Friday, April 19, 2024

పాలించడం చేతకాని బిజెపి!

- Advertisement -
- Advertisement -

BJP does not have capacity to Govern

 

బిజెపికి పరిపాలించడం చేత కాదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అరిచినట్టే అరిచి ప్రజలను మభ్యపెట్టడం మాత్రం నేర్చున్నారు. ఉపన్యాసాలు దంచడంలో, రెచ్చగొట్టడంలో దిట్ట. సమస్యలను పరిష్కరించ కుండా సాగదీస్తుంది. సమస్యలను సృష్టిస్తుంది. సమస్యలు కాని వాటిని సమస్యలుగా ముందుకు తెస్తుంది. సంఘర్షణలకు ఆజ్యం పోస్తుంది. పరిష్కారం కన్నా ప్రచారానికి అర్రులు చాస్తుంది. ఎపుడో స్థాపించిన రైళ్లను, ఇన్సూరెన్స్ కంపెనీని, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నది. 160 దాకా కేంద్ర సంస్థల ఆస్తులు అమ్మేస్తామని ప్రకటించింది. దశాబ్దాల సంపదను 5 ఏళ్ల కోసం అధికారంలోకి వచ్చిన బిజెపి అమ్మేస్తున్నది. సంపద సృష్టించే సామర్థ్యం, అలాంటి ప్రణాళికలు తమకు లేవని, ఉన్నది అమ్ముక తినడమే తమకున్న తెలివని బిజెపి పాలకులు నిరూపించుకుంటున్నారు. పరిపాలన చేతగాక శాంతియుత సహజీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. పార్లమెంటులో మెజారిటీ ఉన్నపుడు చేయవలసిన పనులు చేయడం లేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఊసెత్తడం లేదు. చట్ట సభలలో బిసి రిజర్వేషన్లు అనే మాటే మరిచిపోయింది. విదేశీ ఉత్పత్తులు తగ్గించి స్వావలంబనతో పాటు ఉపాధి కల్పన, సంపద సృష్టికి బదులుగా, వంట నూనెలతో సహా, రక్షణ ఉత్పత్తులను, సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ పరికరాలను దిగుమతి చేసుకుంటున్నది.

బిజెపికి పరిపాలన చేతకాదు ఒకసారి అధికారం ఇస్తే మళ్లీ వచ్చే అవకాశం లేదు అని గతంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ మాట ఎలా పుట్టిందంటే 1967లో ఢిల్లీ విద్యావంతులైన ఓటర్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నాటి జనసంఘ్‌ను ఎన్నుకునారు. వారి పాలన చూసి మళ్లీ ముప్పయ్యేండ్ల దాకా అధికారం అంచులకు రానీయలేదు ప్రజలు. ప్రజలకు మాటలతో కడుపు నిండదు కదా! 1967లో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పోయి సోషలిస్టు పార్టీ, డిఎంకె, సిపిఎం వంటి పార్టీలు అధికారంలోకి రావడం ప్రారంభమైన కాలం. అలా నిలదొక్కుకున్న కాలం. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అనైక్యత వల్ల, జాతీయ దృష్టి లోపించడం వల్ల, తమ సీమకు పరిమితం కావడం వల్ల 1967లోనే ఆగిపోవాల్సిన జాతీయ పార్టీలు పడుతూలేస్తూ కొనసాతూ వస్తున్నాయి. బంగ్లాదేశ్ యుద్ధంతో 1971లో ఒకసారి, ఇందిరా గాంధీ హత్యతో మరోసారి పూర్తి మెజారిటితో ముందుకు సాగింది కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీల పరిమితి, బలహీనతలు అధిగమించి జనతా పార్టీగా 1977లో, జనతాదళ్‌గా 1989లో అధికారంలోకి వచ్చినా పూర్తికాలం పరిపాలన సాగించలేకపోయింది. ఈ బలహీనతలను డి కాంగ్రెస్, బిజెపిలు పుంజుకున్నాయి. ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాల నేర్పరిచాయి.

ఈ అనుభవాలన్నీ ఏమైపోయాయో తెలియదు. కాంగ్రెస్ చతికిలపడిపోయింది. బిజెపి పుంజుకున్నది. అధికారంలోకి వచ్చిన చోటల్లా బిజెపి బిసిలకు, ఎస్‌సిలకు, ఎస్‌టిలకు, మైనారిటీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సమస్యలు, సంఘర్షణలు సృష్టిస్తున్నది. అభివృద్ధి పట్ల దృష్టి సన్నగిల్లింది. వెనక నుంచి ఎవరో నడిపిస్తే నడిచే పరిపాలనగా కొనసాగిస్తున్నది. బిజెపి పరిపాలనలో జాతీయ అభివృద్ధి రేటు పడిపోయింది. అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగ, ఉపాధి కల్పన బొత్తిగా తగ్గిపోయింది. విదేశీ దిగుమతులు పెరిగిపోతున్నాయి. బయట పెట్రోలియం రేట్లు తగ్గితే అందుకు భిన్నంగా రేట్లు పెంచి లీటరు రూ. 100 దాకా తెచ్చారు. మరోవైపు బిజెపి సమర్థవంతమైన ప్రభుత్వమని, బిజెపి శక్తివంతమైనదని ఒక ప్రచారం సాగుతున్నది.

బిజెపికి శక్తి సామర్థ్యాలుంటే పార్లమెంటు సీట్లను అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లాండులవలె ఆ దామాషా ప్రకారం 2700 సీట్లు చేయవచ్చు. మహిళలకు, బిసిలకు సగం సీట్లు ప్రాతినిధ్యం రాజ్యాంగబద్ధం చేయవచ్చు. ఇలా ప్రజల ప్రాతినిధ్యం, మహిళల ప్రాతినిధ్యం పెంచవచ్చు. ఇలాంటి మంచి పనులపై బిజెపికి శ్రద్ధ లేదు, సామర్థ్యం అంతకన్నా లేదు. అయినా బిజెపిది మంచి పాలన అట! మీడియాను మేనేజ్ చేయడం ద్వారా ప్రభుత్వంలో ఉండడం ద్వారా కలిగిన సౌకర్యం ఇది . నిజానికి బిజెపి వారియర్స్, బిజెపి వాట్సాప్ యూనివర్శిటీ కార్యకర్తలు, బిజెపి పుకార్ల యూనివర్శిటీ మేధావులు, ఆర్‌ఎస్‌ఎస్ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మేధావులు, పుర ప్రముఖులు, వారి ప్రచారం ద్వారా దాని బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్టు కనపడుతున్నది.

బిజెపి సమర్థవంతమైన పాలన సాగిస్తున్నట్టు ప్రాచుర్యం చేయబడుతున్నది. ఆచరణలో బిజెపిది ప్రభుత్వం అసమర్థపాలన. బిజెపికి పరిపాలన సామర్థ్యం లేదు. ప్రజల సంపద, ప్రభుత్వ సంపద, ప్రజల ఉపాధి, జీవన ప్రమాణాలు పెంచే సామర్థ్యం లేదు. రకరకాల మూఢ విశ్వాసాలను, మనుధర్మం అవసరం, ఈ రాజ్యాంగం పనికి రాదు వంటి చర్చలను ముందుకు తెస్తున్నది. మనకు మనం ఇటీవల ఆధునిక సమాజానికనువుగా రాసుకున్న రాజ్యాంగం పనికి రానపుడు, శతాబ్దాల నాటి రాజరిక కాలం నాటి మనుస్మృతి ఎలా పనికొస్తుందో! బిజెపికి రాజకీయాలను రాజకీయాలతో ఎన్నికల ప్రణాళికతో కార్యాచరణతో ఎదుర్కొనే దమ్ము లేదు. బిజెపి అడ్వాన్స్ థింకింగ్ లేదు. బిజెపికి సామాజిక న్యాయం, సామాజిక మార్పు, అందరు సమానం అనే దృష్టి లేదు. బిజెపి మత, ధార్మిక ప్రచారం చేసి రెచ్చగొట్టి దొడ్డిదారిన రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. ప్రజల్లోని సాంస్కృతిక, ధార్మిక భావాలను తప్ప ఓట్లు రాబట్టే రాజకీయ ఎన్నికల ప్రణాళిక ఆదర్శవంతంగా, బలంగా ముందుకు తెచ్చిన జాడ లేదు. బిజెపికి ఆ సామర్థ్యం లేదు. రాదు అని తేలి పోయింది. ఎన్నికల్లో ఎలాగోలాగా మత సిద్ధాంతాలతో విద్వేషాలతో ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకుంటున్నారు.

ఇలా ఏదో రీతిలో అధికారంలోకి వచ్చాక సరిగ్గా పరిపాలించలేక తిరిగి మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. అలా ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆధునిక కాలంలో ఆధునిక అడ్వాన్స్ థింకింగ్‌తో సమాజాన్ని ముందుకు నడపలేదని రెచ్చగొట్టడం, దాడులు చేయడం తప్ప మరొకటి చేతకాదని నిరూపించుకున్నారు. ఎవరైనా తండ్రి సంపాదించిన ఆస్తిని మరింత పెంచుతారు. ధీరుబాయి అంబానీ సంపాదించిన ఆస్తిని ఎలా పెంచాలో ముఖేష్ అంబానీ నేర్చుకున్నారు. గౌతం అదానీ నేర్చుకున్నారు.

టాటాలు నేర్చుకున్నారు, బిర్లాలు నేర్చుకున్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు 11 కోట్లు ఇపుడు లక్షల కోట్లకు ఎదిగారు. 13 కోట్ల టాటాలు లక్షల కోట్లుకు పెరిగారు, అసలు అప్పుడు ఏమిలేని ధీరు బాయి లాంటి వాళ్లు, ఇన్ఫోసిస్, విప్రో అజీమ్ ప్రేమ్‌జీ లాంటివాళ్ళు లక్షల కోట్లకు పెరిగారు. అలాగే 1947 నాటికి అసలు ఏమి లేని దశ నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్‌లు అనేక పరిశ్రమలు పెట్టి ప్రజల సంపదను ఎన్నో రెట్లు పెంచింది. ప్రభుత్వం యాజమాన్యంలో లక్షల కోట్ల ఆస్తులను కూడా పెట్టింది. కోట్లాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది.

ఆరోగ్య పథకాలు పెట్టింది విద్య అందించింది. అలా పంచవర్ష ప్రణాళికలు ఎన్నో ముందుకు సాగాయి. ప్రభుత్వ సంపద ప్రజల సంపద పెరుగుతూ వచ్చింది. ఇది కాంగ్రెస్ పరిపాలన. ఆ తర్వాత ముందుకు సాగిన ప్రభుత్వం పదేళ్లు మైనారిటీ ప్రభుత్వంగా అందరినీ కలుపుకొని యుపిఎ ప్రభుత్వంగా కొనసాగింది. ఎవరిని ఏమీ అనలేక ఆ మైనారిటీ ప్రభుత్వాలు అవినీతికి నిలయమైనాయి. అలా 142 సీట్లు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయాయి. ఆ తర్వాత బిజెపి ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వచ్చింది. పూర్తి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. కానీ సంపద పెంచే బదులు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నది. అన్నీ అమ్ముకునే ప్రభుత్వంగా, అన్నిటినీ అమ్మే ప్రభుత్వంగా, అసమర్థ ప్రభుత్వంగా నిరూపించుకుంది. తాను సంపాదించలేకపోగా ఉన్న ఆస్తులను అమ్ముకునే కొడుకులుగా మారిపోయారు బిజెపి నాయకులు. తెలంగాణ అభివృద్ధి రేటు పైకి, బిజెపి అభివృద్ధి రేటు కిందికి! తెలంగాణ అభివద్ధి రేటు 21- 17 దాకా ఉండగా, బిజెపి హయాంలో జాతీయ అభివృద్ధి రేటు పూర్తిగా మందగించింది. పెద్దనోట్ల రద్దు చేసి బ్లాక్ మార్కెట్ వారి వైట్ మార్కెట్‌గా మార్చింది.

క్లోని క్యాపిటల్ తో ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఆస్తులను అగ్గువకు కొనేస్తున్నారు. వారి వెనుక ఉన్నది కూడా బిజెపి నాయకులే అని మరిచిపోరాదు. ఉన్న ఆస్తులు అమ్ముకునే కుటుంబాలు వ్యాపారాలను ఏమంటారు? దివాలా తీసారంటారు. ప్రభుత్వమే ఆ పని చేస్తే పరిపాలన చేతగాక ప్రభుత్వాలు దివాలా తీసినట్లు లెక్క . బిజెపి ప్రభుత్వాలు దేశాన్ని దివాలా తీయిస్తున్నాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పరివారానికి దేశాన్ని పరిపాలించడం చేతగాక ఇతరులకు ఒకటొకటిగా అప్పగిస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా విదేశీ శక్తులకు అప్పగిస్తున్నది. ఈ అసమర్థత తెలియకుండా ఉండటం కోసం గోవులు, ఆవులు ముస్లింలు, పౌరసత్వం, రాముడు, కృష్ణుడు అయోధ్య వంటి చిచ్చురేపి కాలం గడుపుతున్నది.

అసలు సమస్య సంపద పెంపు, ఉపాధి కల్పన, సహజ వనరుల రక్షణ, మానవ వనరుల నైపుణ్యాలు, సహజ సంపద ఫలాలు నీరు, లోహాలు, ఖనిజాలు, బొగ్గు, నదులు, అడవులు, గనులు, భూమి అందరికీ అందాలి. వీటిని ఇంత దాక ప్రభుత్వాలు తమ అదుపులో తీసుకుని ఉపాధి అవకాశాలు పెంచాయి. సంపద ప్రభుత్వ పరం చేయబడింది. తద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తరించారు. వీటిని కొందరికి లాభాలు సంపాదించుకొమ్మని, వ్యాపారం చేసుకొమ్మని, ఏమైనా చేసుకొమ్మని అమ్మేస్తున్నది. ప్రభుత్వం ప్రభుత్వంలా కాకుండా వ్యాపార సంస్థగా వ్యవహరిస్తూ ప్రజలకు బాధ్యత , భరోసా వదిలేస్తున్నది. సహజ సంపదలు ప్రజల కోసం ప్రభుత్వం వద్ద ఉండవచ్చు గాని, ఇతరులకు అమ్మేస్తే అది దేశాన్ని అమ్మేయడమే. బిజెపి ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నది. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని గత 75 ఏళ్లుగా మనం ఎన్నడూ చూసి ఉండం. ఇంతగా దిగజారిపోయిన అసమర్థ పాలన, అవినీతి పాలన, దివాలా ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News