Home జాతీయ వార్తలు బిజెపి ఆస్తులు రూ. 4,847 కోట్లు… కాంగ్రెస్ కంటే 8 రెట్లు ఎక్కువ

బిజెపి ఆస్తులు రూ. 4,847 కోట్లు… కాంగ్రెస్ కంటే 8 రెట్లు ఎక్కువ

BJP declared assets worth Rs 4847 cr in 2019-20

 

2019-20 ఆర్థిక సంవత్సర ఎడిఆర్ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ మిగతా రాజకీయ పార్టీలన్నిటికన్నా ఏటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిజెపి రూ. 4,847 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించుకున్నట్టు వెల్లడైంది. తరువాతి స్థానంలో ఉన్న బిఎస్‌పి ఆస్తుల విలువ రూ.698.33 కోట్లు కాగా, కాంగ్రెస్ ఆస్తుల విలువ రూ. 588.16 కోట్లుగా పోల్ రీఫార్మ్ అడ్వొకసీ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్ )ప్రకటించింది. కాంగ్రెస్‌తో పోలిస్తే బిజెపి ఆస్తుల విలువ ఏకంగా ఎనిమిది రెట్లకు పైనే ఉండటం గమనార్హం. ఎడిఆర్ విశ్లేషణ ప్రకారం 2019 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ మొత్తం రూ. 6988 .57 కోట్లుగా ఉంది. ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తులు రూ.2,129.38 కోట్లుగా ఉన్నాయి. 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో 95.27 శాతం అంటే రూ.2028,71 కోట్లు 10 ప్రాంతీయ పార్టీలవే అని నివేదిక వివరించింది. ప్రాంతీయ పార్టీల్లో రూ.563.47 కోట్ల (26.46 శాతం )ఆస్తులతో సమాజ్‌వాది పార్టీ మొదటిస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) కి రూ.301.47 కోట్ల వరకు ఆస్తులున్నాయి. అన్నా డిఎంకె రూ. 261.61 కోట్ల ఆస్తులను ప్రకటించింది.

పార్టీల ఆస్తుల్లో ఎక్కువ భాగం అంటే రూ. 1639. 51కోట్ల (76.99 శాతం )వరకు ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో బిజెపికి రూ. 3253 కోట్లు ఉండగా, బిఎస్‌పికి రూ. 618.86 కోట్లు కాంగ్రెస్‌కు రూ. రూ. 240.90 కోట్లు ఉన్నాయి. అలాగే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో సమాజ్‌వాది పార్టీకి రూ. 434.219 కోట్లు, టిఆర్‌ఎస్‌కు రూ. 256.01 కోట్లు, ఎఐడిఎంకెకు రూ.246.90 కోట్లు, డిఎంకెకు రూ. 162.425 కోట్లు, శివసేనకు రూ. 148.46 కోట్లు, బిజెడికి రూ. 118.425 కోట్లు ఉన్నాయి. ఇక 7 జాతీయ, 44 ప్రాంతీయ పార్టీల మొత్తం అప్పులు రూ.134.93 కోట్లుగా ఉన్నాయి. ఇందులో 74.27 కోట్లు జాతీయ పార్టీ అప్పులు కాగా, ఒక్క కాంగ్రెస్ పార్టీనే రూ. 49.55 కోట్ల రుణాలు బాకీ పడినట్టు నివేదిక వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 11.32 కోట్లు , ఎఐటిసికి రూ.11.32 కోట్ల వరకు అప్పులు ఉన్నట్టు పేర్కొంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే అత్యధికంగా తెలుగు దేశం పార్టీకి రూ. 30.34 కోట్లు, డిఎంకెకు రూ. 8.05 కోట్లు రుణాలు ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక తెలియజేసింది.

BJP declared assets worth Rs 4847 cr in 2019-20