Home జాతీయ వార్తలు మిత్రులకు సమయం లేదు

మిత్రులకు సమయం లేదు

Maharashtra Governor

 

మహా వియ్యమా.. కయ్యమా
ఫైవ్‌స్టార్ హోటల్‌కు చేరిన శివసేన ఎమ్మెల్యేలు
మంత్రివర్గ ఏర్పాటు అధికారం ఉద్ధవ్‌కు
గవర్నర్‌ను కలిసిన బిజెపి బృందం

ముంబై : మహారాష్ట్రలో మంత్రివర్గ స్థాపన తీవ్రస్థాయి ఉత్కంఠకు, పతాక స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ స్థాపనపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని శివసేన ఎమ్మెల్యేలు గురువారం పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేకు ఇచ్చారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం కూడా వెలువరించారు. వెనువెంటనే శివసేన ఎమ్మెల్యేలంతా కూడా థాకరే నివాసానికి సమీపంలోని రంగ్‌శారదా ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలివెళ్లారు. వారు అక్కడే క్యాంపుగా ఉంటారని వెల్లడైంది. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొని ఉండటంతో పార్టీలు మారే సూచనలు ఉన్నాయి. దీనితో ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ స్థాపనకు తుది గడువు ఒకటి రెండు రోజులలోనే ముగుస్తుంది. అప్పటివరకూ ప్రభుత్వ స్థాపనకు అవసరమైన బలాన్ని ఏ పక్షమూ చూపలేకపోతే రాజ్యాంగ సంక్షోభం నెలకొంటుంది.

ముఖ్యమంత్రి పదవి తమకు రెండున్నరేళ్లు కావాలనే తమ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్మూలాపై శివసేన పట్టువీడకుండానే ఉంది. థాకరే నివాసం మాతోశ్రీ గురువారం శివసేన ఎమ్మెల్యేలతో సందడిగా మారింది. ఇక్కడనే ఉద్ధవ్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ జరిపారు. వారికి తగు విధంగా హితబోధలకు దిగారు. తరువాత వారంతా అతి సమీపంలోని హోటల్‌కు తరలివెళ్లారు. శివారులోని బాంద్రాలో ఈ హోటల్ ఉంది. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉండాలి. ఉద్ధవ్‌జీ అన్నింటి గురించి ఆలోచించి తీసుకునే నిర్ణయానికి మనమంతా కట్టుబడి ఉండాలి’ అని పార్టీ ఎమ్మెల్యే సునీల్ ప్రభు తోటి ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. ఇప్పటి భేటీ, ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించడం పలు రాజకీయ సంకేతాలను వెలువరించింది. పార్టీ ఎమ్మెల్యేనుద్ధేశించి ఉద్ధవ్ మాట్లాడారు. ఆయన అధ్యక్షతన ఎమ్మెల్యేలతో సమావేశం గంట సేపు జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే బిజెపి శివసేనల మధ్య అధికారాలు, బాధ్యతల సమాన పంపిణీ నిర్ణయం జరిగిందని, ఇది పూర్తి స్థాయిలో అమలు కావల్సి ఉందని, ఫిఫ్టీఫిఫ్టీ తప్పనిసరి అని ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్లు వెల్లడైంది. ముఖ్యమంత్రి పదవి రెండున్నరేళ్లు బిజెపికి, రెండున్నరేళ్లు తమకు దక్కాల్సిందేనని ఎమ్మెల్యేలు తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేల భేటీ తరువాత ఎమ్మెల్యే శంభూరాజే దేశాయ్ విలేకరులతో మాట్లాడారు. తదుపరి సిఎం శివసేన వారే అవుతారని,ప్రభుత్వ స్థాపనపై ఉద్ధవ్ తుది నిర్ణయం తీసుకుంటారని మరో ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ చెప్పారు.

బిజెపితో తెగతెంపులు కోరుకోవడం లేదు : ఉద్ధవ్
మిత్రపక్షంగా ఉన్న బిజెపితో తెగతెంపులు కోరుకోవడం లేదని, కూటమిని విచ్ఛిన్నం చేయదల్చుకోలేదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని విషయాలను ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య ఆమోదిత అంశాలు అమలు కావాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

గవర్నర్‌ను కలిసిన బిజెపి ప్రతినిధి బృందం
ఫడ్నవిస్ థాకరే మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలోనే గురువారం బిజెపి ప్రతినిధి వర్గం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలుసుకుంది. ప్రభుత్వ స్థాపనకు తాము చేస్తున్న యత్నాలను రాజ్‌భవన్‌లో ఈ బృందం వివరించింది. శుక్రవారం అర్థరాత్రి దాటితే ప్రభుత్వ స్థాపనకు గడువు ముగుస్తుంది. అప్పటికి ప్రభుత్వ స్థాపనకు మార్గం సుగమం కాకపోయినా, శివసేన తమతో కలిసిరాకున్నా తలెత్తే న్యాయ చట్టపరమైన అంశాలపై కూడా మహారాష్ట్ర బిజెపి నేతలు దృష్టి సారించారు. న్యాయ నిపుణులతో చర్చించారు. ప్రతిష్టంభన శుక్రవారంతో ముగిస్తే మంచిదే లేకపోతే ఏం చేయాలనే తపన బిజెపిలో నెలకొంది. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు చంద్రకాంత్ పాటిల్‌తో కూడిన బిజెపి బృందం గవర్నర్‌ను కలిసింది. ఇక ముఖ్యమంత్రి పీఠం చెరి సమాన కాలం అనే తమ డిమాండ్‌ను రాజీబేరంగా భావించరాదని బిజెపికి శివసేన గురువారం సందేశం పంపించింది.

BJP delegation to meet Maharashtra Governor today