Home రాష్ట్ర వార్తలు మహిళకు బంధనాలు తెంచుకుంటేనే మంచిరోజులు : ఇవాంకా

మహిళకు బంధనాలు తెంచుకుంటేనే మంచిరోజులు : ఇవాంకా

ivanka

లింగవివక్ష నశిస్తే జిడిపి మరింతగా పరుగులు పెడుతుందని సందేశం 
మూడేళ్లలో పారిశ్రామిక రంగంలో పెరిగిన మహిళల పాత్ర
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులకు ఇబ్బందులు
మహిళా సమానత్వానికి పలు దేశాలు చట్టంలో మార్పులు తేవాలి
గ్లోబల్ సదస్సులో ఇవాంక ట్రంప్
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నా వాణిజ్య వ్యవహారాల్లో అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నారని, ఇంకా భర్తల చాటు భార్యలుగానే ఉంటున్నారని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లింగ వివక్ష చూపకుండా ప్రోత్సాహం అందిస్తే ప్రపంచ జిడిపి కనీసంగా రెండు శాతం పెరుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడేండ్ల కాలంలోనే పారిశ్రామికరంగంలో మహిళల పాత్ర పదిశాతం పెరిగిందని అన్నారు. లక్షసాధనలో మహిళలు మరింత కష్టపడాలని, పట్టుదలతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మహిళ సాధికారతతో కుటుంబం, సమాజం, ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరుకుంటాయని అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో మంగళవారం ప్రారంభమైన గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్2017లో చేసిన కీలక ఉపన్యాసంలో ఇవాంకా పై విధంగా వ్యాఖ్యానించారు. సమ్మిట్‌కు హాజరైన మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ, రేయింబవళ్ళు శ్రమించి ఎన్నో కొత్త ఆవిష్కరణలను సృష్టించారని, రోబోలు, మొబైల్ యాప్‌లను సృష్టించారని, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే స్థాయికి చేరుకున్నారని అన్నారు. సొంతకాళ్ళ మీద నిలబడి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుని మహిళా శక్తిని చాటిచెప్పారని అన్నారు. సుమా రు 1500 మంది ప్రతినిధుల్లో సగం మంది మహిళలే ఉండడం గర్వంగా ఉందని, ‘మహిళ ప్రథమం, అందరికీ సౌభాగ్యం’ అనే ఇతివృత్తం సార్థకమైందని అన్నారు. పురుషాధిక్య సమాజంలో ఒక పారిశ్రామికవేత్తగా మహి ళ రాణించాలంటే ఎంత వివక్ష, ఎన్ని కష్టాలు ఉంటాయో తనకు స్వీయానుభవమని అన్నారు. ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు లక్షసాధనలో పారిశ్రామికవేత్తగా రాణించడం మహిళకు సవాలేనని అన్నారు.
గత పదేళ్ళలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పదిశాతం పెరిగిందని, అమెరికాలో కోటి పది లక్షల మంది ఉన్నారని, కోట్లాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని అన్నారు. అమెరికాలో మహిళలు నిర్వహిస్తున్న వాణిజ్య సంస్థల సంఖ్య 45% పెరిగిందని, ప్రతి పది వాణిజ్య సంస్థల్లో ఎనిమిది మైనారిటీ మహిళలకు చెందినవేనని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తల వాటా దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లని అన్నారు. కొన్ని అవసరాల్లోంచే మహిళలు పారిశ్రామివేత్తలుగా, ఉపాధిని కల్పించేవారిగా ఎదిగారని అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే అది సమాజానికి మాత్రమే కాక మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఊతమిస్తుందని ఇవాంకా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 70% మంది చిన్న మధ్య తరహా మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ ఆర్థిక వనరుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 300 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల కొరత ఉన్నట్లు పేర్కొన్నారు. రుణాలు ఇచ్చే సమయంలో చాలా సంస్థలు పురుషులైతే లాభాలు సృష్టిస్తారని, మహిళలైతే నష్టాలపాలవుతారనే అభిప్రాయంతో ఉన్నట్లు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ తన నివేదికలో పేర్కొనిందని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఈ దిశగా అమెరికా చర్యలు ప్రారంభించిందని, వీటి కొనసాగింపే మహిళా పారిశ్రామికేత్తలకు ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు 500 మిలియన్ డాలర్ల రుణం సమకూర్చడమని గుర్తుచేశారు. మహిళలకు సమానత్వం కల్పించడానికి అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల చట్టాల్లో మార్పులు జరిగినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని నొక్కిచెప్పారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ మహిళలకు సొంతంగా ఆస్థి కలిగి ఉండడానికి, స్వేచ్ఛగా తిరగడానికి అవకాశాలు లేవని, భర్తల అనుమతి లేకుండా నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి లేదని, ఇంటి గడప దాటడానికి, స్వంతంగా ఆర్థిక నిర్ణయం తీసుకోడానికి సాంస్కృతికపరమైన, కుటుంబపరమైన ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అమెరికా కొన్ని సంస్కరణలను అమలుచేస్తూ ప్రపంచవ్యాప్తంగానే విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నదని, జీ 20 సమ్మిట్ సందర్భంగా ప్రపంచబ్యాంకు సహకారంతో ‘ఉయ్ ఫై’ (ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్ ఫైనాన్స్ ఇన్షియేటివ్) అనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణాలు పొందడానికి, సలహాలు పొందడానికి మహిళలకు ఒక వేదికను ఏర్పాటుచేసిందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ద్రవ్య సంస్థల నుంచి సుమారు ఒక బిలియన్ డాలర్ల మేర నిధిని లక్షంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

బిర్యానీకి హైదరాబాద్ పుట్టినిల్లు

గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్ర ప్రభుత్వ కృషిని కూడా ఇవాంకా ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందిన బిర్యానీ పుట్టినిల్లుగా మాత్రమే కాక ముత్యాల నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలను ఒక్కచోటికి చేర్చిందని అన్నారు. యువత గొప్ప సంపద అని వ్యాఖ్యానించారు.

మోడీపై ప్రశంసల జల్లు 

చిన్నతనంలో ఛాయ్ విక్రయించేస్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన మోడీ నాయకత్వంలో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందు తోందని, సుమారు 130 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి దూరం చేశారని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధిస్తుందని ఇవాంక ప్రశంసించారు. ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇప్పుడు ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిచిందని అన్నారు. మహిళకు సాధికారత లభించకుండా మానవాభివృద్ధి పరిపూర్ణం కాదన్న మోడీ మాటలు ప్రశంసనీయమని అన్నారు.