Friday, April 26, 2024

అమెరికాలో మెక్సికో వాల్ వార్

- Advertisement -
- Advertisement -

Biden halts Mexico border wall construction

 

నిర్మాణ పనులకు బ్రేకేసిన బైడెన్
తుదిదశలో ట్రంప్ గోడ దూకుడు
వేలకోట్ల డాలర్ల కాంట్రాక్టు కథ పసిఫిక్‌కు

సాన్ డియిగో : అధికారాంతంలో ట్రంప్ సాగించిన గోడ స్పీడ్‌కు బైడెన్ బ్రేక్ వేశారు. పసిఫిక్ మహాసముద్రం అభిముఖంగా మెక్సికో నుంచి నల్లజాతివారు అదేపనిగా అమెరికాలోకి రాకుండా భారీస్థాయి మెక్సికో వాల్‌ను నిర్మించితీరుతానని ట్రంప్ చెపుతూ వచ్చారు. దీని ఎత్తు 30 నుంచి 50 అడుగుల వరకూ ఉంటుందని సగర్వంగా తెలుపుతూ వచ్చారు. ఈ మేరకు కోట్లాది డాలర్లకు కాంట్రాక్టు కూడా ఇచ్చారు. ఇక తాను పదవిలోకి దిగిపోవడం ఖాయమైన దశలో పనులు మరింత వేగవంతం చేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే బైడెన్ తాను అధికార పగ్గాలు చేపట్టిన రోజే సంతకాలు చేసిన 17 కార్యనిర్వాహక ఉత్తర్వులలో ఈ మెక్సికో వాల్ నిర్మాణ పనుల నిలిపివేత ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ ఉత్తర్వుల పట్ల మెక్సికో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అమెరికా కొత్త అధ్యక్షులు జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. సరిహద్దు గోడను అడ్డుకోవడం, దీనితో పాటు పలు ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టడం మంచి పరిణామం అని , ద్వంద్వ పౌరసత్వ దిశకు తీసుకున్న ఈ చర్య ప్రశంసనీయం అని మెక్సికో విదేశాంగ మంత్రి మెర్సిలో ఎబ్రార్డ్ ట్వీటు వెలువరించారు.

అయితే ఈ నెల 20వ తేదీకి ముందే మెక్సికో వాల్ నిర్మాణ పనుల వేగవంతానికి ట్రంప్ వెలువరించిన ఆదేశాలతో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ప్రతీకాత్మకమైన మెక్సికో వాల్ అక్కడి సీమాంతర పార్క్ వద్ద దాదాపుగా పూర్తయింది. గోడ నిర్మాణ పనులన్నింటిని వారం రోజులలో పూర్తిస్థాయిలో నిలిపివేయాలని బైడెన్ తమ ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షులు వెలువరించిన 17 ఆర్డర్లలో ఆరు కేవలం ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించినవే ఉన్నాయి. ఇప్పుడు మెక్సికో గోడ నిర్మాణ పనుల నిలిపివేతకు వెలువరించిన ఆదేశాలతో బిలియన్ డాలర్ల విలువైన చాలా పనులు ఆగిపోతాయి. అయితే ఇప్పటికీ బైడెన్ ఉత్తర్వులతో సంబంధం లేకుండా మెక్సికో వాల్ నిర్మాణ పనులు శరవేగంతోనే సాగుతున్నట్లు స్పష్టం అయింది. గత ఏడాది ట్రంప్ ఈ మెక్సికో వాల్ నిర్మాణ పనుల వేగవంతానికి మొండిపట్టుతో వ్యవహరించారు. ఇది తన ప్రెసిడెంట్ గిరిలో నిర్ధేశించుకున్న అత్యంత ప్రధానమైన లక్షం అని తెలిపారు.

మెక్సికో నుంచి అమెరికాలోకి ఏటా వేలాది మంది అక్రమంగా తరలివస్తున్న వారిలో అరాచకశక్తులు ఉన్నాయని, వారికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుందని, మెక్సికో వాల్ నిర్మాణంతో తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని చెపుతూ వచ్చారు. చైనా వాల్ తరహాలో మెక్సికో వాల్ పుటల్లో ప్రఖ్యాతం అవుతుందని ఆశించారు. ఇక్కడ 450 మైళ్లు అంటే 720 కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణం లక్షం అని తెలిపారు. ఈ లక్షం నెరవేరిందని అధికారం నుంచి దిగిపోవడానికి ఎనిమిది రోజుల ముందు ట్రంప్ ప్రకటించారు. దీనిని 664 మైళ్ల దూరం విస్తరించడమే తన ఆశయం అని కూడా తెలిపారు. అయితే గోడ నిర్మాణాన్ని నిలిపివేయాలనే ఇప్పటి అధ్యక్షుడి ఉత్తర్వులతో ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏమిటనేది స్పష్టం కాలేదు. అధికారం నుంచి దిగిపోవడానికి కేవలం ఐదు రోజుల ముందే అంటే ఈ నెల 15వ తేదీననే ట్రంప్ ప్రభుత్వం ఈ గోడ నిర్మాణ పనులకు 6.1 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు తెలిపింది.

ఈ సరిహద్దు గోడ నిర్మాణ కాంట్రాక్టు మొత్తం విలువ 10.8 బిలియన్ డాలర్లు. ఈ మేరకు కాంట్రాక్టు పత్రాలలో వివరాలు ఉన్నాయని సెనెట్‌లోని డెమొక్రట్ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన ఈ గోడ నిర్మాణానికి అవసరం అయితే 15బిలియన్ డాలర్లు కేటాయించేందుకు అయినా సిద్ధం అని ట్రంప్ అధికార యంత్రాంగం పేర్కొన్న విషయాన్ని ఇప్పుడు అధికార వర్గాలు తెలిపాయి. అయితే భారీ స్థాయి కాంట్రాక్టు రద్దుకు దారితీసే ఉత్తర్వులతో అమెరికా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, ఇప్పటికే జరిగిన నిర్మాణ పనులపై సందిగ్థత నెలకొంటుందని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News