Friday, April 26, 2024

కరోనా రోగుల ప్రాణాధార ఔషధంగా ఇతోలిజుమాబ్..

- Advertisement -
- Advertisement -

బయోకాన్ సంస్థ డ్రగ్ వినియోగానికి డిసిజిఐ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు కలిగిన కరోనా రోగులకు తమ డ్రగ్ ఇతోలిజుమాబ్ ను వినియోగించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) అనుమతించిందని ఆ డ్రగ్ ఉత్పత్తి సంస్థ బయోకాన్ సోమవారం వెల్లడించింది. ఈ డ్రగ్ ఇతోలిజుమాబ్ మార్కెట్‌లో అల్జుమాబ్‌గా లభ్యం కానున్నదని బయోకాన్ వివరించింది. కరోనా రోగుల్లోని సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్(సిఆర్‌ఎస్)ను నయం చేయడానికి ఈ డ్రగ్‌ను వినియోగిస్తారని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్శన్ కిరణ్‌ మజుందార్ షా పాత్రికేయ సమావేశంలో తెలిపారు. 25 ఎంజి/ఎంఎల్ సొల్యూషన్ కలిగిన ఈ ఇంజెక్షన్‌ను అత్యవసర సమయాల్లో వినియోగిస్తారని ఆమె పేర్కొన్నారు. రూ.32 వేల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సలో రోగికి నాలుగు మోతాదుల్లో ఇంజెక్షన్ ఇస్తారని, ఒక్కో మోతాదు ఇంజెక్షన్ రూ.8000 వరకు ధర ఉంటుందని తెలిపారు.

శ్వాసకోశ సంబంధ ఇబ్బంది తలెత్తే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఎడిఆర్‌ఎస్) కలిగిన కరోనా రోగులకు చికిత్సలో ఇది సమర్ధంగా పనిచేసిందని రుజువైందని చెప్పారు. ఈ ఇంజెక్షన్ రోగిలోని వ్యాధినిరోధక శక్తిని క్రమబద్ధీకరించడంతో మొదలై రోగ నిరోధక వ్యవస్థను తిరిగి ప్రారంభింప చేసేందుకు తోడ్పడుతుందని, మళీ ఆ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుందని ఆమె చెప్పారు. ప్రొ ఇన్‌ఫ్లెమేటరీ సైటోకైన్ ల ప్రారంభాన్ని మందగించనీయదని తెలిపారు. ఈ డ్రగ్‌కు సంబంధించి క్యూబా నుంచి ఇరవై ఏళ్ల క్రితమే లైసెన్సు పొందినప్పటికీ ఇది వాస్తవంగా భారతీయ డ్రగ్ అని అనేక పరిశోధనలతో రూపొందించడమైందని ఆమె వివరించారు. భారత్‌లోనే తయారైన ఈ డ్రగ్‌కు భారత్ లోనే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినప్పటికీ అమెరికా కంపెనీకి లైసెన్సు ఇచ్చామని అక్కడ కూడా ట్రయల్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం మీద యాంటీ సిడి 6 యాంటీబాడీ కలిగిన డ్రగ్ ఇంకేదీ లేదని నిర్ధారించారు.

Biocon to launch Itolizumab drug for corona patients

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News