Thursday, April 25, 2024

కానరాని కమలం!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession  కేంద్రంలో బిజెపి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నది. 2019 మే లో నరేంద్ర మోడీ ప్రధానిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పదవీ కాలాల్లోనూ మొత్తం దాదాపు ఎనిమిదేళ్ల పాటు నిర్విరామంగా సాగిన ఆయన పాలనపై దేశ ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఏర్పడి వుందో తెలుసుకోడానికి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలను మచ్చులుగా తీసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీల ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాలను చూచి అది ఎదురులేని శక్తిగా కొనసాగుతున్నదని నిర్ధారణకు రావడానికి వీల్లేదు. ఎందుకంటే యుపిలో సర్వశక్తులూ వినియోగించి గాని అది విజయం సాధించలేకపోయింది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకోగలిగింది. పంజాబ్‌లో నామరూపాల్లేకుండాపోయింది. గోవా, మణిపూర్‌లలో దాని బలం సగం వద్ద ఆగిపోయి అతి కష్టంగా అధికారాన్ని నిలుపుకోగలిగింది.

అందుచేత భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటున్నదని చెప్పడానికి గట్టి దాఖలాలు లేవు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం పరమ అధ్వాన స్థితిలో కొనసాగుతూ వుండడం, ప్రాంతీయ పాలక పక్షాలు, ఆర్‌జెడి వంటి ప్రతిపక్షం దేనికది అత్యంత బలంగా వున్నా అవి ఇంకా ఒక కూటమిగా రూపొందకపోడం ప్రస్తుతానికి బిజెపికి మేలు చేస్తున్న అంశాలు. 2024 సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశ ప్రజాభిప్రాయం జాతీయ పాలక పక్షానికి వ్యతిరేకంగా గట్టి పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ సీటుకు తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఎక్కడా కనిపించకపోడం గమనించవలసిన విషయం. ఈ ఉప ఎన్నికలు బీహార్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ లోక్‌సభ స్థానాన్ని బాలీవుడ్ నటుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హా సునాయాసంగా గెలుచుకున్నారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి ఈ లోక్‌సభ స్థానంలో అది గెలవడం ఇదే మొదటిసారి. ఇక్కడ బిజెపి అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ మీద శతృఘ్న సిన్హా 3,03,209 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.

2019 ఎన్నికల్లో ఇక్కడ బిజెపి 1.97 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. ఒకప్పటి పాలక కూటమి సారథి సిపిఐ (ఎం) అభ్యర్థి ఈసారి 90,412 ఓట్లు సంపాదించుకున్నారు. 15,035 ఓట్లతో కాంగ్రెస్ బాగా వెనుకబడింది. పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నిక జరిగిన అసెంబ్లీ స్థానం బాలీగంజ్‌ని కూడా పాలక తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ సిపిఐ(ఎం) అభ్యర్థి మీద టిఎంసి విజయం సాధించింది. బీహార్‌లో ప్రజాభిమానం విశేషంగా చూరగొంటూ తిరుగులేని పార్టీగా రుజువు చేసుకున్న రాష్ట్రీయ జనతాదళ్ అక్కడ ఉప ఎన్నిక జరిగిన ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం బోచహాన్‌ను సొంతం చేసుకున్నది. ఆర్‌జెడి అభ్యర్థి అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 శాతం ఓట్లు సాధించుకున్నారు. బిజెపి అభ్యర్థి రెండో స్థానంలో వచ్చారు. మహారాష్ట్రలో, చత్తీస్‌గఢ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజేత అయింది. ఒక్క ఆర్‌జెడి మినహా ఉప ఎన్నికలు జరిగిన స్థానాలన్నీ అక్కడి పాలక పక్షాల కైవసమయ్యాయి.

ఉప ఎన్నికల్లో సాధారణంగా ఒక మోస్తరు ప్రచారమే జరుగుతుంది. బరిలోని పార్టీలు అరుదుగా తప్ప విజయం కోసం సకల శక్తులు వొడ్డి కృషి చేయవు. అందుచేత ప్రజలు నిర్మలమైన మనసుతో ఓటు వేసే అవకాశాలు ఎక్కువ వుంటాయి. బిజెపి పోటీలో లేకుండా వుంటే వేరు సంగతి. కాని అది ఈ ఉప ఎన్నికల్లో చాలా చోట్ల పోటీ చేసి ఓడిపోయింది. కొంత కాలం క్రితం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ పాలక పక్షమైన బిజెపి చిత్తుగా ఓడిపోయింది. అది దినదిన ప్రవర్ధమానమవుతున్నదని చెప్పుకోడానికి వీలు లేదని ఈ ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. పది పదిహేనేళ్లలో అఖండ భారత్‌ను ఆవిష్కరిస్తామని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవల ప్రకటించి వున్నారు. అంటే బిజెపి అంత వరకు అధికారంలో కొనసాగుతుందని ఆయన ఉద్దేశం అనుకోవాలి. కాని భారత దేశం నరనరాన జీర్ణించుకున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని బలి తీసుకోడం ద్వారా వారు ఆ లక్షాన్ని ఎంత మాత్రం సాధించలేరు. ఇప్పటికే కర్నాటక వంటి రాష్ట్రాల్లో ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన బిజెపి దేశ ప్రజల దృష్టిలో తీవ్రంగా పలచబడిపోయింది. ఇటువంటి విచ్ఛిన్న వ్యూహాలతో అది మరింత దెబ్బ తింటుందే గాని ముందుకు సాగజాలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News