Home ఎడిటోరియల్ ముందే డిపాజిట్ల వెల్లువ?

ముందే డిపాజిట్ల వెల్లువ?

NOTES

నోట్ల రద్దు నిర్ణయం వెలువడడానికి సుమారు మూడు వారాల ముందే విడ్డూరంగా సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకులలో డిపాజిట్లు చోటు చేసుకోవడంపై ప్రభుత్వం వద్ద సరైన జవాబు లేదు. రద్దైన రూ500 నోట్లకూ, వాటిస్థానే కొత్తగా ఆర్‌బిఐ ముద్రించిన నోట్ల సంఖ్యకూ మధ్య పొంతన లేదు. మామూలు పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో ఆర్‌బిఐ చెప్పలేక పోతోంది. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కనిపించని, వినిపించని విషయాలెన్నో ఉన్నాయని తోస్తోంది. ఆర్‌బిఐ తన పాత్ర సరిగా పోషించలేదన్న అభిప్రాయం బలపడుతోంది.
సెప్టెంబర్ ద్వితీయార్థంలో దేశంలోని బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయల టైమ్ డిపాజిట్లు చోటుచేసుకొన్న విషయం ఆశ్చర్య పెడు తోంది. అలా ఎప్పుడూ జరగలేదు. ఖచ్చితంగా ఈ డిపాజిట్ల మొత్తం రూ. 3.03 లక్షల కోట్లు. ఆ మొత్తాలలోంచి కొన్నాళ్లకు రూ.1.2 లక్ష ల కోట్లు ఉపసంహరించుకొన్నారు. సెప్టెంబర్ 16-30 మధ్య ఈ మొత్తం ఫిక్సుడు, రికరింగ్ డిపాజిట్ల రూపేణా జమ అయింది. వెనుక తేదీ నుంచి సిఆర్‌ఆర్ ( క్యాష్ రిజర్వు రేషియో- నగదు నిల్వ నిష్పత్తి)కు నూరు శాతం ఇంక్రిమెంటల్ నియమాన్ని అమలు చేస్తు న్నట్లు రిజర్వు బ్యాంకు ఇటీవల ప్రకటించిన తేదీ కూడా సెప్టెంబర్ 16. ఇది చాలా అరుదైన నిర్ణయం కూడా. నవంబర్ 8న ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకులలోకి అదనంగా నగదు ప్రవహించకుండా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆర్‌బిఐ తెలి పింది.
అంటే సెప్టెంబర్ 16నుంచే బ్యాంకుల వద్ద చాలినంత నగదు డిపాజిట్లు ఉన్న విషయం రిజర్వు బ్యాంకుకు తెలుసునని దీనినిబట్టి అనుకోవాలి. వింత గొలుపుతున్న మరో విషయం ఏమిటంటే – సెప్టెంబర్ 30 తరువాతి పక్షం రోజులలో రూ.1.2 లక్షల కోట్ల టైమ్ డిపాజిట్లనుంచి డబ్బు ఉపసంహరణ.ఇది కూడా ఎన్నడూ జరగనిదే. అంతేకాకుండా ఈ డిపాజిట్ల నగదును అక్టోబర్ 15న పక్షం రోజుల ఆర్‌బిఐ నివేదికలో సేవింగ్ లేదా కరెంట్ అకౌంట్లలో చూపలేదు.
ఇదంతా ఏమిటో వివరించాలని కోరుతూ ‘ బిజినెస్ స్టాండర్డ్’ ఆర్థ్తిక మంత్రిత్వ శాఖకు, ఆర్‌బి ఐకి ప్రశ్నలను పంపింది. ఆ అరుదైన డిపాజిట్లు, ఉపసంహరణలను వివరించవలసిందిగా కోరింది. కాని జవాబు రాలేదు. రెండూ మౌనం వహించాయి. కొన్ని అధికారిక వివరణలు వచ్చాయి. సీనియర్ ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు దర్యాప్తు జరపాలని లేదా మరింతగా నిజాలను బయట పెట్టాలని కోరుతున్నారు.
ఈ డిపాజిట్లు వేతన సంఘం బకాయిలను సిబ్బందికి ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్15 దాకా ఇవ్వడంవలన బ్యాంకులకు ‘కొద్ది గా పెరిగిన’ ఖాతాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టి పారేశారు. నోట్ల రద్దు విషయం ముందే పొక్కిన ఫలితంగా ఈడిపాజిట్లు చోటు చేసుకున్నాయా అన్న అనుమానాన్ని ఆయన మారుమాట లేకుండా తోసిపుచ్చారు.
విదేశాలలో ముద్రణ లేదెందుకు?
నోట్ల రద్దు అనంతర పరిస్థితులు అనేక ప్రశ్నలను రేపుతున్నా యి. వాటిలో ‘ కొత్త నోట్లను విదేశీ ముద్రణా కేంద్రాలలో ఎందుకు ముద్రించటం లేదన్నది కీలక ప్రశ్న. ప్రస్తుతం కొత్త నోట్లకు ఏర్పడిన కొరత మూలంగా ఈ ప్రశ్న తలెత్తింది. కొత్త రూ.500, రూ. 2000 నోట్లకు కొరత ముదిరి, బ్యాంకులు – ఎటిఎంలలోనే డబ్బు నిండుకోవడం జరుగుతోంది. సామాన్యులు క్యూలలో పడిగాపులు కాస్తూ ఆ ఇబ్బందులను భరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని అధిగమించడానికి రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) విదేశాలలో తగినంతగా కొత్త నోట్ల ముద్రణ సాగించవచ్చు. మన దేశంలోనే ఉత్పత్తి పెంచడానికి ఆరేళ్ల పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించాల్సి రావడం, ఆరంభంలో సరిగా ప్రణాళికా రచన జరగక పోవడంతోడు గత అనుభవాల రీత్యా కూడా ఆర్‌బిఐ అందుకు సాహసించడం లేదని అధికారులు వివరణ ఇస్తున్నారు.
ముద్రించిన
గత బుధవారం ఆర్‌బిఐ నోట్ల రద్దు గురించి చూచాయగా వివరాలు తెలిపింది. నవంబర్ 10 నుంచి చెలామణీలోకి 19 బిలి యన్ నోట్లను విడుదల చేశామని ఆర్‌బిఐ తెలిపింది. నోట్లరద్దు తరువాత ఆ రోజునే బ్యాంకులు తిరిగి తెరుచు కొన్నాయి. విడుదలైన మొత్తం నోట్ల విలువ రూ. 4 లక్షల కోట్లు. ఆర్‌బిఐ చెప్పిన 19 బిలియన్ నోట్లలెక్కలో కొత్తగా వచ్చిన రూ.500, రూ. 2000 నోట్లను కలప లేదు. వాటిని ఎన్ని ముద్రించారు? కొత్తగా ముద్రించి న రూ.2000 నోట్లు 1.5 బిలియన్ నుంచి -2.2 బిలియన్ అని ఆనోటా, ఆ నోటా తెలుస్తోంది. అలాగే రూ.500 నోట్లు 250-400 మిలియన్లేనని అంటున్నారు.
ఇదంతా ఆర్‌బిఐకి నోట్ల రద్దు ప్రభావంపై సరైన అంచనాలేదని నిరూపిస్తోంది. ఎప్పుడు పరిస్థితులు చక్కబడ తాయన్న ప్రశ్నకు ఇటీవల ద్రవ్య విధాన సమీక్ష వివరాల వెల్లడి సందర్భంలో ఆర్‌బిఐ జవాబు దాటవేసింది.
ఎన్ని కొత్త నోట్లు ముద్రించారో, ఎప్పుడు మామూలు పరిస్థితి నెలకొంటుందో వెల్ల డించకుండా ఆర్‌బిఐ ఎందుకు గోప్యం పాటి స్తోంది. పైగా ఆర్థిక వృద్ధిపై భవిష్య వివరాలను రూపొందించడంలో నోట్ల రద్దు వల్ల మారుతున్న పరిస్థితుల ప్రభావం కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
నోట్ల రద్దు పద్ధతులలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లిన ఆర్‌బిఐ తాజాగా వడ్డీ రేట్లను బిగపట్టడం ద్వారా ‘నిజాయితీగానే ఉన్నట్లు’ చాటుకుందా? లేక ఇంకేమైనా ఉందా? అన్నీ జవాబులేని ప్రశ్నలే.
– ఇషాన్ బక్షి, నితిన్ సేథి