Home తాజా వార్తలు ‘బయో’ మెడికల్ వ్యర్థాలు

‘బయో’ మెడికల్ వ్యర్థాలు

Biomedical-waste

ఏడాది వ్యవధిలోనే రోజుకు అర టన్ను పెరిగిన వైనం
2017లో సగటున ఒక్క రోజుకు 15,719 కిలోలు, 2018లో 16,243 కిలోలు
అధికమవుతున్న స్లైన్, డిస్పోజబుల్ బాటిల్స్
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బయో మెడికల్ వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క ఏడాదిలో రోజుకు సగటున వ్యర్థాలు అర టన్నుకు పైగా పెరగడం గమనార్హం. 2017లో జీవవైద్య వ్యర్థాలు రోజుకు 15,719 కిలోలు కాగా, 2018లో 16,243 కిలోలకు చేరింది. ఈ లెక్కలు స్వయంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తన నివేదికలో వెల్లడించింది. ఇందులో నాలుగు కేటాగిరీలు ఉండగా స్లైన్, డిస్పోజబుల్ బాటిల్స్‌కు చెందిన బ్లూ కేటాగిరీ వ్యర్థాలు విపరీతంగా పెరిగాయి. 2017లో 96 కిలోలు ఉండగా, 2018లో 807 కిలోలకు చేరింది. అంటే 711 కిలోలు అధికం. అలాగే పసుపు రంగు బ్యాగులో ఇన్‌ఫెక్షన్‌తో కూడిన అవయవాలు, శిశువు జన్మించిన తర్వాత తొలగించే బొడ్డు, బ్యాండేజిలు, కాటన్, రక్తంతో తడిన వస్తువులు, తొలగించిన ఇతర అవయావాలను వేరుగా నిక్షిప్తం చేయాలి. ఈ వ్యర్థాలు అధికంగానే పెరిగాయి. 2017లో రోజుకు 9899 కిలోలు ఉండగా, 2018లో 11,035 కిలోలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో అధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోనే ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో ఉన్న బెడ్‌ల సంఖ్య 54,552గా ఉంది. ఈ ఆసుపత్రుల నుంచి వచ్చే బయో మెడికల్ వ్యర్థాలను నాలుగు సాధారణ బయోమెడికల్ వ్యర్థాల చికిత్స కేంద్రాల (సిబిఎండబ్లుటిఎఫ్) ద్వారా రోజువారీగా సేకరించి సురక్షితంగా నిర్మూలిస్తున్నారు. అయినా కొన్నిచోట్ల నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక మిగిలిన 30 జిల్లాల్లో 7 సిబిఎండబ్లుటిఎఫ్‌లు పనిచేస్తున్నాయి.
వ్యర్థాల నిర్వహణ ఇలా
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగు రంగులతో కూడిన బ్యాగుల్లో వ్యర్థాలను నిక్ష్లిప్తం చేయాలి. పసుపు రంగు బ్యాగులో ఇన్‌ఫెక్షన్‌తో కూడిన అవయవాలు, శిశువు జన్మించిన తర్వాత తొలగించే బొడ్డు, బ్యాండేజిలు, కాటన్, రక్తంతో తడిన వస్తువులు, తొలగించిన ఇతర అవయావాలను వేరుగా నిక్షిప్తం చేయాలి. బ్లూకలర్ సంచిలో స్లైన్, డిస్పోజబుల్ బాటిల్స్‌ను వేయాలి. ఫంక్చర్ ప్రూఫ్ కంటైనర్ (పిసిసి) వైట్ కలర్‌లో సూదులు, వినియోగించిన గ్లాస్ సిరంజ్‌లు, బ్లేడులు, వేయాలి. నీలం రంగు బ్యాగులో పగిలిపోయిన అద్దాలు, ల్యాబ్ స్లైడ్స్, గోర్లు, మెటాలిక్ బాడి ఇంప్లాట్స్, కత్తెరలు వేయాలి. వీటిని నిత్యం మెడిక్లిన్ సర్వీస్ సెంటర్‌కు పంపించాలి. 800 డిగ్రీల పైన వేడిలో వీటిని కాల్చేసి, స్టీమ్ ద్వారా కరిగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను చిన్న చిన్నముక్కలుగా చేసి, సెకండ్ క్వాలిటీ ప్లాస్టిక్ పదార్థాలకు విక్రయిస్తుంటారు. వ్యర్థాల వర్గీకరణ ఆధారంగా దగ్ధం చేయడం, పూడ్చిపెట్టడం, ముక్కలు చేయటం, ఆటోక్లేవింగ్, నాశనం చేయటం వంటివి చేస్తారు.
కొన్ని ఆసుపత్రులు నిబంధనల బేఖాతర్
పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గ దర్శకాలు తూచా తప్పకుంగా వ్యర్థాలను వర్గీకరించి విభిన్న సంచుల్లో సేకరించాల్సి ఉండగా అలాంటి పద్ధతులను కొన్ని ఆసుపత్రులు పాటించటం లేదు. కొన్నింటిలో ఒకే సంచిలో అన్నింటినీ కలిపి బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలిస్తున్నారు. బయో వ్యర్థాలను నిర్లక్ష్యంగా ఆరుబయట, చెత్త కుప్పల్లో వేయడం ద్వారా పందులు, కుక్కలు వాటిని తినడం, ఈగలు, దోమలు వాలడం వలన వ్యాధులు సంక్రమించే అవకాశాలు అధికమే. ఈ వ్యర్ధాల కారణంగా హెపటైటిస్ -బి, క్యాన్సర్, అంటు రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్యులే వెల్లడిస్తున్నారు. ల్యాబ్, ఆపరేషన్ గది నుంచి విడుదలయ్యే నీటిని ప్రత్యేకంగా శుద్ధి చేసి బయటికి వదలాల్సి ఉండగా అలాంటి ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ప్రమాదకరమైన వైరస్, బ్యాక్టీరియాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి.

Biomedical waste Increased In Telangana