Saturday, April 20, 2024

విషం పూసిన బిజెపి బాణాలు!

- Advertisement -
- Advertisement -

ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి.. తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడానికి.. వినని వారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇడి, ఐటి, ఎన్‌ఐఎ, సిబిఐలను వినియోగించుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. 2014 తర్వాత ఈ సంస్థల కార్యకలాపాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. బిజెపి అధికారంలోకి వచ్చాక సిబిఐ 115కి పైగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 120 మందికి పైగా రాజకీయ నేతలపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తుండగా, ఇందులో 115 మంది ప్రతిపక్షనేతలే. ఈ సంస్థలు ప్రతిపక్షాలకు చెందిన నాయకులను టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ‘ఆప్’ కీలక నాయకులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, జార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్, శివసేన కీలక నేత సంజయ్ రౌత్, ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ వంటి నేతలను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టింది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ జెడియు కీలక నేతల ఇండ్లపై ఐటి దాడులు నిర్వహించింది.

మరోవైపు బిజెపి విధానాలను తీవ్రంగా విమర్శించే దాదాపు 20 మంది మేధావులు, ప్రొఫెసర్లు, పౌర హక్కుల నేతలను ఎన్‌ఐఎ అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. ఇంకా నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతు సంఘాల నేతలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఎన్‌ఐఎ టార్గెట్ చేసింది. అయితే వేధించడమే తప్ప ఇడి నమోదు చేస్తున్న కేసుల్లో కన్విక్షన్ రేటు (ముద్దాయిలకు శిక్ష పడటం) మూడు శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదనే సాకుతో ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, మేఘాలయా, తెలంగాణ రాష్ట్రాలు సిబిఐకి సాధారణ అనుమతిని రద్దు చేశాయి.

మీడియాను తన గుప్పిట ఉంచుకోవడానికి బిజెపి మీడియా సంస్థలపై కూడా సిబిఐ, ఇడి, ఐటిలతో పాటు స్థానిక పోలీసులను దాడులకు ఉసిగొల్పుతున్నది. గతంలో ఎన్‌డిటివిని టార్గెట్ చేసి, ఆ సంస్థ యజమానులు ప్రణయ్ రాయ్, భార్య రాధికా రాయ్‌పై కేసులు నమోదు చేసింది. బిజెపికి వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు ‘దవైర్’ న్యూస్ వెబ్‌సైట్ ఎడిటర్లు కె. వేణు, జాహ్నవి సెన్, వ్యవస్థాపకుడైన సిద్ధార్థ వరదరాజన్ ఇళ్లలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా డిజిటల్ మీడియాను తన నియంత్రణలో ఉంచేందుకు బిల్లులను తీసుకొస్తున్నది. అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛ సూచీని పరిశీలిస్తే 180 దేశాలకు గాను భారత ర్యాంకు 150. అదే 2021లో ఇది 142గా ఉంది. 2016లో 133 గా ఉంది.

ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బిజెపిలోకి వెళ్లగానే పునీతులుగా మారిపోతున్నారు. పార్టీ మారాక ఆ నాయకులపై ఇడి, సిబిఐ, ఐటి వంటి సంస్థలు ఎలాంటి దాడులు చేయడం లేదు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అసోం సిఎం హిమంత బిశ్వశర్మ, టిఎంసి సీనియర్లు సువేందు అధికారి వంటి నేతలు ఇందుకు ఉదాహరణ. టిడిపిలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సిఎం రమేశ్ అనేక కేసులు ఎదుర్కొన్నారు. వారు బిజెపిలో చేరగానే కేసులన్నీ మాయమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులున్నాయి. 2020 మార్చిలో ఆయన బిజెపిలో చేరగానే ఆ కేసే మూతపడింది. కేంద్రాన్ని ప్రశ్నించే వారిని వేధించడం, లేకుంటే కేసులను పక్కకు పెట్టడం ఆనవాయితీగా మారింది.

బిజెపి దాడులకు పలు రాష్ట్రాల్లో అడ్డంకులు తప్పడం లేదు. అయితే ఇవి ప్రాంతీయ (కొన్ని ఒకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ) పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి ఎదురుతిరిగిన మమతా బెనర్జీ విజయం సాధించారనే చెప్పవచ్చు. అయితే ఆ రాష్ట్రంలో బిజెపి కూడా బలపడింది. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు తుడుచి పెట్టుకుపోయాయి. ఇప్పుడు బిజెపిపై టిఆర్‌ఎస్ కూడా తిరగబడుతున్నది. టిఆర్‌ఎస్ మంత్రులు, కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఇడి, ఐటిని ప్రయోగిస్తున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నది. ఎంపి నామా నాగేశ్వరావు ఆస్తులను అటాచ్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును పైకి తీసుకొచ్చారు.

లిక్కర్ స్కామ్ పేరుతో సిబిఐ కూడా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా.. దానికి అనుమతి నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జిఒ తీసుకొచ్చింది. బిజెపి దాడులకు పోటీగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చింది. సిట్ ఏర్పాటు చేసి బిజెపి నాయకులు, సన్నిహితులకు నోటీసులు జారీ చేస్తున్నది. బిజెపి జాతీయ స్థాయి కీలక నేత బిఎల్ సంతోష్ వంటి వారిని సైతం టార్గెట్ పెట్టింది. అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఎస్ కీలక నేతలకు విచారించేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా స్టేట్ జిఎస్‌టి పేరుతో బిజెపి నేతల వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నది. దీనికి పోటీగా బిజెపి సెంట్రల్ జిఎస్‌టిని సైతం టిఆర్‌ఎస్ నాయకులపై ప్రయోగిస్తున్నది. అయితే కేంద్రంతో పోరాడాలంటే చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది. ఆ ధైర్యా న్ని తెలంగాణ సిఎం కెసిఆర్ చూపిస్తున్నారు.

ఫిరోజ్ ఖాన్ 9640466464

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News