Home ఆదిలాబాద్ సుందర తెలంగాణ

సుందర తెలంగాణ

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ టూరిజం కొత్త సొబగులు సంతరించుకుని దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో అందరికీ తెలిసిన ప్రాంతాలు కొన్నయితే, తెలియనివి ఎన్నో. అవన్నీ కొత్తరూపం సంతరించుకుంటున్నాయి. సెరీన్ చెరువుల్లో స్పీడ్ బోటింగ్, కేస్కేడింగ్ వాటర్ ఫాల్స్, చారిత్రాత్మక రాతి టెర్రెయిన్లు, పురాతన రాక్ పెయింటింగ్స్, అద్భుత శిల్పకళా సంపద, విలువ కట్టలేని  ఫోర్ట్‌లు, అందమైన సూర్యాస్తమయాలు, ప్రత్యేక పండుగలు, గిరిజన కళా సంపద, కళాకారుల అద్భుత కళాఖండాలు, చేతిమగ్గాల చీరలు, ఇలా ప్రతి ప్రదేశానికి ఒక కథ ఉంది. అక్కడ గడిపే ప్రతి ఘడియకూ ఒక వినూత్న అనుభవం ఉంది. అడవులు, వాటి సహజత్వం, అందం కాపాడటానికి, క్రూరజంతువులు, వాటర్‌ఫాల్స్, గుహలు, నదులు, రిజర్వాయర్లు, పురాతన గుడులు వీటన్నిటినీ సందర్వకులకు నచ్చే విధంగా, మౌలిక సదుపాయాలను అభివఅద్ధి చేసి తెలంగాణను ప్రముఖ పర్యాటక కేంద్రంగా చేయబోతున్నారు.

Tourism3టూరిజంతో పాటు ఎండోమెంట్, పురావాస్తు శాఖలు కలిసి పనిచేస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని, కలెక్టర్ ద్వారా కొన్ని, ఇతర డిపార్ట్‌మెంట్‌ల నుంచి కొన్ని నిధులు వస్తాయి. మొత్తం టూరిజం మాత్రమే టేకప్ చేయదు. పర్యాటక ప్రదేశాలు ప్రజలకు తెలియాలంటే పబ్లిసిటీతో పాటు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ కూడా ఉంది.  టూరిస్టు స్పాట్‌కి దగ్గరగా ఉన్న గుళ్లను కూడా టూరిజం వారు ప్రమోట్ చేస్తారు. తెలంగాణ గ్రామా ల్లో కొన్ని పండగలు నిర్వహించి సంస్కృతిని కాపాడటం కూడా టూరిజం కిందకే వస్తుంది. తెలంగాణ టూరిజం గురించి అంతర్‌రాష్ట్రీయ ప్రచారాలు చేపడుతుంది. ముంబై, బెంగుళూరు, గోవా అన్ని ఎగ్జిబిషన్లలో  కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. లండన్, శ్రీలంక, అన్ని దేశాలలో తెంలంగాణ టూరిజమ్ గురించి అవగాహన కల్పించడం లక్షం.

తెలంగాణ చరిత్ర పరంగా బలమైన రాష్ట్రం. మనం ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. రాజులు, నవాబుల పాలన మిశ్రమ సంస్కృతి కవులు, సాహిత్యవేత్తలు తిరుగాడిన గొప్ప చరిత్ర తెలంగాణది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు నిర్లక్షం చేయబడిన తెలంగాణలో విహార, వినోద పర్యాటకుల కోసం ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయి. అందరికీ తెలిసినవి కొన్నైతే తెలియనివి ఎన్నో. వాటిని వెతికి పట్టుకుని పర్యాటకులకు అందించే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతోంది.
Tourism1తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత. ఒకదాన్ని మించిన ప్రదేశం ఇంకోటి. చార్మినార్, ఫలక్‌నుమాప్యాలస్,సాలార్‌జంగ్ మ్యూజియం, గోల్కొండ్ కోటతో మొదలుకుని హైదరాబాద్ గోల్ఫ్‌క్లబ్, రేస్ క్టబ్, ఇలా హైదరాబాద్‌లో చూడాల్సిన జాబితా అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో రామప్ప గుడి, లక్నవరం చెరువు, సస్పెన్షన్ బ్రిడ్జి, భద్రాచలం, కిన్నెరసాని లేక్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, బాసర, అశోక సాగర్, కుంతల జలపాతాలు, సోమశిల గుడి, సోమశిల బ్యాక్ వాటర్, శ్రీశైలం, మల్లెల తీర్థం, ఫరహాబాద్ రివ్యూ పాయింట్, ఉమామహేశ్వరం…ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతులేదు. వాటిలో కొన్ని…
water1ఆదిలాబాద్ కుంతల జలపాతాలు: నేరేడ్‌కొండ గ్రామం నుంచి 25 కిలో మీటర్ల దూరంలో కుంతల జలపాతాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి దాదాపు 22 కిలో మీటర్ల దూరం ఉంటుంది. 45 కిలోమీటర్ల అడుగుల కిందకి అడవుల్లోకి దూకే జలపాతం ఇది. నది పరవళ్లు తొక్కుతున్నప్పుడు చూసి తీరవలసిన అందం అది. పక్కనే సోమేశ్వర స్వామి గుడికి మహాశివరాత్రికి భక్తులు పోటెత్తుతారు.
పొచ్చెర జలపాతం: ఆదిలాబాద్ నుంచి 45 కిలో మీటరల్ల దూరంలో ఉంది పొచ్చెర. గోదావరి నీటి గలగలలు, చుట్టూతా ఆహ్లాద వాతావరణం ఒక్కసారి చూస్తే పొచ్చెరను మర్చిపోనివ్వవు. ఇక్కడ గోదావరి వేగంగా, వెడల్పుగా ప్రవహిస్తుంది.
కరీంనగర్: 300 ఏళ్ల కిందటి కొండగట్టు ఆంజనేయస్వామి గుడి కరీంనగర్‌కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ధూళికట్ట: కరీంనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ ప్రదేశం.
రామ్‌కల్: కరీంనగర్ నుంచి 65 కిలో మీటర్ల దూరంలో పురాతన కేశవనాథస్వామి గుడి, పంచముఖ లింగేశ్వర స్వామి గుడి ఉంది. 11 వ శతాబ్దంలో కాకతీయులు కట్టిన గుడి అది.
ఎల్గందల కోట: కరీంనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిగందలకు పెద్ద చరిత్ర ఉంది. మనెయిర్ నది ఒడ్డున ఎలిగందల ఫోర్ట్‌లో పురావస్తు సంపద చూడదగింది.
నల్గొండ: మిర్యాలగూడా నుంచి 64 కిలో మీటర్ల దూరంలో కృష్ణా ఒడ్డున ఉన్న చిన్న గ్రామం నందికొండ. తవ్వకాలలో బయట పడిన సన్యాసి మార్గాలు, స్థూపాలు, బౌద్ధుల కాలం నాటి కట్టడాలు చూడదగినవి.

టూరిజంకు ల్యాండ్ కష్టాలు

Tourismఆదిలాబాద్ అంతా ట్రైబల్ ఏరియానే. ఆదిలాబాద్‌లో జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. జలపాతాలకు సహజంగా ఎక్కడి నుంచో నీళ్లు వస్తాయి. దానికి సంబంధించిన ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ది. ఈ రెండు డిపార్ట్‌మెంట్‌లు వేరు. ముఖ్యంగా కుంతల వాటర్‌ఫాల్. మెయిన్ రోడ్ నుంచి పన్నెండు కిలోమీటర్లు డీవియేషన్ అవుతూ ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా మౌలిక సదుపాయాలు మెరుగు చేయాలి. దానితో సేఫ్టీ, సెక్యూరిటీ దెబ్బ తింటుంది. అక్కడ టెంపుల్స్ ఉన్నాయి. టూరిజంకు ఇచ్చే ల్యాండ్స్ అన్నీ ఎండోమెంట్ ఇవ్వడం లేక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇవ్వాలి. తెలంగాణ టూరిజం అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.

అక్కడి ప్రాంతాల వారికే ఉపాధి

nandikondaపురావస్తుశాఖ సెక్రటరీ, టూరిజం సెక్రటరీ ఇద్దరూ ఒకరే ఉంటారు. వాళ్లు ఆ ప్రదేశాలను సంరక్షిస్తారు. మేం అలా సంరక్షించిన ప్రదేశాలను చూపిస్తాం. కొంతమంది గైడ్‌లు పురావస్తు శాఖకు సంబంధించిన వారుంటారు. ఇంకొంతమంది గైడ్‌లు టూరిజం డిపార్ట్‌మెంట్ తరపు నుంచి ఉంటారు. టూరిజం కింద ఇంకా రెగ్యులర్ ఎంప్లాయిమెంట్ లేదు. స్థానిక నిరుద్యోగ యువతను ప్రోత్సహిస్తున్నారు.  జన్నారం రిసార్ట్‌ను తీసుకుంటే, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ట్రైబల్స్‌కి వంట చేయడం, హౌస్ కీపింగ్ ఇలా శిక్షణ ఇచ్చి అక్కడి వాళ్లనే పనిలో పెడ్తారు.

లండన్ మాదిరిగా ఒకే టికెట్

హైదరాబాద్ చూడటానికి టూరిజం బస్సులు ఉన్నాయి. లండన్‌లో లాగా ఒకటే టికెట్ తీసుకుని అన్ని ప్రవేశ ద్వారాలలో ప్రవేశం పొందచ్చు. దానికి వెయిటింగ్, ప్రత్యేక క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, పేర్వారం రాములు గారితో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వూ

తెలంగాణ టూరిజం గురించి చెప్తారా?
ఈ 2016,17 లో మేం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పని చేపట్టాం. రాష్ట్రం విడిపోకముందు ఏ సంవత్సరం కూడా సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో నూట ముప్ఫై కోట్లకు మించి ఎప్పుడూ ఖర్చు చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందల కోట్లు ఇస్తున్నారు. దాంట్లో వంద కోట్లు మహబూబ్ నగర్ జిల్లాలో ఎకో టూరిజమ్, ఇంకో వంద కోట్లు వరంగల్ జిలా ట్రైబల్ టూరిజమ్ కోసం ఖర్చు పెడుతున్నాం. పదహారు కోట్లు ఖమ్మం జిల్లా కిన్నెరసానిలో ముఖ్యమంత్రి గారు ఎకో టూరిజమ్ కింద కాటేజిలు, బోట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇది కాక మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో కొన్ని ఎక్కువమంది గ్రామాలవారు కులాల వారీగా కొన్ని జాతరలు, కొమరెల్లి, ఐనవోలు, కొరవి, బిజిగిరి షరీఫ్ ,ఇల్లెందుకుంట ఇటువంటి ఇరవై ప్రదేశాలలో మూడొందల కోట్లు పెట్టి హోటల్స్ కడుతున్నాం. ఆరు ఎయిర్ కండిషనర్ గదులు, నాలుగు నాన్ ఏసి రూమ్స్, హోటల్స్, వంటవాళ్లు. ఇప్పుడు కొరవి ఉందనుకోండి. అది అడవిలా ఉంటుంది. ఖమ్మం బార్డర్‌లో. అక్కడికి పోయినవాల్లు వెనక్కి రావాలి. వరంగల్ అన్నా పోవాలి, ఖమ్మం అన్నా పోవాలి. ఎందుకంటే మహబూబాబాద్‌లో ఏమీ లేదు. దూరంగా విసిరేసినట్టున్నయ్ కాని అవే గ్రామీణ ప్రాంతాల వారిని విశేషంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి.. ఇవి దేవాలయాలు, మసీదుల పట్ల మేం చేపట్టిన కార్యక్రమాలు.
గ్రామాల కోసం టూరిజం చేసే ప్రయత్నాలేంటి?
తెలంగాణ ప్రభుత్వం కె సి ఆర్ గారు పాత ముప్ఫై మూడు వేల చెరువులను పునరుద్ధరిస్తున్నారు. దీంట్లో ఒక వంద చెరువులను ఎంచుకుని చెరువు కట్ట మీద అక్కడ గెస్ట్‌హౌస్‌లు, బోట్లు, చిన్న గ్రంధాలయం అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దానితో ఊళ్లో ఉన్న గ్రామీణ యువతకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, యువతీయువకులకు బోటింగ్, వాటర్ స్పోర్ట్. దానితో మానసిక ఉల్లాసం. అక్కడి వాళ్లే కాదు, బయటివాళ్లు కూడా రావచ్చు. మావన్నీ ఆన్‌లైన్ బుకింగ్‌లు కంప్యూటర్‌లో. న్యూయార్క్‌లో ఉండి వికారాబాద్ హరిత హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. నేను వెళ్లినా కూడా లక్నవరంలో బయట మీటింగ్ పెట్టాను. ఆన్‌లైన్ బుకింగ్ వలన ఖాళీ లేదు. ఇంకో విశేషం ఏంటంటే, మా హరిత హోటల్స్‌లో భోజనం బావుంటుంది. స్టార్ హోటళ్ల వాళ్లు కూడా ఆహారాన్ని ఫ్రిజ్‌లలో దాచి పెడతారు. కాని మాది ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎప్పటికప్పుడు తాజా ఆహారం ఉంటుంది.
తెలంగాణ టూరిజం ప్రత్యేకం అయ్యాక టూరిస్టులు పెరిగారంటారా?
గత మూడు నెలల నుంచి మాకు టూరిస్టుల తాకిడి ఎక్కువైంది. వికారాబాద్, గోల్కొండ లైవ్ షో, లక్నవరం, రామప్ప. మూడింతలు పెరిగారు టూరిస్టులు. సౌకర్యాలతో పాటు అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఆంధ్రకు పోయి అమరావతి, వైజాగ్ బీచ్ అంటే చూసిందే కదా అనుకుంటున్నారు. ఏంటీ తెలంగాణ? కొత్తరాష్ట్రం అట, కొత్తగా ఉందట అని వస్తున్నారు.
కొత్తగా చేపట్టిన టూరిజం కార్యక్రమాలేంటి?
ఆంధ్రలో పాపి కొండలు 25 కిలో మీటర్ల పొడవే. ఇటు ఖమ్మం, అటు గోదావరి జిల్లా. ఇప్పుడు మేం కొత్తగా సోమశిలలో మొదలు పెట్టాం. మా దగ్గర శ్రీశైలం నుంచి జెట్‌ప్రోల్ వరకు, వయా సోమశిల 90 కిలోమీటర్లు పొడవుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ సరస్సుంది. ఒక్కోచోట ఆరు కిలోమీటర్ల వెడల్పుంది. బ్రహ్మాండమైన సరస్సు అది. ప్రపంచంలో అత్యద్భుత సరస్సుల్లో ఒకటి. అటు మహబూబ్ నగర్‌ఆత్మకూరు తాలూకా కొండలు, ఇటు నల్లమల్ల ఫారెస్ట్. ఆదివాసీలు. చాలా బావుంటుంది. మొన్న లాంచ్ చేశాము. ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది. బోటిక్కి హాయిగా విహార యాత్రలు చేసి వస్తున్నారు. ఇన్ని రోజులు పర్యాటకులకు తెలియదు. ఇప్పుడు తెలిసి వస్తున్నారు.
అన్నీ మళ్లీ కొత్తగా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం కష్టంగా ఉందంటారా?
కొత్తరాష్ట్రం కాబట్టి కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది మాకు.కొత్తగా సంసారం పెడితే ఇష్టంగానే ఉంటుంది కదా. అప్పట్లో సమిష్టి ఆంధ్రప్రదేశ్‌లో టూరిజమ్ కార్పొరేషన్ కొంతమంది ఆఫీసర్లు బంధుప్రీతితో అంతా కోస్టల్ ఆంధ్రవాళ్లని నియమించారు. అయితే మాకు ఆఫీసర్లు తక్కువయ్యారు సూపర్‌విజన్ చేసేవాళ్లు. కిందివాళ్లు ఎక్కువైపోయారు. సమతుల్యం దెబ్బతిన్నది ఎంప్లాయీస్ విషయంలో. దాన్ని భర్తీ చేయడానికి కొంతమంది ఇంజనీర్లను, ఆఫీసర్లను బయటనుంచి తీసుకుంటున్నాం.
తెలంగాణ టూరిజంతో యువతకు ఉపాధి అవకాశాలు ఎంతవరకు పెరిగాయి, ఇక ముందు పెరగచ్చు?
యునెస్కో స్టడీ ప్రకారం ఇండస్ట్రీ పెడితే ఒక కోటి రూపాయలకు ఆరు ఉద్యోగాలు ఇవ్వచ్చు. వ్యవసాయంలో ఒక కోటి ఖర్చు పెడితే మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అయితే టూరిజంలో పద్ధెనిమిది ఉద్యోగాలు వస్తాయి. మన దగ్గర అందరూ ఉంటారు. ఎలక్ట్రీషిన్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్, చాకలి, మంగలి, మాలిష్ చేసేటోళ్లు, పెయింటర్స్, బిల్డింగులు కట్టేవాళ్లు, బస్ డ్రైవర్లు, గైడ్లు, చరిత్రకారులు, చిత్రలేఖనం చేసేవాళ్లు, శిల్పులు, ఇలా సమగ్రాభివృద్ధి జరుగుతుంది. స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్,ఈజిప్టు ఇలాటి దేశాలకు దేశాలు, టూరిజం మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు గోవా, కేరళలో బాగా టూరిజం పుంజుకుంది. మధ్యప్రదేశ్ లాటి రాష్ట్రం టూరిజంకు చాలా ప్రాముఖ్యనిస్తోంది. వాళ్లతో పోలిస్తే తెలంగాణలో చాలా ప్రదేశాలున్నాయి.
తెలంగాణలో తెలియని ఎన్నో గొప్ప ప్రదేశాలు ఉండి ఉండవచ్చు. వాటిని ప్రజలు మీ దృష్టికి తెస్తుంటారా?
ప్రజలు విస్ఫోటనం లాగా వస్తున్నారు. రామగడ ఖిలా నుంచి పదిమంది వచ్చారు. ఇక్కడ ఘట్ కేసర్ దగ్గర రంగథాముని గుడి ఉందట. అక్కడొక చెరువుంది. అది కలుషితమైంది. అది చాలా పురాతనమైంది అని. ఇక, జనగాం దగ్గర జీడికల్లు వాళ్లు వచ్చి అరె! మీరు జీడికల్లు నిర్లక్షం చేస్తున్నారేంటండి? రాములవారు జింకను చంపింది ఇక్కడే. యాదగిరి గుట్టకు ఇంత ప్రాచుర్యం వచ్చింది కాని, వందేళ్ల కిందట యాదగిరి గుట్ట అర్చకుడికి జీడికల్లు నుంచి నుంచే నెలకింత డబ్బులు ఇచ్చేవాళ్లం. అటువంటిది దీన్ని వదిలేశారు. యాదగిరి గుట్ట పెరిగింది. ఇదేంటి అన్యాయం అంటారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు. ఎన్నని పెడతాం? క్రమేపి మనల్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ రావడం వల్లనే ఇది సాధ్యం అయింది.
టూరిజంను ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్తున్నారు?
ఈ గుళ్లతో ప్రజలను దగ్గరకు తీసుకెళుతున్నాం. నల్గొండ దగ్గర పానికల్లు శివాలయం గురించి ఎవరికీ తెలీదు. రుద్రమదేవి యుద్ధం చేసి మరణించిన ప్రదేశం అక్కడే ఉంది నల్గొండ చందుపట్లలో. శాసనం ఉన్నదక్కడ. మనం దాన్ని బయటకు తీయాలి కదా. అట్లాగే బమ్మెర పోతన భాగవతాన్ని చేసిన అనువాదం ఒరిజినల్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మందార మకరంద…సిరికిం జెప్పడు..ఇవన్నీ అందరి నోళ్లలో నానుతున్న పద్యాలు. ఒక్క తెలంగాణనే కాదు, తెలుగు మాట్లాడేవాల్లందరికీ. సుమతీ శతకం, వేమన శతకం తర్వాత పోతననే. అటువంటి పోతనామాత్యుడి సమాధి ఉన్నది బమ్మెర గ్రామంలో. అతను చేసిన వ్యవసాయం, శ్రీనాధుడు వచ్చి అంకితం చెయ్యమంటే ఓ సరస్వతీదేవి నిన్ను లాటి కీచకులకు అంకితం ఇస్తానని ఏడుస్తున్నావా ఏడవకమ్మా అని. అటువంటి పోతన దున్నిన పొలాలుఉన్నయ్. అవన్నీ పాపారావు గారనే రిటైర్డ్ ఐఎఎస్ . మన సిఎమ్ కు సలహాదారు. వారు, నేను, రామాచారి గారు కలిసి పోతన స్మారక మందిరం నిర్మించాం. భాగవతం విస్తృత ప్రచారంలోకి తీసుకువస్తున్నాం. నాగార్జున కొండలో పదహారు మహా బుద్ధ విహార అని చాలా పెద్ద ప్రాజెక్ట్. ధూళికట్ట, ఫణిగిరి, నేలకొండపల్లిని టూరిస్ట్ ప్లేస్‌గా చేయడానికి బడ్జెట్ సమస్య ఉంది. అందుకే వచ్చే ఏడాది చేస్తాం.
అంతర్జాతీయంగా ప్రమోషన్థీమ్ పార్క్ రాబోతోంది
వరంగల్ దగ్గర థీమ్ పార్క్ గుర్తించడం కోసం ఈమధ్యనే నల్గొండ జిల్లా రాచకొండ పర్యటించారు టూరిజం బృందం. ఇంకా ఎక్కడ అన్నది పూర్తిగా నిర్ణయం కాలేదు. థీమ్ పార్క్‌లో చాలా ఎంటర్‌టెయిన్‌మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరుల్లో లాగా కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేయచ్చు.