ప్రచార సభలో ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్ : అధ్యక్షునిగా తిరిగి తనను ఎన్నుకుంటే ఆశావాదం, అవకాశం, ఆశ కల్పిస్తానని, తన డెమోక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్‌ను ఎన్నుకుంటే నిరాశావాదం,పేదరికం,వినాశనం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజలకు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల గడువు పదిహేను రోజుల కన్నా తక్కువగా ఉన్న సందర్భంలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇది 47 ఏళ్ల పాలన సాగించిన బిడెన్‌కు, 47 నెలలు పాలించిన తనకు మధ్య జరుగుతున్న పోరులో ఎవరినో ఒకరిని ఎన్నుకునే ఓటుగా అభివర్ణించారు.
గత 47 సంవత్సరాలూ బిడెన్ మీ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ చేశారని, మీ సరిహద్దులను తెరిచారని ఆయన ఆరోపించారు. యధావిధిగా ప్రజల జీవన విధానాలు మళ్లీ పూర్తిగా ప్రారంభమౌతాయని, వచ్చేసంవత్సరం గొప్ప ఆర్థిక సంవత్సరంగా దేశ చరిత్రలో నిలుస్తుందని అప్పుడు మనేమే ముందుంటామని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. నార్త్ కెరోలినాలో గాస్టోనియా సిటీలో వేలాది మంది తన మద్దతుదారుల సమక్షంలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు ట్రంప్ సూపర్ రికవరీయా లేదా బిడెన్ సుదీర్ఘ నిరాశా అలాగే ఇది ట్రంప్ బూమ్ లేదా బిడెన్ లాక్‌డౌన్ ఏదెన్నుకుంటారో ఒక అవకాశంగా పేర్కొన్నారు. బిడెన్ థెరపీలను ఆలస్యం చేస్తారు.వ్యాక్సిన్ వాయిదా వేయిస్తారు.కరోనాను కొనసాగిస్తారు. స్కూళ్లు మూసివేయిస్తారు.దేశాన్ని షట్‌డౌన్ చేయిస్తారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.