ఢిల్లీ : ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. కోర్టులో చిదంబరం తరపున కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టకు వెళ్లాలని చిదంబరం తరపు న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు. యుపిఎ హయాంలో ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయని సిబిఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఐఎన్ ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్టు సిబిఐ ఆరోపించింది. దీంతో చిదంబరంపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఇప్పటికే పలుమార్లు ఆయన కోర్టు మెట్లెక్కారు. ఇదిలా ఉండగా కేసు విచారణలో భాగంగా చిదంబరం కస్టడీ కోరుతూ సిబిఐ, ఇడి పిటిషన్లు దాఖలు చేశాయి.
Bitter Experience To Chidambaram In Delhi High Court