Home ఎడిటోరియల్ గుజరాత్‌లో బిజెపి ఎదురీత?

గుజరాత్‌లో బిజెపి ఎదురీత?

bjp

భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి ఈ డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదు రు గాలి వీస్తోంది. అక్కడ గెలుపు తథ్యమని, 150 దాకా సీట్లు గెలుస్తామని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో జనాగఢ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రకటించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ లక్షం నెరవేరడం అంత సులభం కాదని ఆ పార్టీకి తెలిసివస్తోంది. ఇటీవల ప్రతిరోజూ రాజకీయ ఆటుపోట్లు చవిచూస్తున్న గుజరాత్‌ను బిజెపి రెండు దశాబ్దాలపాటు పాలిస్తూ వస్తోంది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా దాటడం సునాయాసం కాని పరిస్థితులు ఆ పార్టీకి అక్కడ ఎదురవుతున్నాయి. ఒక జాతీయ టివి చానెల్ ఇంటర్వూలో ఈ నెల దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ, పటీదార్ అనామత్ ఆందోళన సమితి(పాస్) నాయకుడు హార్దిక్ పటేల్, ఒబిసి నాయకుడు అల్పేశ్ ఠాకూర్ తొలిసారిగా కలిసి కనిపించారు. మితవాద వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పరుస్తున్నట్లు ఆ సందర్భంగా వారు ప్రకటించారు. తాము ముగ్గురం కలిస్తే మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో 120చోట్ల ఫలితాలను మార్చగలుగుతామని జిగ్నేశ్ ప్రకటించారు. జిగ్నేశ్ తాను ఏ పార్టీలో చేరేది లేదని ప్రకటించారు.
దళిత్, ఒబిసి, పటీదార్ కులసమీకరణలపై ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో హార్దిక్ పటేల్ కీలక అనుయాయులు రేష్మా పటేల్, వరుణ్ పటేల్ పాస్‌ను వీడి ఈ నెల 21న బిజెపిలో చేరిపోయారు. ఇంతవరకు వారిద్దరూ పాస్‌లో ప్రముఖులుగా వెలిగిన నేతలు. మెహసనలో గత జూలైలో ఒక బహిరంగ సభలో జిగ్నేశ్, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌లతో రేష్మా పటేల్ వేదిక పంచుకొన్నారు. ఇతర కార్యకర్తలతోపాటు రేష్మాను కూడా అప్పుడు నిర్బంధంలోకి తీసుకొన్నారు. ఈ నెల 23న అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత వారిద్దరూ బిజెపిలో చేరుతున్నట్లు వార్త వెలువడింది.
పటీదార్ల ఓట్లపై ఆశలు
అది జరిగిన కొన్ని గంటలకు ఉత్తర గుజరాత్‌కు చెందిన సీనియర్ పటీదార్ నాయకుడు నరేంద్ర పటేల్ బిజెపిని వీడారు. ఆయన పాస్ కన్వీనర్‌గా ఉంటూ బిజెపిలో చేరారు. కానీ ఆ పార్టీ తనకు కోటి రూపాయలు ఇవ్వజూపిందని విలేకరుల గోష్టిలో నరేంద్ర ఆరోపించారు. డబ్బులు కట్టలు కూడా చూపారు. తాను వారి బండారం బయటపెట్టడానికే ఆ పార్టీలో చేరినట్లు నాటకం ఆడానని కూడా చెప్పారు. రేష్మా పటేల్, వరుణ్ పటేల్ ఎన్నికల ముందు తమ పార్టీలో చేరడం తో పటీదార్ల ఆధిపత్యంలోని ప్రాంతంలో ఫలితాలు అనుకూలంగా వస్తాయని, ఆ విధంగా తమకు నష్టం తగ్గుతుందని బిజెపి ఆశిస్తున్నట్లు కూడా నరేంద్ర పటేల్ తెలిపారు.

నరేంద్ర ప్రకటనను గుజరాత్ బిజెపి అధికార ప్రతినిధి భారత్ పాండ్యా తోసిపుచ్చారు. అయితే పార్టీ ఈ దిగ్భ్రాంతికర పరిణామం నుంచి బయటపడేలోగానే మరో పిడుగుపాటుకు గురయింది. సూరత్‌లో పటీదార్ ఆందోళన కీలక నేత అనదగ్గ నిఖిల్ శివానీ బిజెపిని వీడారు. ఆయన సెప్టెంబర్ 26న పాస్ మాజీ సభ్యులు 150 మందితో కలిసి బిజెపిలో చేరారు. నెల కాకుండానే ఇప్పుడు ఆ పార్టీని వీడారు. పాస్ నుంచి కొందరు సభ్యులు ఫిరాయించడంపై హార్దిక్ పటేల్ ‘కొన్ని కాళ్లు విరిగిపోయినా జెర్రి పాకుతూనే ఉంటుంది. ప్రజలు నాతో ఉన్నారు. వారి కోసం పోరాటం సాగిస్తూనే ఉంటాను’ అని ట్వీట్ చేశారు. వెంటనే ఆయన ఈ నెల 22, 31న అహ్మదాబాద్, బావ్‌నగర్, మోర్బీ, వడోదరా, జామ్‌నగర్, అమ్రేలి జిల్లాల్లో వరుస వెంబడి సభల ఏర్పాటు ప్రకటన చేశారు.
మోడీకి ఎదురయిన ఆశ కార్యకర్తల ఆగ్రహం
ఈ ఉద్విగ్న భరిత రాజకీయ పరిణామాల మధ్య ప్రధాని మోడీ ఈ నెలలో మూడవసారి 23న గుజరాత్‌ను సందర్శించారు. ఆయన వడోదరా రోడ్ షోలో వీధులు జనం లేక వెలవెలబోయాయి. అంతేకాకుండా ఆయన ప్రభుత్వ గుర్తింపుగల సామాజిక ఆరోగ్య కార్యకర్తల ఆశ వర్కర్ల ఆగ్రహం కూడా చవిచూడవలసి వచ్చింది. కొన్ని నెలలుగా వారు స్థిరమైన జీతం కోసం వడోదరాలో ఆందోళన చేస్తున్నారు. పోరాట కమిటీ అధ్యక్షురాలు చంద్రికా సోలంకీ మోడీ వాహనాల బారుపై అర డజను గాజులు విసిరారు. దీనితో ఆమెను, మరి 200మంది ఆశ కార్యకర్తలను మోడీ నగరం విడిచి వెళ్లేదాకా నిర్బంధంలో ఉంచారు.
తాము నిరాహార దీక్ష కూడా చేస్తున్నామని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆ ఘటన తర్వాత సోలంకీ మీడియాకు తెలిపారు. ఈ నెల 10న ఆశ కార్యకర్తలు కర్జన్‌లో బిజెపి ఎంఎల్‌ఎ సతీష్ పటేల్‌ను ఘెరావ్ చేశారు.
కారు వద్దకు ఆయనను వెంటపడి తరిమారు. అదేరోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ రెండో విడత ప్రచార పర్యటనలో భాగంగా కర్జన్ వచ్చారు. ఆయన ఆ తర్వాత ఆశ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అహ్మదాబాద్‌లోని ప్రముఖ రాజకీయ పరిశీలకుడు అచ్యుత్ యాగ్నిక్ ఆ రాష్ట్రంలో నెలకొన్న వాతావరణాన్ని వివరించారు.
యువజనం నిస్పృహ
‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా 35ఏళ్లు, ఆపైబడ్డ వయస్సు యువ జనాభా ఆశలు ఆరిపోయి ఆందోళనతో ఉన్నా రు. హామీ ఇచ్చిన ఉద్యోగాలు రాలేదు. నోట్లరద్దు, జిఎస్‌టి అమలులో అపసవ్యతవల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చతికిలపడ్డాయి. దానికి వ్యవసాయ సంక్షోభం కూడా తోడయింది’ అని యాగ్నిక్ పరిస్థితిని వివరించారు.
‘గుజరాత్ జనాభాలో దళితులు 7 శాతంమంది. తూర్పు అహ్మదాబాద్, సురేంద్రనగర్ ప్రాంతాలు వారి పట్టులోనే ఉన్నాయి. పటీదార్లు జనాభాలో 13 శాతం దాకా ఉన్నారు. వారు ఉత్తర, దక్షిణ గుజరాత్‌లలో ప్రభావం చూపగలరు. ఒబిసి జనాభాలో సగం మంది ఠాకూర్లు. ఉత్తర గుజరాత్‌లో అధికంగా ఉన్నారు. అక్కడ పోలింగ్‌ను అల్పేశ్ ఠాకూర్ ప్రభావితం చేయవచ్చు. తూర్పు గుజరాత్ ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నారు. వారు జనాభాలో 15 శాతం. గిరిజనులను దువ్వడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే తూర్పు గుజరాత్ దానికి అంత గా బలంలేని ప్రాంతం. ప్రస్తుత పరిస్థితిని మదింపు వేస్తే బిజెపి, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయన్నది నిజం. బిజెపి కేవలం 80లోపు సీట్లకు పరిమితం కావచ్చు అని యాగ్నిక్ వివరించారు.
అల్పేశ్ ఠాకూర్ ఒబిసి నాయకునిగా పేరొందారు. 2016లో ఉత్తర గుజరాత్‌లో మద్యం వ్యతిరేక ఆందోళనకు సారథ్యం వహించి మంచి గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు ఖోడాభాయ్ కుమారుడు 40 ఏళ్ల ఆ ఒబిసి నేత. ఆయన అహ్మదాబాద్ జిల్లా మండల్ తాలూకా ఎండ్ల గ్రామానికి చెందిన వారు. ఆరేళ్ల క్రితం ఆయన ‘క్షత్రియ ఠాకూర్ సేన’ను స్థాపించారు. ఇప్పుడు దానికి 7 లక్షలమంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత ‘ఒబిసి, ఎస్‌టి, ఎస్‌సి ఏక్తా మంచ్ (ఒఎస్‌ఎస్)’ను నెలకొల్పారు. తన గొడుగు కింద గుజరాత్ ఓటర్లలో 70శాతం మంది దాకా ఉన్నట్లు ఆయన చెబుతారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నెల 23న గాంధీనగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇది ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అపారమైన స్థైర్యాన్ని ఇచ్చిన పరిణామం. ఉత్తర గుజరాత్‌లోని సబర్కాంతా (3 అసెంబ్లీ సీట్లు), బనస్కాంతా (9 సీట్లు), ఖేడా (7 సీట్లు), మెహసనా (7సీట్లు), ఆనంద్ (7సీట్లు), పటాన్ (4 సీట్లు), గాంధీనగర్ (5 సీట్లు), ఆరవల్లి (3 సీట్లు) జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఠాకూర్ చేరిక లాభిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గెలుపు వ్యక్తిగతంగా మోడీకి, పార్టీపరంగా బిజెపికి ఎంతో కీలకం. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆ రాష్ట్రం నాయకుడే. 150కి పైగా సీట్లు గెలుస్తామని షా కొన్ని నెలలక్రితం ప్రకటించిన నేపథ్యంలో ఆ మాట నిజమవుతుందా లేదా అన్నది ఈ డిసెంబర్‌లో తేలిపోతుంది.
    * దమయంతీ ధర్