Home బిజినెస్ పెను సవాళ్లు…

పెను సవాళ్లు…

finance minister

 

అందరి దృష్టి రేపటి బడ్జెట్2019 పైనే

న్యూఢిల్లీ: దాదాపు ఐదు దశాబ్దాల్లో తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్నారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఫైటర్ జెట్‌లో ప్రయాణించి ఆదర్శంగా నిలిచిన సీతారామన్‌కు ఆర్థికమంత్రిగా పెను సవాళ్లు ముందున్నాయి.

భారతీయ జనతా పార్టీ(బిజెపి) జాతీయ అధికార ప్రతినిధిగా సేవలను ప్రారంభించి ఆర్థికమంత్రి స్థాయికి అంచెలంచె లుగా ఎదిగారు. 59ఏళ్ల సీతారామన్ బాధ్యతలు చేపట్టిన రోజే చేదు వార్త విన్నారు.. తొలి సవాలుగా 45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగ రేటు అనే వార్త వెలువడింది. మరో వైపు జిడిపి గణాంకాలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. గత త్రైమాసికంలో చైనాతో పోటీపడే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న మన ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జనవరిమార్చి కాలంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 5.8 శాతం నమోదు చేసింది.

రెండేళ్లలో తొలిసారి చైనా దిగువకు మన జిడిపి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో జిడిపి వృద్ధి రేటు వరుసగా 7.1 శాతం, 6.6 శాతం, 5.8 శాతం నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో అంచనాల కంటే దిగువకు వృద్ధి రేటు పడిపోయింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం(201819)లో జిడిపిలో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 57.2 బిలియన్ డాలర్లు లేదా 2.1 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో 1.8 శాతంగా ఉంది. ఇది 201718 ఆర్థిక సంవత్సరంలో 48.7 బిలియన్ డాలర్లుగా ఉంది. 201819 ఆర్థిక సంవత్సరానికి లోటు పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 27.7 బిలియన్ డాలర్లు (2.7 శాతం)తో పోలిస్తే మార్చి త్రైమాసికంలో 4.6 బిలియన్ డాలర్లు( 0.7 శాతం)గా ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్వల్పంగా మందగమనం దిశగా పయనిస్తోంది.

ఆటోమొబైల్ నుంచి రోజువారీ అవసరాలు, వినియోగం తగ్గడం, నిరుద్యోగ రేటు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడం, దేశీయ బ్యాంకులు నిరర్థక ఆస్తులను తగ్గించుకునే పనిలో ఉండడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్యకొరత వంటివి ఆర్థికమంత్రి ముందున్న సవాళ్లు. ఈ నేపథ్యంలో సీతారామన్ వినియోగం, వృద్ధికి ఊతం అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

రియల్ రంగంలో మార్పులు: ప్రభుత్వం గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో పలు మార్పులు తీసుకొచ్చిందని సీతారామన్ అన్నారు. రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం (ఆర్‌ఇఆర్‌ఎ), జిఎస్‌టి, 2022కల్లా అందరికీ ఇల్లు పథకం వల్ల ఈ రంగం వృద్ధిని నమోదు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని అన్నారు. ఇటువంటి సంస్కరణలు పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చాయని, గృహకొనుగోలు దారుల్లో, పెట్టుబడిదారుల్లో ఈ రంగం పట్ల నమ్మకాన్ని నింపాయని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో గృహ వినియోగదారులకు పలు విధాలుగా పన్ను రాయితీలు ఇచ్చారని అన్నారు. గృహ కొనుగోలుదారులకు అదనపు పన్ను రాయితీ ప్రయోజనాలు అందించాలని రియల్ ఎస్టేట్ డెవలపర్లు కోరారు. ఇందుకోసం గృహ కొనుగోలుదారుల స్థోమతకు తగ్గట్లు విధానాలు ఉండాలని సూచించారు. బడ్జెట్ నేపథ్యంలో రియల్ డెవలపర్లు పలు అంశాలను సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు.

Biggest challenges for Sitaraman as finance minister