Home తాజా వార్తలు కాశీలో ఈ నెల 19న భూదాన మహోత్సవం

కాశీలో ఈ నెల 19న భూదాన మహోత్సవం

SK-Joshi

 

హైదరాబాద్ : దేశంలో ఆధ్యాత్మిక రాజధాని కాశీ(వారణాసి)లో తెలుగువారికోసం ధార్మిక బ్రహ్మస్వ భవనం ఏర్పాటు కాబోతోంది. ఇందుకు సంబంధించి కాశీలో 19వతేదీ ఆదివారం నిర్వహిస్తున్న ప్రత్యక్ష భూదానమహోత్సవం గోడపత్రికను తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు ఎస్.కె.జోషి గురువారం సాయంత్రం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలానరసింహారావు, బ్రహ్మస్వ భవనం ట్రస్టు సభ్యులు మరుమాముల వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, ఈ బృహత్తర కార్యక్రమానికి తాను అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు.

విఖ్యాత వేదపండితులు, విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మణిక్యసోమయాజులు సంకల్పంతో ఏర్పాటయిన బ్రహ్మస్వ భవనం ట్రస్టు ఈ బృహత్తర కార్యాచరణను చేపట్టింది. వారణాసిలోని కేదార్ ఘాట్ సమీపంలో సోనార్ పురా ప్రధాన మార్గంలో 423 గజాల స్థలాన్ని దాదాపు రెండున్నర కోట్ల తో ట్రస్టు ఇటీవల కొనుగోలు చేసింది. భవిష్యత్తులో ఈ స్థలంలో స్వామీజీ లు, యతీశ్వరులు, పీఠాధీశ్వరులు, సాధకులు,కర్మిష్ఠులు, సదాచార సంపన్నులకోసం ఈ ధార్మిక భవనం నిర్మించనున్నారు. స్థలం కొనుగోలులో ప్రత్యక్ష భూదానం నిమిత్తం విరాళాలు అందించిన వదాన్యులతో ఈనెల 19వతేదీ ఆదివారం కాశీలోని బ్రహ్మస్వ భవనం ట్రస్టు స్థలంలో వదాన్యులతో ధార్మిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ధార్మికసమ్మేళనంలో వదాన్యులందరిచేత ప్రత్యక్షభూదాన సంకల్పం చేయించనున్నట్లు ట్రస్టు సభ్యులు మరుమాముల వెంకటరమణ శర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగురాష్ట్రాల్లోని వెయ్యిమందికి పైగా పాల్గొననున్నట్లు తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా కాశీ క్షేత్రంలో ప్రత్యక్ష భూదాన సంకల్ప మహోత్సవం-ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. వదాన్యులందరికోసం కాశీలో వసతి, భోజన ఏర్పాట్లతోపాటు ప్రత్యక్ష భూదాన సంకల్ప మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించటానికి సకల సన్నాహాలు చేసినట్లు చెప్పారు.

Bhoodhana Mahotsavam on January 19 in Kashi