Home తాజా వార్తలు కొత్త ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలి: మమత

కొత్త ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలి: మమత

 

భారత క్రికెట్ నియంత్రణ సంఘం(బిసిసిఐ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న టీమిండియా మాజీ సారథి సౌరబ్ గంగూలీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలియజేశారు. ‘బిసిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న సౌరబ్ గంగూలీకి హృదయపూర్వక అభినందనలు. మీ టీమ్‌కు శుభాకాంక్షలు. మీరు భారత్‌ను, బెంగాల్‌ను గర్వించేలా చేశారు. బెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) అధ్యక్షుడిగా మీరు అందించిన సేవలు గర్వకారణం. కొత్త ఇన్నింగ్స్‌లో మీరు దూసుకుపోవాలని ఆశిస్తున్నాం’ అని మమత ట్వీట్ చేశారు.

కాగా, బిసిసిఐ అధ్యక్ష పదవికి సౌరబ్ గంగూలీ సోమవారం నామినేషన్ వేశాడు. ముంబయిలోని బిసిసిఐ కార్యాలయానికి వచ్చిన గంగూలీ తన నామినేషన్ పత్రాలను సమర్పించాడు. గంగూలీతో పాటుగా బిసిసిఐ కార్యదర్శి పదవికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జైషా నామినేషన్ వేయగా.. కోశాధికారిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ నామినేషన్ వేశాడు. అయితే, బిసిసిఐ అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి రోజు సోమవారం కావడం… ఇప్పటివరకు అధ్యక్ష పదవికి గంగూలీ తప్ప మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. ఈ నెల 23న బిసిసిఐ ఎన్నికలు జరగనున్నాయి.

BCCI Elections: Mamata Banerjee Congratulates Ganguly