Home జాతీయ వార్తలు మా దారి దేశ ప్రగతికి రాదారి

మా దారి దేశ ప్రగతికి రాదారి

మోడీపై కాంగ్రెస్ విమర్శ

Modi

న్యూఢిల్లీ : రైతులను ఆదుకుంటున్నామని ప్రధాని గొప్పలకు దిగిన సమయంలోనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది. జాతీయ రహదారుల నిర్మాణం పేరిట జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ అభివృద్ధి చెందిందని అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ విమర్శించింది. చెరకు రైతులకు మేలు చేస్తామని ప్రధాని సభలో చెపుతున్న సమయంలోనే అక్కడికి సమీపంలోనే పొలంలో ఒక చెరకు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాంగ్రెస్ ప్రతినిధి శశికాంత్ గోహిల్ విలేకరులకు తెలిపారు. తనకు అందాల్సిన చెరకు బకాయిలు అందకపోవడంతో రైతు బలవన్మరణం చెందాడని, ఇంతకంటే దారుణం మరోటి ఉందా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని మోడీ తరచూ తమ ప్రభుత్వం ఎంతో సాధించిందని చెపుతూ వస్తుంటారని అయితే అది నిజం కాదనే విషయం ఇప్పుడు ఆయన సభకు దరిదాపుల్లో జరిగిన ఘటనతో వెల్లడైందని తెలిపారు. చెరకు రైతులకు బకాయిలు ఇప్పటికీ అందలేదని ప్రస్తుతం రూ 12 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, అయితే రైతులకు మేలు చేస్తున్నట్లు ప్రధాని ప్రగాల్బాలకు దిగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.   

ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంలో మోడీ

భాగ్‌పట్: అన్ని రంగాలలోనూ మౌలిక నిర్మాణ వ్యవస్థకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. రహదారుల అనుసంధానానికి ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే (ఇపిఎ)ను జాతికిఅంకితం చేసిన సందర్భంగా ఏర్పాటయిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ రహదారి నిర్మాణానికి రూ 11,000 కోట్ల వ్యయం అయింది. దేశ రవాణా వ్యవస్థకు తగు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రధాని తెలిపారు. ప్రధాని మోడీ ఆదివారమే ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే తొలిదశను కూడా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ 3 లక్షల కోట్ల వ్యయంతో 28,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. ప్రస్తుత ఎక్స్‌ప్రెస్‌వే 135 కిలోమీటర్ల మేర రహదారుల సౌకర్యం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ ఇతర ప్రాం తాల ప్రయాణికులకు ఈ మార్గం ఉపకరిస్తుంది. ప్రభు త్వం హైవేలు, రైల్వేలు, విమానమార్గాలు, అంతర్గత రహదారులపై దృష్టి సారిస్తుందని, వీటిని తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రధాని వెల్లడించారు.

కాంగ్రెస్ హయాంలో హైవే నిర్మాణం కేవలం రోజుకు 12 కిలోమీటర్లుగా ఉండేదని, అయితే రోజుకు 27 కిలోమీటర్ల స్థాయికి చేరిందని, ప్రస్తుత ఎక్స్‌ప్రెస్ వే రికార్డు స్థాయిలో కేవలం 500 రోజులలోనే (17 నెలల్లో)పూర్తయిందని ప్రధాని తెలిపారు. భారత్‌మాలా నిర్మాణం తమ ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్షం అని, హైవేల అనుసంధానంతో ఉండే ఈ ప్రాజెక్టు కోసం రూ 5 లక్షల కోట్లు కేటాయించినట్లు వివరించారు. వ్యవసాయ సంబంధిత మౌలిక వ్యవస్థ కోసం బడ్జెట్‌లో రూ 14 లక్షల కోట్లను ఖరారు చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో చెరకు రైతుల సమస్యను పరోక్షంగా ప్రధాని ఈ సభలో ప్రస్తావించారు. చెరకు రైతుల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంటుందని, వారి పం టకు తగు గిట్టుబాటు ధరలు వచ్చేలా చేస్తామని తెలిపారు.

సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, దళితుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటుందని, ఇందుకు ప్రత్యేకంగా ప్రత్యేక కోర్టులను ఏర్పా టు చేసి, శీఘ్రగతిన విచారణ జరిగేలా చేస్తామని తెలిపారు. ఈ సభ నుంచే ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 70 ఏళ్లుగా అధికారంలో ఉండి ప్రజలను మోసం చేసిన వారు, అధికారం పోయిన తరువాత ప్రజలలో అయోమయం సృష్టించేందుకు, వారి విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. చివరికి ఇవిఎంలు మొదలుకుని అన్ని విషయాలలో వారి సణుగుడు ఎక్కువైందన్నారు. సభలో కేంద్ర రవాణా, హై వేల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ రాదారితో ఢిల్లీ ఇతర ప్రాంతాలలో కనీసం 27శాతం మేర కాలు ష్యం తగ్గుతుందని, 41 శాతం ట్రాఫిక్ రద్దీ నివారణకు వీలేర్పడుతుందని తెలిపారు. ఢిల్లీమీరట్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి స్థాయిలో వచ్చే మార్చి నాటికి సిద్ధం అవుతుందని అప్పటికి ఢిల్లీ మీరట్ మధ్య ఇప్పుడున్న రెండున్నర గంటల ప్రయాణ కాలం కేవలం 40 నిమిషాలకు చేరుతుందని వివరించారు.

ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి సైకిల్ వాలాల రూట్లు  రహదారి వెంబడి భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే డిజైన్ల రూపకల్పన . రాదారికి ఇరువైపులా రెండున్నర మీటర్ల మేర సైకిల్ వాలాలు వెళ్లేందుకు దారి ఏర్పాటు. వర్షపు నీరు నిలిచిపోకుండా ఏర్పాట్లు, ఈ నీరు పక్కన పొలాలకు వెళ్లే విధంగా పైప్‌లైన్లు. దారి పొడవునా చెట్ల పెంపకం, బిందు సేద్యం ద్వారా ఏర్పాట్లు. సౌర విద్యుత్‌తో విద్యుత్ దీపాలు. ఈ రాదారిపై 3 ఫ్లై ఓవర్స్, నాలుగు పెద్ద వంతెనలు, 46 చిన్న బ్రిడ్జిటు ఉన్నా యి. 7 ఇంటర్‌ఛేంజ్ దారులు, 111కల్వర్టులు ఉన్నాయి.