Home అర్బన్ మ్యూజింగ్స్ హృదయమొక రహస్య పాటల భోషాణం

హృదయమొక రహస్య పాటల భోషాణం

HARIVILLU-IMAGES

వొకే పాట యే జ్ఞాపకాలను చిలకరిస్తుందో, యే అనుభవాలను గుమ్మరిస్తుందో ఆ అనుభవాలు యెవరికి వారికే సొంతం. పాటలు మన లోపలి పొరల్లో మౌనవ్రతం చేస్తుంటాయి. సాయంకాలపు సంపెంగ పరిమళంలా సమయం వచ్చినప్పుడు చకచకా మేం వున్నామని వచ్చేస్తాయి. పాట యెవరినైనా యిట్టే లాక్కుంటుంది. పెద్దగా శ్రమ పడకుండా, హోం వర్క్ చెయ్యకుండా కేవలం వినగలిగే నర్వ్ కాస్త యెలర్ట్ గా వుంటే చాలు పాట యెవరిలోకైనా దూరిపోయి దాక్కోగలదు. భాష అర్థం కాక పోయినా, ఆ వాయిద్యాల పేర్లు తెలియక పోయినా, వీణ తీగకి వైయిలన్ తీగకి తేడా తెలియక పోయినా మోగే తంత్రులు నెమలీకల్లా మన మనసు తంత్రులని మీటుతునే వుంటాయి.

మా యింటి వెనుక వొక బంగ్లా వుంది. గుల్మొహర్, మామిడి, నేరేడు చెట్లు ప్రహారీ గోడ చుట్టూ యేపుగా పెరిగాయి. వసంతమంతా గుల్మొహర్‌ల యెర్రెర్రని సరస్సులో హృదయం మునకలేస్తుంటే కోయిల్లు వుదయమంతా వొకే శ్రుతిలో వొకే పాటని పాడుతుంటాయి. అప్పుడప్పుడు వాటిని అనుకరిస్తూ కూ కూ… అనగానే అవి పాడటం ఆపేస్తాయి. కన్ఫ్యూజ్ అవుతాయో లేక వాటి స్వరాలకి కాసింత దగ్గరగా వుండటంతో ప్రముఖులు తాము పాడిన పాటల్ని అచ్చు అలానే పాడాలనే ప్రయత్నించే యువస్వరాలని కుతూహలంతో వింటున్నట్టు వింటాయా… యేమో కానీ అవి నిశ్శబ్దమైపోతాయి.

ఆ బంగ్లా తోటలోని మామిడి చెట్ల నిండా రామ చిలుకలే. అవి ఆ మామిడి కాయల్ని చిక్ చిక్ మని వాటి ముక్కుతో పొడుస్తూ వొక్క సారిగా కిచకిచమంటూ వొక్కటి తుర్రుమనగానే ఆ చిలుక వెంటే మరొక చిలుక యెగిరేది. మొన్న వేసవిలో వచ్చిన వడగళ్ళ వానకి అవెంత తల్లడిల్లాయో ఆ రాత్రి. ఆ వుదయం పల్చని సూర్యరశ్మిలో తడిసిన రెక్కలని ఆరబెట్టుకొంటూ రాత్రి వాన గందరగోళాన్ని చెప్పుకొంటూనే క్షణాల్లో యీ రోజు సేకరించాల్సిన గింజల కోసం బయలుదేరాయి. పళ్ళ రుచిని పెంచాల్సిన బాధ్యత తమదేనన్నట్టు ఆ బంగ్లాలోని పళ్ళ వైపు యెగిరాయి. చిలక్కొట్టిన పళ్ళ రుచే రుచి కదా. కడియం తోటల్లో చిలక్కొట్టిన జామ, మామిడి పళ్ళకి పిల్లలు భలే పోటీపడేవారు. సాయంకాలపు తేనేపిట్టలు పాటలు మెల్లగా ఆవరించే నీరెండ నిశ్శబ్దంలో వెలుగునీడల సొగసుని రెట్టింపు చేస్తూ మనసంతా నెమ్మదించి వొక ధ్యానంలో నన్ను నేను ఆ రోజుకి వెతుక్కుంటుంటాను.ఆ బంగ్లాతోట మా యింట్లో యెక్కడ వున్నా కనిపిస్తుంది. ఆ తోట అందాన్ని యెంతగా వాళ్ళ కళ్ళల్లో నింపుకొంటున్నారో తెలీదు కానీ నేనైతే వీలైనంతగా ఆ తోటతోనే జీవాన్ని నింపుకొంటా.

ఆ పచ్చదనం వల్లే కాదు ఆ బంగ్లా మరొకందుకు నన్నాకర్షించింది. పోయినేడాది యివే రోజుల్లో వొక సాయంకాలం యేడవుతోంది కార్తీకపు లేత చల్లదనంతోపాటు వో పాట నన్ను చుట్టుకొంది. అలా పాట తరువాత మరొక పాట. పాటలతో మనం చాల మందితో కనెక్ట్ అవుతాం. మన లోపలి ప్రపంచాన్ని అప్పుడప్పుడూ మనం పాటల రూపంలో కొంత మందితో పంచుకుంటామనుకొంటా. చెప్పీచెప్పని స్నేహం పాటల వారధిగా నడుస్తుందనుకొంట. పర్ఫెక్ట్ సౌండ్ ట్రాక్ లో మన స్నేహాలు గళం విప్పుతాయనుకొంటా.

మనం విన్న పాట లింక్ ని fb లో షేర్ చేస్తాం. మన దగ్గర స్నేహితులకి లింక్ ని వాట్స్ అప్ లో పంపిస్తాం. అలా పాటలని మనకి నచ్చిన వారితోనో లేదా చాలా మందితోనో పంచుకోవాలనుకొంటాం. మనలోంచి వాళ్ళని తొంగి చూసుకొంటుంటాం. ఆ బంగ్లాలో నివాసముండేవారు ఆరు బయట అప్పుడప్పుడూ విందునిస్తారు. ఆ సాయంకాలం పాటలని కొద్ది వాల్యూంతో ప్లే చేస్తారు. యిప్పుడొస్తోన్న కొత్త పాటలేవి ఆ బంగ్లా నుంచి వినిపించవ్. యెప్పటెప్పటివో హిందీ పాటలు. గజల్స్ వినిపిస్తుంటాయి. ఆ అభిరుచి ఆ బంగ్లాలో యెవరిదో తెలీదు. తెలుసుకోవాలని అనిపించలేదు. నూర్ జహాన్, లత, గీతాదత్, ఆశా, ముకేష్, రఫీ, కిషోర్ కుమార్, హేమంత్ కుమార్, జగగ్జీత్ వొక్కరేమిటి యిలా యెందరో. యిలా అందరివి కూడా కలిపి ప్లే చెయ్యరు. వొక్క గాయకునివే వరుసుగా వేస్తారు. వారితో పాడే గాయనీమణులు మారుతుంటారు. ఆ యింట్లో ఆ విందు కోసం స్నేహితులు బంధువులు యెలా యెదురు చూస్తారో తెలీదు కానీ, ఆ తోటలోంచి చిన్ని దారిని దాటి బాల్కనీ యినుప జాలీ చిన్ని చిల్లుల్లోంచి వచ్చే ఆ

సాయంకాలపు పాటల కోసం నేను మాత్రం భలే కుతూహలంగా యెదురు చూస్తా. మనసులో యే మూలో నక్కిన చిన్నపసి చిలిపిదనపు సెలయేరేదో చిన్నగా అటూయిటూ పారుతోంది ఆ రోజు వాళ్ళు యే పాటలు ప్లే చేస్తారోనని నాతో నేనే పందెం వేసుకుంటా. పండిన మొగలి పూల పరిమళంలా పసందైన ఆనాటి గాయకుల గొంతుల్లో వంపులు తిరిగే భావోద్వేగాలకి ఆ సాయంకాలం మనసు నవయవ్వనపు చురుకుదనంతో గెంతులేస్తుంది. ఆహ్వానం లేకుండా యెదలో ప్రవాహంలా పాటలన్నీ పరిచేసే వారి విందు సాయంకాలాలకి నేనో రహస్యపు అతిథిని. యీ కార్తీకపు మధ్యాహానం ఆ తోటలోని పిట్టలు, చిలుకల కబుర్ల సవ్వడి వింటూ రాసుకొంటుంటే రాక్ స్టార్ లో పాట మగపిల్లల స్వరంలో వినిపిస్తోంది. తరువాత యాష్ కి 2… అలా ఆ చిన్నిసందులోంచి యిప్పటి చక్కని హిందీ పాటలు శ్రావ్యంగా ఆ చిన్ని జాలీ కన్నాల్లోంచి వచ్చేస్తోన్నాయి. యెవరు వాళ్ళు… రాయటం ఆపి అందమైన పలకరింపులాంటి ఆ దారి వైపు బాల్కనీ లోంచి తొంగి చూడకుండా వుండలేకపోయాను కాస్త మర్యాద నోరు నొక్కి. ఆ బంగ్లా ఆకుపచ్చని తోటకి చుట్టూ వున్న నాచు పట్టిన పాత గోడకి మధ్యన మూసివున్న తలుపు ముందున్న మెట్లుపై కూర్చుని కొందరూ, టూవీలర్స్ మీద కూర్చుని మరి కొందరూ గిటార్ ప్లే చేస్తు పాడుతున్నారు. ఖరీదైన గిటార్ కాదు. వాళ్ళు ట్రైన్‌డ్ ప్రొఫెషనల్స్ కారు.

కానీ చెవుల్లో చిన్నిఫోన్స్ పెట్టుకొని యెవరి పాటని వాళ్ళే వినటానికి అలవాటు పడిపోయిన నగరవాసికి ఆరుబయట కాస్త సూర్యరశ్మి, కాస్త వెన్నెల, కాస్త చీకటి, రవ్వంత గాలి, కాసింత పచ్చదనం అద్దుకొని వూపిరి పీల్చుకోనిస్తూ ఆ పిల్లలు పాటని లిబరేట్ చెయ్యటంతో ఆ పాట మరింత అందమైన పాటగా హృదయాలని మీటుతోంది అంతే. మౌనంగా లోలోపలే తిరిగే పాటకు రెక్కలొస్తే మనసొక్క పాట దగ్గరే ఆగదు కదా. పరుగులు తీసే కాలంలో గుండెలోకి యిలా పాటలు తిరిగొచ్చేస్తుంటే తరలి పోయాయి అనుకొన్న యెన్నెన్ని అమాయకపు మధ్యాహానాల పరవశపు రాగాలని జ్ఞాపకాల భోషాణపు పెట్టె నుంచి బయటికి తీసాయో… తిరిగి కాసేపు కలలు కన్నుల్లో నిలువెల్లా పూసేస్తుంటే ఆ నాటి స్నేహం వెతుక్కుంటూ పక్కకి వచ్చినట్టే వుండదా మరి… రామచిలుకలూ, తేనె పిట్టలు…

                                                                                                                                                                                           కుప్పిలి పద్మ