Wednesday, April 24, 2024

ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఫ్రాంచైజీలకు బిసిసిఐ మార్గదర్శకాలు

ముంబై: ఈ ఏడాది యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పకడ్బంధీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సిద్ధమవుతోంది. ఎలాంటి ఆటంకం లేకుండా టోర్నీ సాఫీగా సాగేలా అన్ని చర్యలు తీసుకొంటోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపిఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా కరోనా నేపథ్యంలో టోర్నీని బయో సెక్యూర్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఐపిఎల్‌కు ఆతిథ్యం ఇస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కూడా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు బిసిసిఐ, అంతర్జాతీయ క్రికెట్ మండలి రూపొందించిన నియమవాళి ప్రకారం టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా, సుదీర్ఘ కాలం సాగే ఐపిఎల్‌ను ఎలాంటి ఆటంకం నిర్వహించడం బిసిసిఐకి ఒక సవాలుగా తయారైంది. టోర్నీ కోసం రూపొందించిన సమగ్ర విధివిధారాల (ఎస్‌ఓపి) డ్రాఫ్ట్‌ను ఆయా ఫ్రాంచైజీలకు అంద జేసింది. వీటిలో 16 పేజీల్లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ఆరోగ్య భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అందరూ ఈ రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరోవైపు స్టేడియం పరిసరాల్లో మూడు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా ఈ జాబితాలో ఉన్న అంశాలే ఖరారయ్యే అవకాశాలున్నా చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు.
బయో సెక్యూర్ పద్ధతిలో
మరోవైపు ఐపిఎల్‌ను బయో సెక్యూర్ బబుల్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 తర్వాత ఆయా ఫ్రాంచైజీలకు చెందిన క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో యుఎఇకి పయనం కావాల్సి ఉంది. అంతకు ఒక రోజు ముందే రెండు పిసిఆర్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాక కూడా కరోనా టెస్టులు తప్పని సరిగా చేయించుకోక తప్పదు. మరోవైపు టోర్నీలో పాల్గొటున్న 8 ఫ్రాంచైజీలు వేర్వేరు హోటళ్లలో బస చేయాల్సి ఉంటుంది. వీలైతే ఫ్లోర్ మొత్తాన్ని బుక్ చేసే వీలుంది. వసతి, శిక్షణ, మ్యాచ్‌లు, రవాణాకు సంబంధించి ఎలా నడుచు కోవాలో కూడా బిసిసి సమగ్ర నివేదికలో మార్గదర్శకాలను కూడా ప్రకటించింది.
ప్రత్యేక జోన్ల ఏర్పాటు
ఇక స్టేడియం పరిసరాల్లో బయో సెక్యూర్ వాతావరణాన్ని 3 జోన్లుగా విభజించింది. జోన్1లో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారిక ప్రాంతంతో పాటు ఆట జరిగే స్థలం ఉంటుంది. జోన్2లో ఇన్నర్ జోన్, స్టేడియం కాంప్లెక్స్ లోపల జరిగే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. జోన్3లో ఔటర్ జోన్ ఉంటుంది. అంతేగాక స్టేడియం కాంప్లెక్స్ బయట జరిగే కార్యక్రమాలు, సభ్యుల ఇతరత్రా రోజువారి కార్యక్రమాలు కూడా ఈ జోన్‌లో ఉంటాయి.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే
మరోవైపు జట్ల మీటింగ్‌లను ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాల్ లేదా కాన్ఫరెన్స్‌ల ద్వారా జరపాలని నిర్ణయించారు. ఒకవేళ కచ్చితంగా అలాగే జరపాల్సిన పరిస్థితి ఏర్పడితే గదుల్లో కాకుండా భౌతిక దూరం పాటిస్తూ ఔట్ డోర్‌లలో మీటింగ్‌లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక, ఇండోర్ గదులు చాలా పెద్దగా ఉంటూ నిబంధనలు పాటిస్తేనే వీటికి అనుమతి ఉంటుంది. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లకు సంబంధించి కూడా పలు నిబంధనలను రూపొందించారు. క్రికెటర్లతో పాటు అవసరమైన సిబ్బందికి మాత్రమే ఇందులో ఉండేందుకు అవకాశం కల్పిస్తారు.
రెండు సార్లు శానిటైజ్
కాగా, ఎస్‌ఓపి నిబంధనల ప్రకారం జిమ్‌ను ఉపయోగించేందుకు నిర్ణీత సంఖ్యలోనే ఆటగాళ్లకు అనుమతి ఇస్తారు. ఎవరి వస్తువులు వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ల సందర్భంగా గ్రౌండ్‌లోకి ఒకే గేట్ ద్వారా ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు బస్సుల్లో కిటికి పక్కన మాత్రమే ఒకరు కూర్చోవాల్సి ఉంటుంది. డ్రైవర్‌తో సంబంధం లేకుండా ఓ ప్లాస్టిక్ షీట్‌ను ఏర్పాటు చేస్తారు. టాస్ వేశాక ఆటగాళ్ల జాబితాలో ఉన్న పేపర్‌ను ఇరు జట్ల కెప్టెన్లు మార్చుకోవడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా ఎలక్ట్రానిక్ టీమ్ షీట్‌ను ఉపయోగిస్తారు. దీంతోపాటు డ్రింక్స్ విరామానికి ముందు, ఆ తర్వాత కూడా ఆటగాళ్లు తమ చేతులను శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్వారంటైన్ తప్పదు
ఇక లీగ్ సందర్భంగా ఎవరికైన కరోనా వచ్చినా, అనుమానిత లక్షణాలున్నా వారు రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉండాల్సిందే. టీమ్ డాక్టర్ ఈ విషయాన్ని ఐపిఎల్ మెడికల్ మేనేజర్ చేరవేస్తాడు. బాధిత ఆటగాడిని వెంటనే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. రెండు వారాల ఐసోలేషన్ తర్వాత 24 గంటల వ్యవధిలో పిసిఆర్ టెస్టుల్లో నెగెటివ్ రావాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఆటగాడు కానీ, అధికారి కానీ బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది.

BCCI to hold IPL 2020 in Biosecurity policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News