Friday, April 26, 2024

ప్రతిపక్షాలపై బిజెపి ఎదురుదాడి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చొరవ కారణంగానే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది కనుకనే కొత్త పార్లమెంటు భవనాన్ని ఆయన ప్రారంభించడాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని అధికార బిజెపి గురువారం ఆరోపించింది. కొత్త పార్లమెంటు భవనం భారత దేశ ఆత్మగౌరవానికి చిహ్నమని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అంటూ, గొప్ప మనసుతో ఈ నెల 28న జరిగే దాని ప్రారంభోత్సవ చారిత్రక ఘట్టానికి హాజరు కావాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.‘ రాష్ట్రపతి అంటే మా అందరికీ ఎంతో గౌరవం, ఆమె గురించి కాంగ్రెస్ ఏమనిందో గుర్తు చేసి రాష్ట్రపతి కార్యాలయాన్ని వివాదంలోకి లాగడం నాకు ఇష్టం లేదు.

అయితే భారత ప్రధాని కూడా పార్లమెంటులో ఒక ముఖ్యమైన భాగం. ప్రధానికి కూడా రాజ్యాంగ బాధ్యత ఉంది’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతను సాధించడానికి ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడాన్ని ఒక వేదికగా చేసుకోవద్దని ఆయన ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేస్తూ, అందుకు ఎన్నో అవకాశాలు వారికి ఉన్నాయన్నారు.‘ మొగలులు లాల్‌ఖిల్లాను, జామా మసీదును, హుమయూన్ సమాధిని నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మీనార్‌ను నిర్మించారని వారంటారు. బ్రిటీష్ వాళ్లు నార్త్ బ్లాక్‌ను, సౌత్‌బ్లాక్‌ను వైస్రాయ్ హౌస్‌గా పిలవబడే పార్లమెంటు హౌస్‌ను నిర్మించారు. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లలో మనం ఏం నిర్మించాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత భారతీయులు నిర్మించుకున్న పార్లమెంటు భవనం దేశానికి ఉండకూడదా?’ అని కూడా ఆయన ప్రశ్నించారు.

కొత్త పార్లమెంటు భవనం భారతీయ వాస్తు కళకు గొప్ప ఉదాహరణ అని భారతీయ సంస్కారానికి అనుగుణంగా దాన్ని నిర్మించారని రవిశంకర్ అన్నారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రావాలని ఆయన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రధాని మోడీ చొరవవల్ల్లనే కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది కనుకనే ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయని ఆరోపించారు. కొత్త భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షాలు బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతివారం లక్షలాది మంది సందర్శించే సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కానీ, ఇండియా గేట్ సమీపంలో

నిర్మించిన ప్రపంచస్థాయి వార్ మెమోరియల్‌ను కానీ వారు సందర్శించరని, ఎందుకంటే అవి మోడీ చేత నిర్మించబడ్డాయని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో మాజీ ప్రధానుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించారని ఆయన అంటూ పెద్ద మనసుతో పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రావాలని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News