Friday, March 29, 2024

బిజెపికి కీలకం బీహార్

- Advertisement -
- Advertisement -

BJP

ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్‌డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా నాలుగో సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ద్వారా రాజకీయంగా బిజెపికి చెప్పుకోదగిన ప్రయోజనం లేకపోయినా ఓటమి ఎదురైతే ప్రధాని మాత్రం వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించుకోవెలసి వస్తుంది. బీహార్ రాజకీయాలపై నిర్ణయాత్మక పాత్ర వహిస్తూ వస్తున్న ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండా గత మూడు దశాబ్దాలలో మొదటి సారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవంక ఎన్నికలలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్న రామ్ విలాస్ పాశ్వాన్ లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు సహితం ఈ మధ్యకాలంలో ఇవే కావడం గమనార్హం.

లాలూ, పాశ్వాన్ ఎన్నికల ఎన్నికల రంగంలో లేకపోవడం ఒక విధంగా నితీశ్ కుమార్‌కు రాజకీయంగా కలసి వచ్చే అంశం. ఒక మూడు నెలల క్రితం పరిశీలన చేసిన వారికి బీహార్ లో నితీశ్ కుమార్‌కు ఎదురు లేదు. ప్రతిపక్షం డీలాపడి ఉంది. నితీశ్‌ను పక్కకు నెట్టి సొంతంగా పోటీ చేయాలని ఉబలాటపడిన బిజెపి సహితం ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ తరచూ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తేజస్వి యాదవ్ రాజకీయంగా సొంత పార్టీలో, మిత్ర పక్షం కాంగ్రెస్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంపై అవసరమైన వనరుల సమీకరణ సహితం సవాల్ గా పరిణమిస్తుంది. ఒక విధంగా ఎన్నికలు ఏకపక్షం కావలసింది.

అయితే ఎన్నికలు ప్రకటించే సరికి నితీశ్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. పోలింగ్ తేదీ వచ్చే సరికి పరిస్థితులు ఏ విధంగా మారతాయి చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాల నుండి కన్నా బిజెపి నుండే ఎక్కువ సమస్యలు నితీశ్‌కు ఎదురవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ ను అవినీతి పరుడిగా చిత్రీకరించడంలో జాతీయ మీడియా, ఆయన రాజకీయ ప్రత్యర్ధులు గతంలో విజయం సాధించారు. అయినా ఆయనకు మద్దతుగా ఉంటున్న వర్గాలలో ఇప్పటికే ఆయన పట్టు సడలలేదు. వారిలో చీలిక తీసుకు రావడం కోసం ఒక వంక నితీశ్, మరో వంక బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసి బీహార్‌లో అభ్యర్థులను నిలబెట్టడం కేవలం నితీశ్, – బిజెపి లకు మేలు చేయడం కోసమే అనే అభిప్రాయం ప్రబలంగా మారుతున్నది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ అంశాన్ని స్పష్టం చేశాయి. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నంలో ఉన్నట్లే కనిపిస్తున్నది. నితీశ్ కుమార్‌కు మొదటి నుండి సౌమ్యుడిగా, నిజాయతీపరుడిగా, పరిపాలన దక్షుడిగా పేరొచ్చింది. దానితోనే ఆయన వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఈ పర్యాయం ఆయన పట్ల ప్రజలలో అటువంటి అభిప్రాయం కలగడం లేదు.

గత ఎన్నికలలో ఆర్‌జెడితో కలసి గెలుపొంది, ఆ తర్వాత బిజెపితో కలసి అధికారం పంచుకోవడం ఆయనకు రాజకీయంగా తీవ్రమైన అపఖ్యాతి పాలు చేసినదని చెప్పవచ్చు. అప్పటి నుండి ఆయన ప్రాబల్యం సహితం తగ్గుతూ వస్తున్నది. కరోనా కట్టడి విషయంలో సహితం నితీశ్ వ్యవహరించిన తీరు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన బీహార్‌కు చెందిన వలస కార్మికులను వెనుకకు రప్పించడంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరించడం పలు వర్గాలలో ఆగ్రహానికి దారితీసింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు చూపిన చొరవ నితీశ్‌ను ఇబ్బందులకు గురిచేసే అవకాశం కలిగిస్తున్నది.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ కోసం పలు పథకాలు చేపట్టినా ప్రజల విశ్వాసం చూరగొనే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటె గత ఎన్నికలలో ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల ఓటర్లు ఏ విధంగా వ్యవహరిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. సుమారు 16 శాతం మంది ఈ వర్గాల వారు ఉన్నారు. ఆ వర్గాలలో విశేషమైన పలుకుబడి గల పాశ్వాన్ ఇప్పుడు లేరు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ విడిగా అభ్యర్థులను పోటీకి దింపుతున్నారు.

గత ఎన్నికలలో రేజర్వేషన్ల విషయమై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ఒక ప్రకటనకు విపరీత అర్ధాలు కల్పించి, ఆ వర్గాల ప్రజలలో బిజెపి పట్ల వ్యతిరేకత వ్యాప్తి చేయడంలో నితీశ్, లాలూ విజయం సాధించారు. ఇప్పుడు పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్‌లో ఒక యువతి మరణంపై తలెత్తిన దుమారం బిజెపి – జెడియు కూటమికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు. బీహార్ లో మొదటి నుండి బిజెపి మద్దతు అగ్రవర్ణాల వారికే పరిమితం అవుతున్నది. వెనుకబడిన కులాలలో చెప్పుకోదగిన నాయకత్వాన్ని అభివృద్ధి చేయలేక పోతున్నది. అందుకనే నితీశ్ లేకుండా రాజకీయంగా మనుగడ సాగింపలేమనే భయం వారిలో పట్టుకొంది. అదే సమయంలో అక్కడ నితీశ్ ఉన్నంతకాలం బిజెపి బలం పెంచుకోలేదనే అభిప్రాయం కూడా ఉంది.

అందుకనే ఒక వంక నితీశ్‌కు దూరంగా వెళ్లలేక, మరోవంక ఆయన రాజకీయంగా బలం పెంచుకోవడాన్ని చూడలేక బిజెపి సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నది. దానితో నితీశ్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతూ, మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తున్న చిరాగ్ పాశ్వాన్ ను బిజెపి వారే నడిపిస్తున్నారనే అభిప్రాయం బలంగా నాటుకొంటున్నది. బిజెపి అభ్యర్థులు పోటీ చేసే చోట ఆయన పోటీ పెట్టక పోవడం, జెడియు అభ్యర్ధులపైననే పోటీ పెట్టడం, పైగా బిజెపిలో సీట్లు రాని కొందరు పాశ్వాన్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడం గమనిస్తే తెర వెనుక నితీశ్‌కు వ్యతిరేకంగా మంత్రాంగం జరుగుతుందనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి.

నితీశ్ కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకొని, ముఖ్యమంత్రి పదవికి పట్టుబట్టాలని చాలామంది రాష్ట్ర బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అందుకనే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చినా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ మాత్రమే అని బిజెపి నేతలు వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. 2000 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి హోం మంత్రి ఎల్ కె అద్వానీ ఇటువంటి నాటకం ఆడడంతో నితీశ్ అప్పుడు ముఖ్యమంత్రి కాలేక పోయారు. ఆర్‌జెడి అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఒక వంక నితీశ్ కుమార్ తో బిజెపి పొత్తు పెట్టుకోగా, మరోవంక అద్వానీ ప్రోత్సాహంతో రామ్ విలాస్ పాశ్వాన్ సొంతంగా అభ్యర్థులను నిలబెట్టారు. ప్రతిపక్షం ఓట్లు చీలడం ఆర్‌జెడికి కలసి వచ్చింది. ఇప్పుడు అమిత్ షా అటువంటి ఎత్తుగడలో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తేజస్వి యాదవ్ చెప్పిన్నట్లు ఒక విధంగా నితీశ్ కుమార్ అలసిపోయిన నేతగా కనిపిస్తున్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతుంది. అసహనంగా ఉన్న బిజెపితో కలసి కాపురం చేయడం కూడా కష్టంగానే ఉంది. పైగా, రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కువగా యువకులు కావడంతో యువ ఓటర్లపై ప్రభావం చూపలేని పరిస్థితి నెలకొంది. బిజెపి ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా ఈ ఎన్నికలలో ఏ మేరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తారో అనే అనుమానాలు సహితం తలెత్తుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితులు కారణంగా గత ఎన్నికల సమయంలో వలే ముందుండే పార్టీ ప్రచార యంత్రాంగాన్ని నడిపించలేరని తెలుస్తున్నది.

మరో వంక కరోనా సమయంలో ప్రపంచంలో ఆర్ధిక పరిస్థితులు దారుణంగా పడిపోయిన మూడు దేశాలలో ఒకటిగా భారత్ నిలవడం మోడీ ఈ ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తికి కారణం అయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అనుభవశూన్యతే ఇప్పుడు ఎన్‌డిఎకు ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. యాదవ్ నిస్సహాయ పరిస్థితిని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో పెద్దన్న పాత్ర వహించి, తన బలానికి మించి సీట్లు పొందగలిగింది. బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చే రెండేళ్లలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, అసోం తదితర రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News