Home ఎడిటోరియల్ తలొగ్గిన మోడీ ప్రభుత్వం

తలొగ్గిన మోడీ ప్రభుత్వం

Article about Modi china tour

షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం పూర్వస్థితి పునరుద్ధరణకై దళిత సంఘాలు సాగిస్తున్న ఆందోళన ఫలించింది. ప్రతిపక్షం, పాలక కూటమిలోని దళిత నేతలు ఈ నెల 9న ‘భారత్ బంద్’కు పిలుపుతో తెచ్చిన ఒత్తిడి ప్రభుత్వంపై పని చేసింది. చట్టం కోరలు పీకేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు దరిమిలా, దాన్ని తటస్థీకరిస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దళిత సమాజం ఏప్రిల్ 2న నిర్వహించిన దేశవ్యాప్త ఆందోళనను ప్రభుత్వాలు అణచివేయటం గుర్తు చేసుకోదగింది. ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారనే మిషతో బిజెపి పాలిత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ల్లో పోలీసులు కాల్పులు జరిపి కనీసం 9 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు, వందల మంది గాయపడ్డారు. వారి త్యాగం వృథా కాలేదు. చట్టం యథాపూర్వ స్థితి పునరుద్ధరణ జరుగుతోంది. 1989 నాటి చట్టాన్ని అమాయక పౌరులను “బ్లాక్ మెయిల్’ చేయటానికి దుర్వినియోగం చేస్తున్నారంటూ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, ఆరోపణ అందగానే నిందితులను అరెస్టు చేయరాదని, నిందితులు ప్రభుత్వాధికారులైతే వారి నియామక అధికారుల నుంచి అనుమతికోరాలని, ప్రైవేటు వ్యక్తులైతే పోలీసు అధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపి సంతృప్తి చెందితేనే ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. ముందస్తు బెయిలును నిరాకరిస్తున్న సెక్షన్ 18ని కొట్టివేసింది. ఏప్రిల్ 3న కేంద్ర ప్రభుత్వ రివ్యూపిటిషన్‌ను విచారించిన అదే ధర్మాసనం, నిరంకుశ అరెస్టు నుంచి అమాయకులకు రక్షణ కల్పించటమే తమ తీర్పు ఉద్దేశమని, దళిత హక్కులకు వ్యతిరేకం కాదంటూ వివరణ ఇచ్చింది. ఆ తీర్పు రాసిన జస్టిస్ ఎ.కె. గోయల్ జులై 6న తన రిటైర్మెంట్ సందర్భంగా ప్రసంగంలో మార్చి 20 తీర్పును గట్టిగా సమర్థించుకున్నారు. ప్రభుత్వం అదే రోజున ఆయన్ను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా నియమించింది. దీన్ని పుండు మీద కారం చల్లటంగా దళిత నేతలు ఆగ్రహించారు. అత్యాచారాల నిరోధక చట్టం యథాపూర్వస్థితిని పునరుద్ధరించాలని, గోయల్ నియామకం రద్దు చేయాలని ఆగస్టు 9న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ప్రతిపక్ష దళిత నేతలతో పాలక కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రాం విలాస్ పాశ్వాన్), ఇతర దళిత నేతలు చేయికలపటంతో ప్రభుత్వం శీఘ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఆగస్టు 10వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున దిద్దుబాటు చర్యకు తొందరపడక తప్పలేదు.
గుజరాత్‌లోని ఉనాలో గోవు కళేబరం నుంచి చర్మం వలుస్తున్న నలుగురు దళిత యువకులను గో రక్షకులనబడేవారు కట్టేసి చితకబాదిన ఘటన మోడీ ప్రభుత్వంపై దళితుల తిరుగుబాటుకు నాంది పలికింది. జిగ్నేశ్ మేవాని ఉనా నుంచి అహ్మదాబాద్‌కు నిర్వహించిన అస్మిత యాత్రలో 20 వేల మందికిపైకిగా పాల్గొన్నారు. దీని ప్రభావం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిపై పడింది. అంబేద్కర్ స్మారక మందిరాల పేరుతో దళితులను బుజ్జగించటానికి మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నా వివిధ ప్రాంతాల్లో దళితులపై జరుగుతున్న దాడులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిలో ఐక్యతను, రాజకీయ సంకల్పాన్ని పటిష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యత, బీహార్‌లో అధిక సీట్లకై నితీష్ కుమార్ జెడియు, పాశ్వాన్ ఎల్‌జెపి ఒత్తిడి నేపథ్యం దళితుల డిమాండ్‌పై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్టు చేసిందనవచ్చు. గత కొద్ది మాసాల్లో అనేక ఆర్డినెన్స్‌లు జారీ చేసిన ప్రభుత్వం, దళిత నేతలు కోరినట్లు అత్యాచారాల నిరోధక చట్టంపై ఆర్డినెన్స్ తేకపోవటం దాని చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది.
ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక ) చట్టంలోని ఒరిజినల్ నిబంధనలను పునరుద్ధరించే బిల్లును ఈ సమావేశంలోనే ఆమోదించాలని ప్రభుత్వం తలపెట్టినట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో ప్రకటించారు. ఒరిజినల్ చట్టంలోని సెక్షన్ 18 తర్వాత మూడు కొత్త క్లాజులు చేర్చాలని సవరణ బిల్లు తలపెట్టింది. ఒకటి, ఏ వ్యక్తిపైనైనా ఎఫ్‌ఐఆర్ నమోదుకు ప్రాథమిక దర్యాప్తు అవసరం లేదు. రెండు, నేరారోపణకు గురైన నిందితుణ్ణి అరెస్టు చేయటానికిపై అధికారుల అనుమతి పొందనవసరం లేదు. మూడు, ముందస్తు బెయిలుకు సంబంధించిన సిఆర్‌పిసి సెక్షన్ 438 ఈ చట్టం కింద కేసుకు వర్తించదు. ఏ తీర్పు లేదా ఏ కోర్టు ఉత్తర్వు దీనికి వర్తించదు.
దళిత హక్కుల రక్షణలో ఈ చట్టం ఒక పార్శం మాత్రమే. ఆర్థిక, సామాజిక న్యాయం కొ రకు సంఘటితంగా పోరాడి విజయాలు సాధించటమే దోపిడీనుంచి విముక్తికి అసలైన మార్గం.