Saturday, April 20, 2024

రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు

- Advertisement -
- Advertisement -

BJP

 

రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు
సన్నాహక సమావేశాల నిర్వహణ
ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..!

మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి నుంచే పార్టీని పటిష్ట పర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తాను అధ్యక్ష రేసులో లేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇటీవలే స్పష ్టపర్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని సమర్థవంతంగా నడిపే నేత ఎవరు? అన్నదానిపైనే అధిష్టానం కసరత్తులు ప్రారంభించింది. ప్రజల్లో నానే వ్యక్తులు, ప్రజా బలం గల నేతలు పార్టీలో ఎవరు ఉన్నారు? అనే దానిపై అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలను సైతం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో షురూ చేసింది. బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లు అధ్యక్ష పదవి దక్కించు కునేందుకు శ్రమటోడుస్తున్నారు. ఇంకా పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కొనసాగిస్తున్నారు.

పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం అనిల్‌జైన్, జయంత్‌పాండేలను తన దూతలుగా పంపించింది. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులుగా ఎవ రయితే పార్టీ విజయావకాశాలు మెండుగా ఉంటాయో తెలుసుకోమని అధిష్టానం వారికి సూచించింది. దీంతో తెలంగాణలోని ఆ పార్టీ అగ్రనేతలు ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయా బాపూరావ్‌లతో పాటు మొత్తంగా ౩౦ మంది నేతల అభిప్రాయాలను అనిల్‌జైన్ బృందం సోమవారం సేకరించింది. ఆ వివరాలను అధిష్టానంకు వివరించనుంది. దీంతో త్వరలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడి నియామకం జరిగే ఛాన్స్ ఉంది. కాగా, ఆ బృందం ఆయా నాయకులకు ప్రజాబలం ఏ మేర ఉందన్నదానిపై అంతర్గత ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తి పార్టీని విజయం దిశగా నడిపించే వ్యక్తి కావాలన్నది అదిష్టానం యోచన.

జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా?
కాగా బిజెపి అధిష్టానం ఈ స్థాయిలో దూకుడు వెనుక వున్న మర్మం ఏమిటి? అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. ఒకవేళ జమిలి ఎన్నికలకు కేంద్రం సన్నద్ధమవుతోందా? అన్న అనుమానాలు లేకపోలేదు. బిజెపి అధిష్టానం పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ అంతిమంగా ఆయా నేతలలో ప్రజాబలం శాతం ఎవరి వైపు ఎక్కువగా ఉందన్నదానిపై బేరీజు వేసుకుని వారికే బిజెపి రథసారథిగా బాధ్యతలు అప్పగించే అవకాశం మెండుగా ఉంది. కాంగ్రెస్‌లో మంచి వక్తగా దూకుడుగా రాజకీయాలు నెరపిన డీకే అరుణ బిజెపిలో జాయిన్ అయిన దగ్గర్నించీ పార్టీ కార్యక్రమాలలో తనదైన శైలిలో దూసుకుపోయేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చారు.

ఈ మధ్య కాలంలో ఆమె దూకుడు కొంత తగ్గినట్లు అన్పించినా డీకే అరుణ సైతం బిజెపి అధ్యక్ష రేసులో ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు సొంత పార్టీలోకి వచ్చేసిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం బరిలో వున్నానని చెబుతున్నప్పటికీ రాజ్యసభపైనే నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బిజెపి అధ్యక్ష రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, డికె అరుణల పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సమర్థనేతకే పగ్గాలు…
అయితే, సమర్థ నేతకే పగ్గాలు దక్కే అవకాశం ఉంది. మరి అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఆ నలుగురిలో అధిష్టానం మొగ్గు ఎవరికి? అన్నది తేలాల్సి ఉంది. అయితే లక్ష్మణ్‌ను మళ్లీ కొనసాగించాలన్న ప్రతిపాదన ఉందన్న వార్తలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఈ మారు అధ్యక్షుడి మార్పు అనివార్యమని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పదవి కోసం దక్కించుకునేందుకు ఆ నలుగురు తమ ప్రయత్నాలను తమదైన శైలిలో కొనసాగిస్తున్నా అధిష్టానం మాత్రం ధర్మపురి అరవింద్,డికె అరుణల పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పగ్గాలు దక్కే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

కాగా, అధిష్టానం మదిలో ఏముందన్న దానిపై కచ్చితత్వం లేకపోవడంతో అధ్యక్ష పదవిని ఆశించే నేతలంతా తామే తదుపరి అధ్యక్షులమంటూ అధిష్టానంపై మరింత ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరి ఈ పరిస్థితుల్లో పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? పోటీలో ఉన్న వారిలో ఒకరికి కట్టబెడుతుందా? లేక మరో కొత్త వ్యక్తిని అధ్యక్షుడి ఎంపిక చేసి మిగతావారికి షాక్ ఇస్తుందా? అన్న చర్చలు సైతం పార్టీలో జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ అంశానికి పుల్‌స్టాప్ పడటం తధ్యం.. మరి బిజెపి పగ్గాలు ఎవరికి దక్కుతాయో? వేచి చూడాల్సిందే…!

BJP is searching for president of Telangana BJP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News