Home ఎడిటోరియల్ కుండబద్దలు కొట్టిన బజాజ్!

కుండబద్దలు కొట్టిన బజాజ్!

Sampadakiyam     అనుభవిస్తున్న గడ్డు పరిస్థితిని, అలముకున్న వేదనాభరిత, భయోత్పాత వాతావరణాన్ని జాతి యావత్తూ గొంతెత్తి చాటనవసరం లేదు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి అరిచి గీపెట్టనవసరం లేదు, బృంద ప్రకటన చేయవలసిన పని లేదు. ఒక్క బలమైన గొంతు గట్టిగా పెగిలితే చాలు. అది కోట్లాది స్వరాల సమ్మేళనమై వినిపిస్తుంది. దేశమంతటి అంతరంగమై మార్మోగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇప్పుడు ఆ విధంగా జాతి కంఠమై ప్రతిధ్వనించారనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాబోదు. ఇంతకూ రాహుల్ బజాబ్ ఏమన్నారు, ఎవరితో ఎవరి ముందు అన్నారు? “ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికి జనం భయపడుతున్నారు.

అటువంటి విమర్శను అధికారంలోని వారు సహించరనే అభిప్రాయం గాఢంగా పాతుకుపోయి ఉంది” ఈ మాటలను బజాజ్ శనివారం నాడు ముంబైలో జరిగిన ఒక సభలో సాక్షాత్తు ఎన్‌డిఎ ప్రభుత్వ విధానకర్త అనిపించుకుంటున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలోనే అన్నారు. అప్పుడు అక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ కూడా ఉన్నారు. రాహుల్ బజాజ్ ఇలా ఇంత బహిరంగంగా తమను విమర్శించడమే దేశంలో అటువంటి భయోత్పాత వాతావరణం లేదనడానికి నిదర్శనమని అమిత్ షా అదే వేదిక మీది నుంచి సమాధానమిచ్చి ఆ ఆరోపణను త్రోసిపుచ్చే ప్రయత్నం చేశారు. బజాజ్ అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ 2 హయాంలో అప్పటి పాలకులను ఎవరైనా నిర్భయంగా విమర్శించేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని కూడా అన్నారు.

తన సాటి పారిశ్రామిక వేత్తలు సైతం నోరు విప్పడానికి భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. నిష్పాక్షికంగా ఆలోచించేవారెవరికైనా రాహుల్ బజాజ్ మాటల్లో ఏ కొంచెమైనా పొల్లు కనిపించదు. దేశంలో అప్రకటిత ఎమెర్జెన్సీ అమల్లో ఉన్నదనే మాట ఇంతకు ముందు పలువురి నోట పదేపదే వినిపించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల మీద సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్, ఆదాయపు పన్ను అధికారుల చేత దాడులు చేయిస్తున్నదని, అక్రమ కేసులు బనాయింప చేస్తున్నదనే అభిప్రాయమూ నెలకొని ఉన్నది. ప్రతిపక్ష నేతలపై పగ సాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నదనే భావన ఏర్పడి ఉన్నది. దీనిని ఎవరూ కాదనలేరు. అలాగే స్వేచ్ఛగా అభిప్రాయ ప్రకటన చేసేవారిపై వామపక్ష ఉగ్రవాదుల సానుభూతిపరులంటూ అభియోగం మోపుతున్నారని పాలకులు అనిపించుకుంటున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం హిందూత్వ ఎజెండాను, మెజారిటీ స్వామ్యాన్ని నెలకొల్పుతున్నదని ప్రజాస్వామిక ధర్మానికి తలకొరివి పెడుతున్నదనే విమర్శలు తగ్గు స్థాయిలోనైనా వినిపిస్తున్నాయి.

ఆర్థిక రంగంలో గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ కానరాని పతనావస్థ పై వస్తున్న విమర్శలను కూడా ప్రభుత్వం సహించలేకపోతున్నది. గతంలో మోడీ ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్న ఒకరిద్దరు ఆర్థిక వేత్తలు కూడా పాలకులు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఎవరి హితవునూ గౌరవించకుండా, పట్టించుకోకుండా మొండిగా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న రీతిలో పాలకులు వ్యవహరించినందువల్లనే ఇప్పుడు ఆర్థికరంగం ఊహించనంత అధోగతికి చేరుకున్నది. తమ విశ్వాసాలకు భంగం వాటిల్లజేస్తున్నారని తాము భావించినవారిని మూక దాడుల్లో హతమార్చే ‘లించింగ్’ ఘటనలు పెరిగిపోడాన్ని కూడా రాహుల్ బజాజ్ ఎత్తి చూపించారు. మహాత్మ గాంధీని హతమార్చిన నాథూ రాం గాడ్సేని దేశభక్తుడని బిజెపి పార్లమెంటు సభ్యురాలు ప్రజ్ఞాసింగ్ కీర్తించడాన్నీ ప్రస్తావించారు. ఆమెను కీలకమైన పార్లమెంటరీ కమిటీల నుంచి తప్పించిన మాట వాస్తవమేగాని మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఆమె గాడ్సేను దేశభక్తుడంటూ మెచ్చుకున్న సందర్భాన్ని మరచిపోలేము.

అందుకుగాను అప్పుడే ఆమెకు పార్టీ అభ్యర్థిత్వాన్ని నిరాకరించి ఉంటే బిజెపి పెద్దల నిజాయితీని కొనియాడేవారు. గాడ్సేను నెత్తిన పెట్టుకున్న ప్రజ్ఞాసింగ్‌ను ప్రజలు గెలిపించడాన్ని చూపించి ఆమె తప్పుచేయలేదు అని నిరూపించదలచి ఆమెను ఎన్నికల్లో నిలబెట్టారనిపించుకున్నారు. ఇప్పుడైతే ఆమె నుంచి దూరం జరుగుతున్నట్టు కనిపించడానికి బిజెపి నేతలు ప్రయత్నించిన మాట వాస్తవమేగాని గాడ్సే చేసిన తప్పేమిటి అనే ప్రశ్న దేశ ప్రజల్లో తలెత్తేలా చేయడానికి వారు ప్రజ్ఞాసింగ్ ద్వారా పావులు కదిపిన చేదు వాస్తవాన్ని కాదనలేము. నిజమాడితే నిష్ఠూరమన్నట్టు రాహుల్ బజాజ్ తెగించి బలమైన పాలకులకు అప్రియమైన చేదు వాస్తవాలు పలికారు. బజాజ్ విమర్శతోనైనా ప్రధాని మోడీ, అమిత్ షా నిజమైన ఆత్మవిమర్శ చేసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే పరిస్థితి చక్కబడే అవకాశం కలుగుతుంది.

BJP leaders prove point that Rahul Bajaj made