Friday, April 26, 2024

హైవేల దిగ్బంధనం

- Advertisement -
- Advertisement -

Bharat Bandh Success in Northern States

ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం

భారత్ బంద్‌తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయింపు
పలు రైళ్ల రద్దు, 25 రైళ్లపై ప్రభావం పడిందన్న రైల్వేశాఖ
పంజాబ్, కేరళల్లో సంపూర్ణం
కొన్ని రాష్ట్రాల్లో పాక్షికం, మరికొన్నింటిలో అంతంత మాత్రమే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 10 గంటల దేశవ్యాప్త బంద్‌కు ఎస్‌కెం పిలుపునిచ్చింది. ఎస్‌కెఎంలో భాగంగా ఉన్న 40 రైతు సంఘాలు బంద్ నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నాయి. పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను రైతు సంఘాలు దిగ్బంధించాయి. దాంతో, వాహనాల రాకపోకలు కొన్ని గంటలపాటు స్తంభించిపోయాయి. బంద్ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన, మరికొన్ని రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్ డివిజన్లలోని 20 చోట్ల రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసన తెలపడంతో 25 రైళ్లపై ప్రభావం పడిందని నార్తర్న్ రైల్వే ప్రతినిధి తెలిపారు. వీటిలో పలు రైళ్లను రద్దు చేశారు.

పంజాబ్,హర్యానా,ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో రైతు సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. నిరసనలు శాంతియుతంగా సాగడంతో హింసాత్మక ఘటనలేమీ నమోదు కాలేదు. భారత్ బంద్‌కు కాంగ్రెస్, వామపక్షాలుసహా పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు బంద్‌ను విరమిస్తున్నట్టు ఎస్‌కెఎం ప్రకటించింది.

ఢిల్లీ సరిహద్దుల్లో స్తంభించిన ట్రాఫిక్

ఢిల్లీ అంతర్భాగంలో బంద్ ప్రభావం కనిపించలేదు. అయితే, సరిహద్దు ప్రాంతమైన ఢిల్లీఎన్‌సిఆర్‌లోని గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా శాటిల్లైట్ పట్టణాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో రైతుల నిరసన ప్రభావంతోపాటు ఢిల్లీగురుగ్రామ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టడం కూడా ట్రాఫిక్ స్తంభించడానికి కారణమైంది. ఓ దశలో వాహనాలు ఒకదానివెంట ఒకటి వరుస కట్టడంతో ఎటూ కదల్లేని స్థితికి చేరిన దృశ్యం విహంగ వీక్షణం ద్వారా కనిపించింది. వేలాదిమంది కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దాంతో, అత్యవసర చికిత్స అవసరమైన పేషెంట్లు కొందరు ఇబ్బందిపడ్డ సంఘటనలూ జరిగాయి. గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేర్చాల్సిన పేషెంట్ ఒకరు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు.

యుపి, పంజాబ్, హర్యానాల్లో హైవేల దిగ్బంధం

యుపి నుంచి ఢిల్లీ వెళ్లే ఘజీపూర్ రహదారితోపాటు, హర్యానాలోని సోనీపేట రహదారిని రైతులు దిగ్బంధించారు. దాంతో, దేశ రాజధానికి వెళ్లే రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పంజాబ్‌లో బంద్ సంపూర్ణంగా జరిగింది. పాటియాలాతోపాటు పలు చోట్ల రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారుల్ని దిగ్బంధించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతుల పక్షం తమ ప్రభుత్వం నిలబడుతుందని ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌చన్నీ ట్విట్ చేశారు. పొరుగున హర్యానాలోని సీర్సా, ఫతేబాద్, కురుక్షేత్రల్లో హైవేలను రైతులు దిగ్బంధించారు.

జార్ఖండ్‌పై ప్రభావం, బెంగాల్‌లో స్వల్పం

జార్ఖండ్‌లోని చాలాచోట్ల బంద్ ప్రభావం కనిపించింది. రహదారుల దిగ్బంధంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర రాజధాని రాంచీసహా పలుచోట్ల వ్యాపార సంస్థల్ని మూసివేశారు. బెంగాల్‌లో బంద్ ప్రభావం స్వల్పంగా కనిపించింది. అధికార టిఎంసి బంద్‌కు దూరంగా ఉంది. అయితే, ఎస్‌కెఎం డిమాండ్లకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది. వామపక్షాలు పలు చోట్ల రహదారులను దిగ్బంధించాయి. వామపక్షాల కార్యకర్తలు కోల్‌కతా, ఐఐటి ఖారగ్‌పూర్‌హిజ్రీ మార్గాల్లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసన తెలిపారు.

బీహార్, ఒడిషాల్లో మిశ్రమ స్పందన

బీహార్, ఒడిషాల్లో బంద్ ప్రభావం మిశ్రమంగా ఉంది. ఆర్‌జెడి,సిపిఐ కార్యకర్తలు పాట్నా, ఆరా, జహానాబాద్, మాధేపురా రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసన తెలిపారు. చాలాచోట్ల రహదారుల్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. మార్కెట్లు, వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగుల హాజరీ తక్కువగా ఉంది. ఒడిషాలోని భువనేశ్వర్, బాలాసోర్, రూర్కీ, సంబల్‌పూర్‌తోపాటు మరికొన్ని చోట్ల రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భువనేశ్వర్‌లో రైళ్లను అడ్డుకున్నారు.

కేరళలో సంపూర్ణం, కర్నాటకలో పాక్షికం

కేరళలో రైతుల బంద్‌కు అక్కడి వామపక్ష ప్రభుత్వం మద్దతు తెలిపింది. బంద్ సమయంలో ఆర్‌టిసి బస్సుల్ని స్వచ్ఛందంగా నిలిపివేశారు. ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా రైతులకు మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. రైతుల బంద్‌కు కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. కర్నాటకలో ఉదయం కొన్ని గంటలవరకు బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. జనజీవనం సాధారణంగానే కొనసాగింది. ఆ తర్వాత బెంగళూర్‌తోపాటు కొన్ని చోట్ల ఆందోళనకారులు రాస్తారోకోలకు దిగడంతో వాహనాల రాకపోకవలకు అంతరాయం ఏర్పడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News