Home అంతర్జాతీయ వార్తలు పేద దేశాలకు అమెరికా నుంచి 50 కోట్ల టీకా డోస్‌లు

పేద దేశాలకు అమెరికా నుంచి 50 కోట్ల టీకా డోస్‌లు

Biden donated 50 cr pfizer vaccine doses to poor countries

 

వాషింగ్టన్: పేదదేశాలలో కరోనా నియంత్రణ దిశలో అమెరికా ఓ అడుగేసింది. అదనంగా 50 కోట్ల పైజర్ కొవిడ్ 19 టీకా డోసులను కొనుగోలు చేస్తుంది. వీటిని 92 స్వల్పాదాయ దేశాలకు, ఆఫ్రికా యూనియన్ దేశాలకు ఏడాదిలో పంపిణీ చేస్తుంది. ఈ విషయాన్ని సంబంధిత వ్యవహారాల వర్గాలు అనధికారికంగా తెలిపాయి. జి 7 దేశాల సమ్మిట్ ఆరంభంలో ఈ టీకాల పంపిణీ గురించి ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటిస్తారు. 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ టీకాలతో పది కోట్ల మందికి కరోనా రక్షక వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ మేరకు టీకాలను ఈ ఏడాది చివరిలోగానే అందిస్తారని , మిగిలిన వాటిని వచ్చే ఏడాది మధ్య భాగానికి పంపిణీ చేస్తారని ఈ వర్గాలు తెలిపాయి.

ప్రపంచదేశాలలో ప్రత్యేకించి పేద అల్పాదాయ వనరులు ఉన్న దేశాలలో తక్షణ కరోనా నియంత్రణ విషయంలో సరైన సాయానికి ప్రెసిడెంట్ జో బైడెన్ కట్టుబడి ఉన్నారని జాతీయ భద్రతాసలహాదారు జాకే సులివన్ బుధవారం విలేకరులకు తెలిపారు. అత్యంత ప్రాధాన్యతాక్రమంగా వ్యాక్సిన్‌లను పేద దేశాలకు అందించేందుకు బైడెన్ పాలకవర్గం అంకితభావంతో వ్యవహరిస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రెసిడెంట్ బైడెన్ తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లుతున్నారు. ప్రజా ఆరోగ్యం, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల దిశలో వ్యాక్సిన్ల పంపిణీనే కీలకమైన విషయం అయినందున వీటి విషయంలో బైడెన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి.

వ్యాక్సిన్ వ్యూహంపై త్వరలో ప్రకటన: బైడెన్
ప్రపంచవ్యాప్తంగా అందరిని చిక్కుల్లోకి నెట్టిన కొవిడ్‌కు వ్యాక్సిన్లతో కళ్లెం ఏర్పడుతుంది. ఈ దశలో అన్ని దేశాలకు సంబంధించి ప్రపంచస్థాయి సమగ్ర వ్యాక్సినేషన్ పాలసీ తన ఆలోచనలో ఉందని ప్రెసిడెంట్ బైడెన్ తెలిపారు. లండన్‌లో జి 7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వెళ్లుతూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులకు ఈ విషయం తెలిపారు. దీనిని త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ధనికదేశాలే అత్యధిక స్థాయిలో వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకుని ఉన్నాయని, ఈ విధంగా టీకాల విషయంలో అసమానతలు నెలకొన్నాయని విమర్శలు తలెత్తాయి. ఈ దశలో అమెరికా వైఖరిని సుస్పష్టం చేసేందుకు బైడెన్ జి 7 వేదికను వాడుకోనున్నారు.

Biden donated 50 cr pfizer vaccine doses to poor countries