయితలే కాకుండా, బిసిలు, బిసియేతరులు కూడా నేతన్నల జీవితాలపై మంచి మంచి కథలు రాశారు. ఇక సాధారణంగా, బిసి కులాల కథల విషయాలకు వస్తే, ఎందరో రచయితలు బిసిలకు సంబంధించిన కొన్ని వందల కథలు రాశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత బిసి కమిషన్ చెయిర్మన్ బి.ఎస్. రాములు బిసిల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి కొన్ని వందల వ్యాసాలు, కథలు రాశారు. అంతే కాదు, జీవితంలో ఎదగడానికి ఏ యే మెట్లు అధిరోహించాలో సోదాహరణంగా సూచించారు. వీరి సాహిత్యంపై ఎన్నో యం.ఫిల్, పిహెచ్‌డిలు అయ్యాయి. ఇంకా ఔతూనే ఉన్నాయి. బిసి సామాజిక వర్గాలకు చెందిన పెద్దింటి అశోక్‌కుమార్, డా, కాలువ మల్లయ్య, రామా చంద్రమౌళి, పి. చంద్ యాదగిరి, ఆడెపు లక్ష్మీపతి, సి,హెచ్.మధు, డా. బి.వి.ఎన్. స్వామి, అంబల్ల జనార్దన్, మొదలగువారు తమ సాహిత్యంలో బిసిల జీవితాలను ఎన్నో కోణాల నుండి చిత్రించారు. అలాగే బిసియేతర రచయితలైన సతీశ్ చందర్, మునిపల్లె రాజు, డా. కేతు విశ్వనాథ రెడ్డి మొదలగువారు, వెనుకబడిన కులాలకు చెందిన వారి జీవిత చిత్రణ, హృదయాలకు హత్తుకునేలా చేశారు.
తెలంగాణ సాహిత్యంలో ఉద్యమాలకు చెందిన అంశాలు చాలా చోటుచేసుకున్నాయి. ఎందుకంటే ఇది పోరుగడ్డ. మొఘల్ రాజులతో, తెల్ల దొరలతో, నిజాంతో, ఆ తర్వాత భూస్వాములతో, అటు పిమ్మట వలస పాలకులతో, ఇక్కడి ప్రజలు, ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. వీటన్నింటికంటే పెద్ద ఉద్యమం తెలంగాణ రాష్ట్రసాధన పోరాటం. తెలంగాణ తొలి దశ పోరాటం కంటే, మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనకై జనపదం, కవిత్వం, గేయాలు, పాటలు, ధూంధాంలు, కథలు, నవలలు, చాలా పెద్ద పాత్ర పోషించాయి. ఇప్పుడు, సొంత రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితులు తలెత్తుతున్నాయ్. ఉద్యోగ కల్పన గాని, ప్రాజెక్టులకై భూసేరణ గాని ఇప్పుడు ఉద్యమ అంశాలయ్యాయి. అవి సాహిత్యంలో చోటు చేసుకుంటున్నాయి.
బిసి సాహిత్యంలో ఏ మార్పు రావాలి?
ఇప్పటిదాకా వచ్చిన బిసి సాహిత్యంలో సింహభాగం, వారి వారి కుల వృత్తుల్లోని సమస్యలను ఏకరువు పెట్టడమే ధ్యేయంగా సాగింది. తమ వృత్తులు కనుమరుగవడమో, తమ వృత్తి జీవితాల్లోని సంక్షోభమో, బిసి సాహిత్యంలో చిత్రించబడింది. తమ కులస్తులపై ప్రభావం చూపి, చైతన్యం తీసుకువచ్చే కవులు, రచయితలు, నిర్మాణాత్మక రచనలు చేసే అవసరం ఉంది. వారు, తమ సాహిత్యాన్ని పరిష్కార మార్గాలు సూచించే వైపు మళ్లించాలి.
ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో మారిపోయిన, మారుతున్న పరిస్థితులను విశ్లేషించి, వాటిని ఎదుర్కొనే ధైర్యం, స్థైర్యం ప్రజల్లో కలుగజేయాలి. కులవృత్తికి సాటి రాదు గువ్వల చెన్నా అనే నానుడుడికి అతీతంగా, ఇప్పుడు ప్రజల్ని తమ రచనలతో చైతన్య పరిచి, వారిని స్వయం ఉపాధివైపు మరలేలా స్పూర్తి నింపాలి. ఉత్పదకత, ఉత్పన్నం పెంచుకోవ డానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించాలి. అన్నింటికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా, స్వశక్తితో ఎదగడంపై దృష్టి సారించాలని కవులు, రచయితలు తమ రచనల ద్వారా ఉద్బోధ చేయాలి.