Home తాజా వార్తలు బిగ్ ‘C’ చీటింగ్!

బిగ్ ‘C’ చీటింగ్!

Big C

 

బంపర్ ఆఫర్ల పేరుతో బిగ్ సి నిలువుదోపిడీ
స్క్రాచ్ పేరిట ఆకర్షణ
క్యాష్ పాయింట్స్‌తో మోసం
రూ.12 కోట్ల బహుమతుల ఎర
బిగ్ సి ఉచ్చులో కస్టమర్లు విలవిల
హంగూ ఆర్భాటాలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం

అన్నీ అనుమానాలే…

12 కోట్లు విలువ చేసే బహుమతులు ఎంత మందికి ఇచ్చారు?
ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? వాటి వివరాలు లబ్దిదారుల పేర్లతో ప్రకటన చేశారా?
నిబంధనలు, షరతులు వర్తిస్తాయని పేర్కొన్నారు? అవి ఏమిటి? కస్టమర్లకు ఏ విధంగా తెలియపర్చారు?
కోట్లలో బహుమతులు ఇస్తామని చేసిన ప్రకటనల గురించి ఎంఆర్‌టిపికి తెలియజేశారా?
డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్ని మొబైల్స్ విక్రయించారు? ఎంత మందికి విలువైన బహుమతులు ఇచ్చారు? ఇస్తే వారి పూర్తి వివరాలు?

హైదరాబాద్ ః అదిరిపోయే ఆఫర్లతో అడ్డగోలు మోసాలు. వినియోగదారులను నమ్మించి నట్టేట ముంచడమే వారి లక్ష్యం. ఉచితమంటూ జిమ్మిక్కులు, బంపర్ ఆఫరంటూ నిలువుదోపిడీ చేయడంలో సిద్దహస్తులు. స్క్రాచ్ పేరిట ఆకర్షించి ఆపై అందినకాడికి దండుకోవడమే వారి నైజం. మతిపోగొట్టే బహుమతులతో ఎరవేసి వినియోగదారులను బిగ్ ‘సీ’టింగ్ చేయడం వారి నిత్యకృత్యం. అదనపు క్యాష్ పాయింట్స్ మాయాజాలం మోజులో లక్షలాది మంది కొనుగోలు దారులు బాధితులుగా మారారన్నది అక్షర సత్యం. కేవలం హంగూ ఆర్భాటాలతో అడగడుగునా మోసాలకు పాల్పడుతున్నా అధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుడటం శోచనీయం.

వినియోగదారుల బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో బిగ్ సి ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ నిలువునా దోపిడీకి పాల్పడుతోంది. ఉచితమంటూ ఆనుచిత ప్రకటనలో చేస్తూ వ్యాపారాన్ని పెంచుకుని వినియోగదారులను నిలువునా దోచేస్తోంది. ఈ క్రమంలో మిగతా వ్యాపార సంస్థలపై దుమ్మెత్తిపోస్తూ అడ్డంగా దండుకునే యత్నాలు సాగిస్తోంఇ. నిత్యం వినూత్న తరహాలో వినియోగదారుల మోసగించడంలో బిగ్‌సి తన వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాలకు పెద్దపీఠ వేస్తూ కొనుగోలు దారుల సొమ్మును కొల్లగొట్టంలో బిగ్ సి దిట్ట అని పలువురు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఎంతలా అంటే మొబైల్స్ కొనుగోలు చేయడంలో బిగ్ సి.. బిగ్ సిలోనే మొబైల్స్ చౌక.. రూ.5 కోట్ల విలువైన బహుమతులు, మరో రూ.5 కోట్ల క్యాష్ బ్యాక్‌ల వెల్లువ ఉంటుందని వినియోగదారులను పూర్తి స్థాయిలో మబ్బులో పడేస్తుంది.

కోట్లలో బహుమతులు.. అందునా స్క్రాచ్ చేస్తే చాలు కోట్లు అంటే ప్రజలు ఎగబడకుండా ఉండలేరు. నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా ఆకర్షణనీయ రీతిలో వినియోదారులను కట్టి పడేస్తోంది. ఇవేమీ తెలియని వినియోగదారులు ఇదంతా నిజమేనని భ్రమిస్తున్నారు. స్క్రాచ్ చేస్తే కోట్ల నజరానాలు వస్తాయి.. ఒకవేళ తాము మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినా ఆ వార తమకు బహుమతులు రూపేణా సొమ్ములు గిట్టుబాటవుతాయనే ధోరణిని వినియోగదారుల్లో బిగ్ సి ప్రబలంగా నాటేసింది.

ఆఫర్లతో అడ్డగోలు దోపిడి
ధనార్జనే పరమావధి సూత్రంగా బిగ్ సి తానే బిగ్ బాస్.. వ్యాపార రంగంలో రారాజు అని విర్రవీగుతూ అడ్డగోలుగా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది. బిగ్‌సి సంస్థలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుతో కలుపుకుని మొత్తంగా 225 ప్లస్ ఉండటమే ఇందుకు తార్కాణం. ఇందులో కూడా మర్మం లేకపోలేదు. తమకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అత్యంత ఆదరణ ఉందని తెలియజెప్పి తద్వారా వినియోగదారులను ‘బిగ్’ వల వేస్తోంది. ఈ క్రమంలో మరో ఐదు కోట్ల మేర క్యాష్ పాయింట్స్ పొందొచ్చని వినియోదారులను కట్టిపడేస్తోంది. బిగ్ సి చెప్పేదంతా నిజమేనని ఉచ్చులో పడిన వినియోగదారులు సదరు సంస్థలో వివిధ రకాల మొబైల్స్ కొనుగోళ్లు ద్వారా నష్టపోతున్నారు. ఇంతటితో బిగ్ సి ఆగలేదు. తన వ్యాపార సూత్రాన్ని మరింతగా ఇనుమడించింది.

ప్రముఖ మొబైల్స్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్ తక్కువ అన్ని వ్యాపార సంస్థల్లో కంటే తమ వద్దే చౌక అని ట్యాగ్‌లైన్‌ని తనకు తానుగా పెట్టేసుకుంది. బిగ్ సి లోపలికి ప్రవేశించిన వినియోగదారుడెవరైనా మొబైల్ ఫోన్‌ని కొనుగోలు చేయకుండా బయటకు రాని పద్ధతుల్లో బిగ్ సి ఆకర్షణీయ వల ఉంటోంది. గిఫ్ట్‌లు, క్యాష్ బ్యాక్ అనే అంశాలు పలు వ్యాపార సంస్థల్లో ఉన్నప్పటికీ బిగ్ సి సంస్థల్లో ఉన్నంతగా మరెక్కడా లేదన్నది సుస్పష్టం.

బహమతులెక్కడ…క్యాష్ పాయింట్స్ నామమాత్రమేనా..!?
ఇదిలా ఉండగా, వినియోగదారులను రప్పించడంలో అడ్డగోలు విధానాలతో దూసుకుపోతున్న బిగ్ సి తాను చెప్పిన విధంగా స్క్రాచ్ చేస్తే బహుమతులనందిస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇంతవరకూ బిగ్ సి వినియోగదారుడెవరూ తనకు ఫలానా బహుమతి వచ్చిందని చెప్పుకున్న పాపాన పోలేదు. మరి ఆ కోట్లాది విలువ చేసే బహుమతులు ఏమయ్యాయి?. ఒకవేళ ఏదైనా వినియోగదారుడు ఇదే విషయమై పొరపాటున ప్రశ్నిస్తే అతడికి ఒక చిన్నపాటి బహుమతో లేదా చిరు మొత్తంలో క్యాష్ పాయింట్‌ని అందజేస్తూ బిగ్ సి చేతులు దులుపుకుంటోందన్న ఆరోపణలు లేకపోలేదు. బిగ్ సి మాయాజాలంపై ఇప్పటికే వినియోగదారుల ఫోరం.. ఇతరత్రా వినియోదారులకు పరిహారాన్నందించే సంస్థల్లో పలువురు వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

మొబైల్ మార్కెట్లో మాయాజాలం : 
ఈ విధంగా వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్న బిగ్ సి సరైన విధంగా వినియోగదారులకు ఆయా మోబైల్ తదితర ఉత్పత్తులను అందిస్తోందా? అదేం లేదన్న సమాధానం కొందరి వినియోగదారుల నుంచి వినపడుతోంది. పూర్తి స్థాయిలో నియమ, నిబంధనలకు నీళ్లొదిలేసింది బిగ్ సి. ఇదంతా మాయాజాలమని గ్రహించిన వినియోగదారులను గుర్తించి వారిని తమవైపుకు తిప్పుకోవడంలో సైతం బిగ్ సిది అందెవేసిన చేయి. ఈ రకంగా బయట వ్యాపార సంస్థల కంటే ధీటుగా తన మాటే వేదంగా బిగ్ సి తనను తాను నిలదొక్కుకునే క్రమంలో వినియోగదారులే చిట్టచివరకు బలిపశువులుగా మారుతున్నారనడంలో సందేహం లేదు. ఇంతలా బిగ్ సి విర్రవీగిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడు. దీంతో బిగ్ సి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఈ రకంగా వినియోగదారులను నిట్టనిలువునా దోచేస్తున్న బిగ్ సి ఆగడాలను అరికట్టాల్సిన సంబంధిత సంస్థలు చోద్యం చేస్తున్నాయా? అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ సిలో మొబైల్ ఫోన్స్‌తో పాటు స్మార్ట్ టివిల అమ్మకాలను సైతం కొనసాగిస్తుండటం గమనార్హం. కేవలం బిగ్ సిది బూచేనని వినియోగదారులు క్రమ క్రమంగా తెలుసుకుంటున్నారు. బిగ్ సి అరాచకాలపై ఎవరూ పట్టించుకోని తరుణంలో తామే ఉద్యమిస్తామని వినియోదారులు నడుం బిగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అదే జరిగితే.. బిగ్ సి మాయాజాల సామ్రాజ్యం త్వరలో కుప్పకూలడం ఖాయమేనని బాధిత వినియోగదారులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ఎంఆర్‌టిపి చట్టం ః ప్రకటనలతో వినియోగదారులను నిలువునా మోసగించే వ్యాపార సంస్థలపై ఎంఆర్‌టిపి చట్టం 36(a)కింద కేసులు నమోదు చేయవచ్చని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రకటనలో పేర్కొన్న ఆఫర్ల మూలంగా నష్టపోయిన కొనుగోలు దారులు ఫిర్యాదు చేస్తే ఆయా వ్యాపార సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రజలను మోసగించే వ్యాపార సంస్థలపై నిఘా సారిస్తున్నామని, అనతికాలంలోనే వారి ఆటకట్టిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.

Big C Cheating with Bumper Offers