అన్ని పార్టీల్లో ఉన్నట్లు మా పార్టీలోనూ ఉన్నారేమో? సమయం
వచ్చినప్పుడు వారంతట వారే బయటపడతారు బిఆర్‌ఎస్‌లో అంతర్గత
ప్రజాస్వామ్యం ఉంది పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా లేఖలు రాయొచ్చు
అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది పార్టీలో
మేమందరం కార్యకర్తలమే కవిత వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందన
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దయ్యం రేవంత్‌రెడ్డి అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు చేశారు. ఆ దెయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలన్న దాని పైనే తాము పనిచేస్తున్నామని అన్నారు. మాజీ సిఎం,బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌కు ఎంఎల్‌సి కవిత లేఖ రాయడంపై కెటిఆర్ స్పందించారు. తమ పార్టీ అధినేతకు లేఖ రాయడమనేది తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారని, తమ పార్టీలో కూడా రేవంత్‌రెడ్డి కోవర్టులు ఉండొచ్చని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తమ పార్టీలో ఎవరైనా కోవర్డులు ఉంటే వారంతట వారే బయటపడతారు అన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే
లేఖలు రాయొచ్చని తెలిపారు. గతంలో కూడా తమ అధినేతకు సూచనలు సలహాలు ఇస్తూ అనేకమంది లేఖలు రాశారని తెలిపారు. పార్టీలో అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అని, అది ఎవరైనా సరే అని పేర్కొన్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమే..అందరం సమానమే అని… ఇది అందరికీ వర్తిస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిందని, ఆ సమావేశాలలో చాలామంది తమ నేతలు, కార్యకర్తలు సలహాలు, సూచనలు ఇచ్చారని, కొందరు కెసిఆర్‌కు లేఖల రూపంలో కూడా సూచనలు గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత కెసిఆర్‌కు సూచనలు చేయాలంటే ఎవరైనా లేఖలు రాయొచ్చని అన్నారు.