Saturday, April 20, 2024

అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

Bhuma Akhila Priya petition hearing adjourned

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ సికిందరాబాద్ కోర్టులో బెయిల్ లభించలేదు. ఈక్రమంలో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అఖిలకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అఖిలప్రియ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టులను కూడా కోర్టుకు సమర్పించారు. అయితే బెయిల్ పిటిషన్‌పై పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆఖిలప్రియ పోలీస్ కస్టడీ కూడా ముగిసిన విషయం విదితమే. తనకు బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ రెండోసారి కోర్టును ఆశ్రయించారు. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వాలా లేదా అనే దానిపై సోమవారం పూర్తిస్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఎ2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు ప్రధాన నిందితురాలిగా మార్చారు. అలాగే ఈకేసులో ఎ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఎ2గా మార్చారు. ముందుగా అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరో రెండు సెక్షన్లు ఐపిసి 147, 385 అదనంగా నమోదు చేశారు.

రోజు రోజుకు పెరుగుతున్న నిందితుల సంఖ్య…

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తానికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌కు సంబంధించిన కుట్రలో పాలు పంచుకున్నారని భార్గవ్ తండ్రి మురళి, తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అఖిలప్రియ-భార్గవ్‌రామ్ కుటుంబాల్లో ఒక్క మౌనిక రెడ్డి తప్ప మిగిలిన వారంతా కిడ్నాప్ కేసులో నిందితులుగా మారారు.

నెల రోజులుగా కిడ్నాప్‌కు కుట్ర…

హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడానికి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ దాదాపు నెల రోజుల క్రితమే పథకం వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై తమ కుటుంబీకులతో కలసి పదేపదే చర్చలు జరిపారు. గుంటూరు శ్రీను నేతృత్వంలో కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర చేసే సందర్భంలో మురళి, కిరణ్మయి, చంద్రహాస్‌లు భార్గవ్‌రామ్‌తోనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

నిందితులకు నేర చరిత్ర…

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ను అమలు చేయడానికి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను, నేర చరిత్ర కలిగిన కిరాయి గూండాలను హైదరాబాద్‌కు రప్పించారు. వీరికి కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్‌లో బస కల్పించారు. అక్కడ నుంచి యూసుఫ్‌గూడలోని స్కూలుకు తీసుకువచ్చారు. అక్కడే వీరిలో ఐటిఅధికారులుగా నటించే వారికి కొత్త బట్టలు ఇవ్వగా గుంటూరు ప్రాంతానికి చెందిన వంశీకి మాత్రం అద్దెకు తీసుకువచ్చిన పోలీసు యూనిఫాం ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల దాడి నేపథ్యంలో తాను బందోబస్తుగా వచ్చినట్లు ఇతడు బాధిత కుటుంబానికి తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న వారి జాబితాలో వంశీ కూడా ఉన్నాడు. భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరులు ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి నేరాల్లో ఆరితేరి ఉండటంతో పోలీసులకు నిందితులు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే నిందితులు ముందస్తు బెయిల్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News