Home తాజా వార్తలు మొబైల్ వినియోగదారులకు షాక్

మొబైల్ వినియోగదారులకు షాక్

Bharti Airtel

 

డిసెంబర్ నుంచి చార్జీలు పెంపు
ప్రకటించిన ఎయిర్‌టెల్, వొడాఐడియా

న్యూఢిల్లీ : టెలికామ్ వినియోగదారులకు వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 1 నుండి మొబైల్ సేవా రేట్లను పెంచనున్నామని ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ టెలికాం కంపెనీలు మొబైల్ సర్వీసు రేట్లను డిసెంబర్ 1 నుంచి పెంచాలని నిర్ణయించాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ డిజిటల్ అనుభవం కోసం కంపెనీ వినియోగదారులకు డిసెంబర్ 1 నుండి చార్జీలను పెంచుతున్నట్టు వోడాఫోన్ ఐడియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రతిపాదిత చార్జీలకు సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వ్యాపారం వృద్ధికి వీలుగా డిసెంబర్ నుంచి కంపెనీ సేవల రేటును పెంచడం ప్రారంభిస్తున్నామని భారతి ఎయిర్‌టెల్ కూడా ప్రకటించింది. టెలికం రంగంలో మూలధనం అవసరం ఉందని, అందులో నిరంతరం పెట్టుబడులు పెట్టాలని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఎయిర్‌టెల్ డిసెంబర్ నుండి సుంకాన్ని పెంచుతుంది.

వోడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.50,922 కోట్ల నష్టాన్ని చవిచూసింది. చరిత్రలో ఏ భారతీయ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో త్రైమాసిక నష్టం రాలేదు. సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఎజిఆర్)పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బకాయిలు చెల్లించడానికి కేటాయించిన నిబంధన కారణంగా సంస్థకు ఈ నష్టం వాటిల్లింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన కోర్టు టెలికమ్యూనికేషన్ విభాగానికి బకాయిలు చెల్లించాలని వోడాఫోన్-ఐడియా, ఇతర టెలికాం కంపెనీలను ఆదేశించింది. వోడాఫోన్ ఐడియా మాట్లాడుతూ, ఇప్పుడు వ్యాపారాన్ని కొనసాగించగల సామర్థ్యం ప్రభుత్వ ఉపశమనం ఇస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. టెలికాం రంగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉందని, తగిన ఉపశమనం ఇవ్వడానికి కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

మూడేళ్ల గడువు ఇవ్వండి

ఎజిఆర్ బకాయిలపై టెలికాం సంస్థలకు సమయం ఇవ్వాలి
ప్రభుత్వానికి సిఒఎఐ విజ్ఞప్తి

ఎజిఆర్(సర్దుబాటు స్థూల రాబడి) బకాయిలు, జరిమానా, ఇతర పన్నులను చెల్లించేందుకు ప్రైవేటు టెలికామ్ సంస్థలకు గడువు ఇవ్వాలని టెలికాం సంస్థల సంస్థ సిఒఎఐ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల పాటు తాత్కాలిక నిషేధం విధించడం వల్ల సంస్థలకు తగిన వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ప్రభుత్వానికి మద్దతుగా ఎజిఆర్ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాల జారీ చేసిన తర్వాత టెలికాం సంస్థలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇప్పటికే జియో వంటి కంపెనీ ప్రవేశంతో తీవ్రమైన పోటీ వాతావరణం వల్ల నష్టాలు చూస్తున్న కంపెనీలకు ఎజిఆర్‌పై సుప్రీం ఆదేశాలు మరింత భారంగా మారాయి. మూడేళ్ల తర్వాత ఈ రంగంలోని సంస్థల నుండి ప్రభుత్వం తమ బకాయిలన్నింటినీ వసూలు చేసుకోవడం ప్రారంభించాలని సిఒఎఐ తెలిపింది.

కంపెనీలకు కొంత ఉపశమనం అవసరమని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. సంస్థలకు ప్రభుత్వ బకాయిలన్నీ తిరిగి చెల్లించడానికి రుణాన్ని పునర్నిర్మించడం గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చాలా వరకు 4జి లైసెన్స్‌లకు 11ఏళ్ల సమయం ఉందని, దీన్ని ప్రభుత్వం పొడిగించవచ్చని మాథ్యూస్ అన్నారు. గడువు ఇచ్చిన తర్వాత మొత్తం లైసెన్స్ వ్యవధిలో అన్ని బకాయిలను తిరిగి చెల్లించడానికి ప్రభుత్వాన్ని అనుమతించాలి. భవిష్యత్తుకు అనుగుణంగా ఎజిఆర్‌ని కూడా మార్చాలని మాథ్యూస్ సూచించారు. టెలికాం పరిశ్రమ భారీ సంక్షోభంలో ఉంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో లిస్టెడ్ టెలికం కంపెనీల మొత్తం నష్టం రూ.1 లక్ష కోట్లు దాటింది. గత వారం వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్ నష్టాలు రూ.74,000 కోట్లకు చేరాయి. ఎజిఆర్‌పై కోర్టు నిర్ణయం కారణంగా బకాయిలు చెల్లించడం వల్ల ఈ సంస్థలపై పెనుభారం పడుతోంది.

Bharti Airtel, Vodafone Idea to hike tariff from Dec