Home జిల్లాలు ఉపాధి పనులు భేష్!

ఉపాధి పనులు భేష్!

trs(మన తెలంగాణ/నిజామాబాద్ జిల్లా ప్రతినిధి):ఉపాధి హామీ పనులు ఇతర జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లాలోనే చాలా బాగా జరుగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డిచ్‌పల్లి బెటాలి యన్‌కు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ డా. యోగితా రాణా, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.జి. గౌడ్, జడ్పీ చైర్మన్ డి. రాజు, తదితరులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు, జరిగిన అభివృద్ధి, హరితహారం ప్రణాళిక, వ్యక్తి గత మరుగుదొడ్లు, తదితర అంశాలపై కలెక్టర్ మంత్రి జూపల్లికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. దీనిని పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ ఇందూరు జిల్లా చిన్న జిల్లా అయినప్పటికీ ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉపాధి హామీలో ప్రశంసా పూర్వక మైన అభివృద్ధి పనులు కొనసాగడం జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధుల ప్రత్యేక చొరవనే కారణమన్నారు. ఈ పథకం లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి జాతీయ అవార్డులు సాధించడం గొప్ప విషయమన్నారు. ముఖ్యంగా కూలీలకు పెద్ద మొత్తంలో పనులు కల్పించి ఎక్కువ సంఖ్యలో కూలీలు రావడానికి మూడు రోజుల్లోనే పే ఆర్డర్ జనరేట్ చేయడం కారణమన్నారు. పనులలో పెద్ద ఎత్తున అభివృద్ది జరగడంతో పాటు ఇతర జిల్లాల కంటే అత్యంత తక్కువ 3.26 శాతం మాత్రమే నిర్వహణ ఖర్చులు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ నేపథ్యం లో జిల్లా యంత్రాంగం ఏ ప్రతిపాదనలు పంపినా, పెం డింగు లేకుండా నిధులు మంజూరు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కోరిక మేరకు గ్రామ పంచాయతీలో నిధుల లేమితో పారిశుద్ధ్య పనులు కుంటుపడుతున్నందున ఈ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడానికి, దీనికై నిజామాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. 500 జనాభా కలిగిన తాండాలను గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించా మని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంలో శ్రద్ధగా ఉన్నారని, వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు కొత్తగా ప్రకటించే గ్రామాలలో కూడా జరుగుతాయన్నారు.జిల్లా కలెక్టర్ డా. యోగితా రాణా మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులలో ఎస్సి, ఎస్టి, వికలాంగ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, వీరు ఈ పనులపైనే ఆధారపడ్డారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను ఇతర జిల్లాలకు భిన్నంగా విలేజ్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో ప్రతి ఇంటికి నిర్మించి ఇస్తున్నామని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డితో పాటు బాత్‌రూం కూడా అదే ధరలో నిర్మించి ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇందిర జలప్రభ కింద 1300 బోర్లు తవ్వించడం జరిగిందని, కొందరు ఎస్సి, ఎస్టి లబ్ధిదారులకు మోటార్లు కూడా ఇచ్చామని తెలిపారు. 480 మంది రైతులకు 220 ఎకరాలకు డ్రిప్ అందించామన్నారు. వీరంతా పేదరికం నుండి శాశ్వతంగా బయటపడటానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని, ఇందుకై రూ.12 కోట్లు అవసరమన్నారు. ఉపాధి హామీ పథకం కింద సోక్‌పిట్లు, ఇంకుడు గుంతలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడి భవనాలు, గ్రామీణ రోడ్లు, గొర్రెల, పశువుల కొట్టాలు, పశువుల తొట్టెలు, కిచెన్ గార్డెన్లు, స్త్రీ శక్తి భవనాలు నిర్మించి ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి రాజారాం, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, డిపిఒ కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఎస్.ఈ సత్యమూర్తి, ఐకెపి పి.డి చంద్రమోహన్ రెడ్డి, సిఆర్‌డి సంయుక్త కమిషనర్ సైదులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.