Home ఎడిటోరియల్ కదంతొక్కిన కమలం…

కదంతొక్కిన కమలం…

 Lok Sabha Elections

 

కమల భారతం కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది. కలా, నిజమా అనిపించేలా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం 17వ లోక్‌సభ ఎన్నికల క్షేత్రాన్ని కలయ దున్నేశారు. కాషాయ పంటను విరగ పండించారు. దేశమంతటినీ పద్మాల సరోవరం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో సాధించుకున్న దానితో పోలిస్తే భారతీయ జనతా పార్టీకిది అంతకు మించిన అమోఘ విజయం. గెలుచుకున్న స్థానాల పరంగానే కాదు, ఐదేళ్ల పాటు అత్యంత వివాదాస్పద పాలనను అందించిన తర్వాత కూడా గతం కంటే ఎంతో ఇంపైన విజయాలు కైవసం చేసుకోడం ఈ ఇద్దరి అసాధారణ ఘనత అని అంగీకరించక తప్పదు. ప్రధాని మోడీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు జన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించి చెప్పనక్కర లేదు.

ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అడ్డదిడ్డపు అమలు ప్రజలను అమితంగా బాధించాయి. గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీల మీద సాగిన దాడులు మోడీ ప్రభుత్వాన్ని దేశానికి సామాజిక ప్రమాదంగా జాతి సమైక్యతకు, సమగ్రతకు ముప్పుగా నిలబెట్టాయి. కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగిపోయిన నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి మరెన్నో ప్రతికూలాంశాల వ్యతిరేక ప్రభావాన్ని మచ్చుకైనా కానరానీయకుండా లోక్‌సభలో స్వయంగా స్పష్టమైన మెజారిటీని సాధించుకొని భారతీయ జనతా పార్టీ మరోసారి తడాఖా చూపించడం మాటలు కాదు. ఇది నిజంగానే దిగ్విజయ దుందుభి.

ఈసారి తప్పని సరిగా దెబ్బతింటుందనుకున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా బిజెపి మళ్లీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది. జంట మల్లయోధుల్లా కలిసి ఎదుర్కొన్న బిఎస్‌పి, ఎస్‌పిలను పరిమిత విజయాల వద్దనే నిలువరించగలగడం ఆశ్చర్యకరమైన రాజకీయ పాటవ ప్రదర్శన. అలాగే బీహార్‌లోనూ బిజెపి ఎదురులేని విజేత కాగలిగింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలనూ కైవసం చేసుకున్నది. గత ఏడాది ద్వితీయార్థంలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో సైతం కమల నాథులు తిరుగులేని విజయాలను మూటగట్టుకోడం అసాధారణం. కాంగ్రెస్ జెడి(ఎస్) ల సంయుక్త కంచుకోటగా నిరూపించుకొన్న కర్ణాటకలోనూ బిజెపి తిరిగి గెలుపు జెండా ఎగిరేసి ఆ రెండు పార్టీలను అడ్రస్ లేకుండా చేయగలిగింది. నేరుగా ప్రధాని మోడీతోనే ఢీ కొట్టి ఖబడ్దార్ అని సవాలు చేసిన దీదీ మమతా బెనర్జీ కంచుకోట అనిపించుకొన్న బెంగాల్‌లో బిజెపి ఎకాఎకీ సగం స్థానాలు గెలుచుకోడం ఔరా! అనిపించింది.

కమ్యూనిస్టులొకప్పుడు అప్రతిహతంగా పాలించిన బెంగాల్‌లో ఈ స్థాయి లో హిందుత్వ విజయ భేరీని మోగించడాన్ని ఏమనాలి? తమిళనాడు, కేరళ, ఎపి, ఒడిశా, పంజాబ్, తెలంగాణలలోనే బిజెపి పైచేయి నిరూపించుకోలేకపోయింది. మహారాష్ట్రలో నిత్యం దాయాది కయ్యాలతో విసుగెత్తించిన శివసేనను ముందుగానే పొత్తులో బంధించి అక్కడ దానితోపాటుగా బిజెపి కూడా ఘన విజయాలు కైవసం చేసుకున్నది. లెక్కలేనన్ని వైఫల్యాల జాబితాను జేబులో పెట్టుకున్న నరేంద్ర మోడీని ‘నీవు తప్ప …’ అంటూ దేశ ప్రజలు మరోసారి ఇంతగా నెత్తిన పెట్టుకోడానికి భారతీయ జనతా పార్టీకున్న నిర్మాణపరమైన బలం, ఆర్‌ఎస్‌ఎస్ దన్ను, ఏడు దశల పోలింగ్ ఘట్టాల పొడుగునా మోడీ షా ప్రయోగించిన వ్యూహాత్మక పాచికలు బలమైన కారణాలు కాగా, ప్రతిపక్ష శిబిరం ఛిన్నాభిన్నమై చెల్లాచెదురై ఉండడం మరో గట్టి హేతువు.

మాయావతి, మమతా బెనర్జీ ఎవరికి వారు ప్రధాని పదవిపై దృష్టి కేంద్రీకరించి కాలం గడిపారే గాని సాటిలేని మేటి మహిళా నేతలుగా దేశమంతటా తిరిగి బిజెపి వ్యతిరేక ఓటును సంఘటిత పరిచే కృషిని చేపట్టలేకపోయారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్ పార్టీ గతంలో దశాబ్దాల తరబడి తాననుభవించిన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని తిరిగి సాధించుకోవాలన్న అవాస్తవిక స్వప్నాలతో సరిపుచ్చుకొని జాతీయ స్థాయిలో బిజెపిని గట్టిగా ప్రతిఘటించగల ఐక్య ప్రతిపక్ష కూటమిని రూపొందించడం వైపు దృష్టి సారించలేదు, కాంగ్రెస్‌కు 17 రాష్ట్రాలలో ఒక్క సీటూ రాలేదంటే దాని పరాభవ పాతాళం ఎంత లోతైనదో అర్థం కాకమానదు.

ఈ ఘనాతిఘన విజయ సాధన సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఎంతైనా అభినందించాలి. అదే సమయంలో గత ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామిక వ్యవస్థలకు, నీతికి అది పట్టించిన చెదలను దానికి గుర్తు చేయడం అవసరం. చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్ స్వాతంత్య్రాన్ని కూడా కబళించిందనే అపఖ్యాతిని మోడీ ప్రభుత్వం మూటగట్టుకొన్నది. ప్రజాస్వామిక క్రీడ అయిన ఎన్నికలలో మచ్చలేని విజయాలను సాధించుకుంటూ పోవాలంటే దానికి ఆలంబనగా ఉండే వ్యవస్థల ఉనికిని చెక్కుచెదరకుండా కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది. దీనిని రాబోయే ఐదేళ్ల పాలనలో బిజెపి గుర్తుంచుకుంటుందని ఆశిద్దాం.

BJP Grand Victory in Lok Sabha Elections