Home జిల్లాలు సాగరం… బహు సుందరం

సాగరం… బహు సుందరం

 అలరారే ప్రకృతి సౌందర్యం

 పర్యాటకులను మైమరిపించే దృశ్యమాలిక
 453 ఏళ్ళ వారసత్వ సంపద
 తూర్పున ట్యాంక్‌బండ్… పడమట నెక్లెస్‌రోడ్
 ఉత్తరాన సంజీవయ్య పార్కు…. దక్షిణాన లుంబినీ పార్కు
 నీటి మధ్యలో బుద్ధ విగ్రహం
 అలలపై విహరించేందుకు రకరకాల బోట్లు
 పరిసరాల్లో లేపాక్షి భవనం, జలవిహార్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ గార్డెన్‌లు
 రానున్న పక్షుల దీవులు, ఆధునిక లేజర్ షోలు, చేపల కొలను…

tankbundసిటీబ్యూరో: 453 ఏళ్ళ వారసత్వ సంపద… నాడు తాగునీటి వనరు… నేడు పర్యాటక కేంద్రం… మునుముందు అలరారే ప్రకృతి సౌందర్యం… ఇదీ మన హుస్సేన్‌సాగర్ గొప్ప తనం. హైదరాబాద్ మహానగరానికి వన్నెతెచ్చే అందమైన దృశ్య కావ్యం. తూర్పున మహానుభావుల విగ్రహాలతో స్వాగతం పలికే ట్యాంక్‌బండ్… ఉత్తరాన పచ్చని ఉద్యానవనం ఒడిలో ఒదిగిపొమ్మని పిలిచే సంజీవయ్య పార్కు… పడమర సాయం సంధ్యవేళ పిల్లగాలులు పలకరిస్తూ పోయే నెక్లెస్ రోడ్… దక్షిణాన సాగర అలలపై తేలియాడుతూ విహరించడానికి అనుమతినిచ్చే లుంబినీపార్కు… ..నట్టనడుమన మానవాళికి బోధనలు చేసిన బుద్దుడు. ఇంకా లేపాక్షి కాంప్లెక్స్, పివీఘాట్, జలవిహార్, ఎన్‌టీఆర్ గార్డెన్‌లు హుస్సేన్‌సాగర్ చుట్టూర పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్ర, నగర ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమవుతోంది ఈ చారిత్రాత్మక జలాశయం. చరిత్ర అందరికీ తెలిసినా మారుతోన్న పరిస్థితుల నేపథ్యంలో సాగర్‌లోని నీటిని పూర్తిగా తొలగించి స్వచ్చమైన నీటిని నింపే ప్రయత్నం, కూకట్‌పల్లి నాలా నీటిని మళ్ళింపు పథకం, తీరాన పక్షుల దీవులను ఏర్పాటు, చుట్టూర ఆకాశ హర్మాలను నిర్మించాలనే అభిప్రాయం… వంటి విషయాలతో మరోమారు హుస్సేన్‌సాగర్ చర్చల్లో తారాస్థాయికి చేరుకుంటోంది.
చరిత్ర…
హైదరాబాద్ దక్కన్‌ను పరిపాలిస్తోన్న ఇబ్రహీం కూలీకుతుబ్ షా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలి 1562 సంవత్సరంలో మూసీనది నీటి ఆధారితంగా ఈ జలాశయాన్ని నిర్మించారు. 5.7 కి.మీల ప్రాంతంగా నిర్ణయించి ఏర్పాటు చేశారు. హుస్సేన్ వలి నిర్మించినందున ఆయన పేరుతోనే హుస్సేన్‌సాగర్‌గా పిలువబడుతోంది. పొడవు 3.2 కి.మీ.లు, వెడల్పు 2.8 కి.మీ.లుగాను, నీటి నిలువ ప్రాంతం మొత్తం 4.4 చ.కి.మీ.లుగా విస్తరించిన ఈ జలాశయం 32 అడుగుల లోతుతో ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ జలాశయం పరివాహక ప్రాంతం సుమారు 240 కి.మీ.లుగా ఉంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నిర్మించకముందు అంటే దాదాపు 1884 నుండి 1920 సంవత్సరం వరకు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే వనరుగా ఉన్నదని చరిత్ర పేర్కొంటుంది. మూసీనది ఆధారితంగా నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల అనంతరం హుస్సేన్‌సాగర్ ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్థి చెందుతోంది. రంగదాముని, బల్కాపూర్, కూకట్‌పల్లి పికెట్ నాలాల ద్వారా నీరు ఈ జలాశయంలోకి చేరుతుంది.
కాలుష్యం కోరల్లో….
దశాబ్థాలుగా కలుషిత నీరు నాలాల ద్వారా చేరడంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకోరల్లో చిక్కుకుంది. నాలాల నుండి వచ్చే రసాయనాలు జలాలను విషతుల్యంగా మార్చుతున్నాయి. నీటి నుండి దుర్వాసనలు వెలువడటం, జలచరాలు పలుమార్లు మృత్యువాతపడిన సందర్భాలున్నాయి. ఇది గ్రహించిన అప్పటి ప్రభుత్వం 2006లో ఈ జలాశయాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించింది. జపాన్ దేశ (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ)ఆర్థిక సహాయం రూ. 310 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 60 కోట్లు మొత్తం రూ. 370 కోట్లు వ్యయంతో హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతం పురోగతిని సాధించేందుకు పథకాన్ని అమలు పరుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ చెరువు నీటి కాలుష్యం తగ్గుతోంది. ప్రధానంగా రసాయనాలను మోసుకొచ్చే కూకట్‌పల్లి నాలా నీటిని మళ్ళింపు చేస్తున్నారు. మిగతా రంగదాముని, బల్కాపూర్, పికెట్ నాలాల వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించడం జరిగింది. ఫలితంగా హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చే నీరు శుద్ధి చేసిందే అధికంగా చేరుతోంది. కలుషితాలు చాలా వరకు నివారించబడ్డాయి.
ప్రత్యేక ఆకర్షణలు…
హుస్సేన్‌సాగర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ట్యాంక్‌బండ్. పాకిస్తాన్ ఎం47 పాటన్ ట్యాంక్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 4-17, 1971లో జరిగిన ఇండో పాకిస్తానీ యుద్ధ్దం(బాటల్ ఆఫ్ బసంతార్)లో గెలిచిన సందర్భంగా ఈ ట్యాంక్‌పై విజయోత్సాహం చేసుకున్న 54 ఇన్‌ఫాంట్రి డివిజన్ ఇచ్చింది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది యుద్ధ్ద ట్యాంక్. ట్యాంక్‌బండ్ ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతుంది. సాగర్‌కు తూర్పున ఉన్న ఈ ట్యాంక్ బండ్ పొడువునా ప్రఖ్యాతిగాంచిన కవులు, రంగస్థల నటులు, పోరాట యోధులు, విప్లవకారులు, చరిత్రకారుల 33 విగ్రహాలు నెలకొన్నాయి. వీటికి తోడు ఫౌంటేయిన్‌లు, పచ్చిక మైదానం, లేపాక్షి విక్రయకేంద్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉత్తరాన సంజీవయ్య పార్కు 92 ఎకరాల్లో ఉంది. యాంత్రిక జీవనంలో ఉరుకులు పరుగులు తీసే నగరవాసులకు ఇది సేదతీరేందుకు అనువుగా తీర్చిదిద్దారు. ప్రక్కనే మాజీ ప్రధాని పివీ నర్సింహారావు జ్ఞానభూమి ఉంది. అనంతరం జలకాలాటలు చేసేందుకు జలవిహార్ విచ్చేసింది. ఇందులో చిన్నపెద్ద అనే తేడా లేకుండా నీటిలో ఆటలు ఆడే వసతులున్నాయి. ప్రదర్శనలు, సామాజిక, వ్యాపార, వినోద కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వీలుగా పీపుల్స్‌ప్లాజాతో ఉన్న నెక్లెస్ రోడ్‌ను అభివృద్ధి పరిచారు. ఇక్కడ నగరవాసులు కాలక్షేపం చేసేందుకు అధికంగా విచ్చేస్తున్నారు. 7.5 ఎకరాల్లో లుంబినీపార్కును తీర్చిదిద్దారు. ఇక్కడి నుండి సాగర్‌లో బోటింగ్ చేయడం, బుద్దున్ని చేరుకునేందుకు, అలలపై విహరించే సౌలభ్యముంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా ఏర్పాట్లున్నాయి. ఎదురుగానే ఎన్‌టీఆర్ మెమోరియల్ 1996లో, 55 ఎకరాల్లో విస్తరించిన ఎన్టీఆర్ గార్డెన్ 1999లో ఏర్పడ్డాయి. హుస్సేన్‌సాగర్ జలాశయం అభివృద్ధిలో భాగంగా 1985లో ఏర్పాటుచేసిన బుద్దపూర్ణిమ ప్రాజెక్ట్… సాగర్ నీళ్లలో కనిపించే జిబ్రాల్టర్ రాక్‌పై 18 మీ.ల ఎత్తుగా ఉండి 450 టన్నుల బరువున్న బుద్ద విగ్రహాన్ని 1992లో నిలిపారు. ప్రతి ఏటా జరిగే రేగెట్టా పోటీలు సాగర పర్యాటకులను అలరిస్తున్నాయి.
పర్యాటకులను మైమరిపించేవి….
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక రెండు థీంలతో లేజర్ షోను ఆధునీకరిస్తున్నారు. నగర చరిత్రతో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ షోలు ఉండనున్నాయి. సంజీవయ్య పార్కు, పీవీఘాట్, జలవిహార్ ప్రాంతాల్లో బర్డ్ ఐలాండ్స్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని హెచ్‌ఎండీఏ ప్రణాళికను సిద్దంచేసింది. అలాగే, లేక్‌వ్యూ కొలనులో చేపలను పెంచాలని నిర్ణయించింది. లుంబినీ పార్కులో బర్డ్ ఐలాండ్‌ల్లోని దృశ్యాలను లైవ్‌గా తిలకించేందుకు ప్రదర్శన తెరలను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది.