Home కలం బిసిల బిగి పిడికిలి

బిసిల బిగి పిడికిలి

SAMUHAMఇప్పుడు తెలుగు సాహిత్యం సబాల్టర్న్ రూపాన్ని, సారాన్ని వొడిసి పట్టుకుంటోంది. అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని బిసి లు నినదిస్తున్నరు. ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి అన్ని రంగాల్లో న్యాయమైన వాటా దక్కాలని డిమాండ్ చేస్తున్నరు. బహుజనులంతా గతంలోకన్నా ఇప్పుడు ఎంతో సోయితో ఉన్నరు. అయినా బ్రాహ్మణాధిపత్యం, ఆధిపత్య భావజాలం దళిత, బహుజనులను ఒకవైపు ఐక్యం కాకుండా చూస్తూనే మరోవైపు అణచివేస్తున్నాయి. ఒకప్పుడు పురాణాలు, ఆధ్యాత్మిక రచనలు అందరి మెదళ్ళను ఆవరించాయి. నియంత్రించాయి. మధ్య యుగంలో శృంగార ప్రబంధాలు, సామాన్యుడికి సంబంధం లేని అవధానాలు, పాండిత్యాన్ని ప్రదర్శించే చమత్కార సాహిత్యాన్ని గంప గుత్తగా బ్రాహ్మణ కవి సమాజం పాఠకులపైై రుద్దింది. క్షీణ యుగం, అంధ యుగం పేరిట బ్రాహ్మణేతరులు సృజించిన కవిత్వం, ద్విపద రచనలకూ, తత్వాలకు, జానపదాలకు ఎటువంటి విలువ లేకుండా చేసిండ్రు. చరిత్రలో ఈ సాహిత్యాన్ని తృణీకరించారు.
1990ల తర్వాత ఒక వైపు గ్లోబలైజేషన్, మరోవైపు మండల్ కమీషన్ అమలు వల్ల అప్పటివరకు అగ్రకులాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్న విద్య కొంత మేరకు బిసిలకు కూడా అబ్బింది. అంతకు ముందటికన్నా వివిధ విశ్వవిద్యాలయాల్లో బిసి కులాల నుంచి ముఖ్యంగా ఉత్తత్తి కులాల వాండ్లు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నరు. ఈ కాలంలోనే దేశ వ్యాప్తంగా, రాష్ర్టంలోనూ బహుజన సమాజ్ పార్టీ కొంత కొత్తగా చైతన్యం తీసుకొచ్చింది. ఆర్.కృష్ణయ్య, నారగోని లాంటి వాండ్లు తమ వంతు పాత్ర పోషించిండ్రు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో క్రాంతి సంగ్రామ పరిషత్ పేరిట వై.శంకర్ నాయకత్వంలో కొంతమంది విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. తర్వాతి కాలంలో ఆయన బహుజన సమాజ్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా పనిచేసిండు. బహుజన సమాజ్ పార్టీ అంటే కేవలం దళితులే అన్న భావన నుంచి బిసి లు కూడా బహుజనులే అన్న సోయితో ఆయన కృషి చేసిండు. ఈ దశలో విశ్వవిద్యాలయాల్లో చైతన్యవంతులైన ఎక్కువ మంది విద్యార్థులు ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్‌లో ఉన్నారు. ఎబివిపిలో అతి తక్కువ మంది బిసి లు పనిచేశారు. అయితే 1990ల తర్వాత వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులందరూ మెల్లమెల్లగా ఆయా సంస్థల నుంచి బయటి కొచ్చిండ్రు. ఇట్లా బయటికొచ్చిన వాళ్ళు లేదా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు బాధ్యతగా బిసి సాహిత్యాన్ని పట్టించుకున్నారు. ఇలా పిడిఎస్‌యుకి చెందిన జూలూరి గౌరిశంకర్ ‘వెంటాడే కలాలు వెనకబడ్డ కులాలు’ అనే బిసి అస్తిత్వ వాద కవిత్వాన్ని సంకలనంగా తీసుకొచ్చాడు.

ఇందుకు ఆయన అనేక ఇబ్బందులెదుర్కొన్నప్పటికీ బిసి భావజాలంతోనే ఉన్నడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కాకతీయ యూనివర్సిటి విద్యార్థిగా ఉన్న చింత ప్రవీణ్ కుమార్ 35 ఏండ్ల లోపు వారి కవిత్వాన్ని ఒక్క దగ్గరికి తెచ్చిండు. అంటే సరిగ్గా తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత పుట్టిన వారికే ఇందులో స్థానం దక్కింది. ఈ యువ కవులు నిర్దిష్టంగా, సూటిగా రేజర్ ఎడ్జ్ షార్ప్‌నెస్‌తో కవిత్వమల్లిండ్రు. ఫూలే, అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ బ్రాహ్మణిజానికి, మనువాదానికి వ్యతిరేకంగా ఈ యువ కవులు కవిత్వ మల్లిండ్రు. సావిత్రిబాయి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ విద్యద్వారానే సమాజంలో మెరుగైన మార్పులు చోటు చేసుకుంటాయని రాసిండ్రు. ఎవరి వృత్తుల గురించి వారు రాస్తూ, నోస్టాల్జిక్‌గా తమ తండ్రుల తరంలోని వృత్తి జీవితాన్ని యాద్జేసుకున్నరు.

ఆత్మహత్యలు లేని సమాజం కోసం, రాజ్యాధికారంలో జనాభా దామాషాలో వాటా సాధించుకునేందుకు ఉద్యమించాలని ఈ కవులు పిలుపునిచ్చారు.ఇప్పటికీ బిసిల్లో కొంత వైరుధ్యమున్నది. అది భావజాలానికి సంబంధించిన వైరుధ్యం. ఇందులో ఏరుగొండ నరసింహుడు“మీ కర్కశ మత్స్య న్యాయంలో గిలెటిన్లకు బలైన అమరుల ఎముకలను పెన్నుగా, గన్నుగా మార్చి ప్రజల చరిత్ర నిర్మించబోతున్నాం. అదనపు ఉత్పత్తిలో తేలిన సింహాసనాన్ని పెను తుపానులో ముంచి నూతన ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలుక బోతున్నాం” ఇది పెన్నుని గన్నుగా మార్చి తుపాకి ద్వారానే రాజ్యాధికారం సాధించుకుంటామని చెబుతున్న కవిత. అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకమైన కవితను రాజేష్ ఖన్నా రాసిండు. అది. “గర్జించిన వసంత మేఘం పంచిన భూమె ంత పారించిన నెత్తురెంత చచ్చిందెవరు చంపిందెవరు చచ్చి చరిత్ర కెక్కిన వాళ్ళలో నా వాళ్ళెందరు….? పంజరంలో బంధించిన వేటగాడు చెబుతున్న స్వేచ్ఛా పాఠం వింటూ ధ్వనించిపోతున్నావ్ మిత్రమా నీవనుకుంటున్నావ్ వాడు నీకు అక్షరాలు నేర్పాడని బతుకు నేర్పాడని ననుకుంటున్నాను వాడికి నువ్వు తెలివైన బానిసవని మైడియర్ కాస్ట్ ఇంటలెక్చువల్ స్లేవ్ ఏ రాయైతేనేం తల పగుల గొట్టుగోవడానికి” అంటూ వామపక్ష ఉద్యమాల వల్ల అమరులైన, విస్మృతుల్ని యాద్జేసు కున్నడు. నిజానికి వసంత మేఘ ఘర్జన వల్ల ఎందరో చైతన్యవంతులైన బహుజనులు ప్రాణాల ర్పించారు. వారెవ్వరికీ చరిత్రలో చిరస్మరణీయమైన స్థానం దక్కలేదు. అలాగే భూములూ దక్కలేదు. హింస, ప్రతి హింస పేరిట రెండు వైపులా బహుజనులే సమిధల య్యిండ్రు. అందుకే ఈ హననానికి చరమగీతం పాడాలని రాజ్‌ష్ ఖన్నా న్యాయమైన పిలుపునిచ్చిండు.

ఇదే సరైన దారి. మరో కవితలో రాజేష్ ఖన్నా “మన రాజ్యం మనకు దక్కాలంటే యుద్ధం చేయాలె’ అని పిలుపు నిచ్చిండు. వియత్నాం వీరుల పోరాట స్ఫూర్తిని ఆవాహన చేసుకోవా లన్నాడు. మేధావుల పేరిట బహుజనులు వామపక్ష ఉద్యమాన్ని సమర్ధించడాన్ని మేధో బానిసత్వంగా రికార్డు చేసిండు. నిజానికి అంబేద్కర్ ఏనాడూ వామపక్షాలను సమర్ధించలేదు. అదేస్ఫూర్తిని కొనసాగించా లని ఈ యువ కవులు పిలుపునిచ్చారు. “మనువు గాడి రాతలకు మా తల రాతగిట్లయింది” అని అణచి వేతకు, విస్మరణకు, వివక్షకు గురవుతున్న బహుజనుల గురించి కొండ్రు బ్రహ్మం రాసిండు. “ఇక మేము పూలే అంబేద్కర్ బాటలో నడుస్తం// మమ్మల్ని మేమే పాలించుకుంటం” అని చెప్పిండు.కందాళ శోభారాణి ఆగ్రహాన్ని కవి త్వంలో వ్యక్తీకరించింది. “చాతుర్వర్ణ సిద్ధాంతమే బ్రాహ్మణ ఛాందసమే పరిఢవిల్లి సమాజాన్ని ముక్కలు చేసింది…..శ్రామిక కులాలకు విద్యను మిధ్యగా చేసి సంప న్నుల ఆస్తిగా చదువును ఒడిసి పట్టింది అనాదిగా బ్రాహ్మణ ఛాందస సారాన్నే ప్రభుత్వాలు ప్రజాస్వా మ్యపు నీతిగా పాటిం చాయి” అంటూ ఎవరు దోషులో తేల్చే సిండ్రు. దాంట్లోనే బిసిలకు అవసరమైన విద్యగురించి కూడా చెప్పిండ్రు.

అంబడి భాగ్య బహుజనులకు విద్యావసరాన్ని చెబుతూనే ఈదేశ తొలి మహిళా టీచర్ సావిత్రిబాయ్‌లం అంటూ బహుజన ఆత్మగౌరవాన్ని కేతనంగా ఎగరేసింది. ఇన్నాళ్ళ మా ఈ దుస్థితికి కారణాలు తెలియాలె, సమాధానాలు కావాలె అంటూ సావిత్రిబాయ్‌గా మారి ప్రశ్నల కొడవళ్ళను పిడికిట కలం రూపంలో ఎత్తిపట్టింది. తెలంగాణ మహిళల పోరాట పటిమని చిత్రికగట్టింది. ఈ సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించిన చింతం ప్రవీణ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి బిసిల్లోని పిచ్చకుంట్లోల్లు, దొమ్మరోల్లు, బైరూపులోల్లను తీసుకు రావాలని కవిత్వమల్లిండు. చాకలి, మంగలి, బెస్త, పద్మశాలి, కుమ్మరి, యాదవ తదితర జీవితాలను కొన్ని వ్యథాభరితంగా మరి కొన్ని నోస్టాల్జిక్‌గా చిత్రించాయి. బూర్ల వెంకటేశ్వర్లు, సొన్నాయిల కృష్ణవేణి, నరేష్కూమార్, రాజేష్ ఖన్నా, ఎలికట్టె శ్రీనివాస్, ఇట్లా 35కుపైగా యువకవులు, ఏడుగురు కవయిత్రులు ఇందులో తమ ఆగ్రహాన్ని, నిరసనను, ధిక్కారాన్ని వినిపించారు.

– సంగిశెట్టి శ్రీనివాస్

9849220321